కలిసే పోటీ చేద్దాం కామ్రేడ్!
ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రాథమిక చర్చలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్దుబాట్లు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కలిసే సాగాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సర్దుబాట్లపై మరోవిడత భేటీ కావాలని తీర్మానించాయి. ఎన్ని కొత్త పార్టీలు పుట్టుకొస్తాయో వేచి చూసి అనంతరం వేటితో పొత్తులు పెట్టుకోవచ్చో నిర్ణయించుకోవాలని భావిస్తున్నాయి. ప్రస్తుతానికి టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఇరు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సుదీర్ఘకాలం తర్వాత సీపీఐ, సీపీఎం నేతలు గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో సీపీఎం తరఫున పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నేతలు వై.వెంకటేశ్వరరావు, సారంపల్లి మల్లారెడ్డి... సీపీఐ తరఫున పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, రాంనరసింహారావు, పీజే చంద్రశేఖర్ పాల్గొన్నారు. సుమారు గంటసేపు వివిధ అంశాలపై చర్చలు సాగాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించాయి. విజయవాడ తరహాలో అన్ని పట్టణాలు, నగరాల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. చిన్న చిన్న విభేదాలుంటే సర్దుబాట్లు చేసుకోవాలని స్థానిక నాయకత్వాలకు సలహా ఇవ్వనున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగియనున్నందున తక్షణమే కార్యరంగంలోకి దిగాలని పిలుపిచ్చాయి. సమావేశం అనంతరం బీవీ రాఘవులు, నారాయణ మీడియాతో మాట్లాడారు. పొత్తులపై పూర్తి స్థాయిలో విశ్లేషణ జరగలేదని, మరోసారి భేటీ అవుతామని నారాయణ చెప్పారు. ఇప్పటికే నామినేషన్లు వేసిన చోట్ల అభ్యర్థుల బలాబలాలను బట్టి ఎవరు బరిలో ఉండాలో నిర్ణయించుకుంటామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై ఇంకొన్నాళ్లు ఎదురుచూస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న సంకేతాన్ని ఇచ్చారు. సినీనటుడు పవన్ కళ్యాణ్ పార్టీ పుట్టకమునుపే వ్యాఖ్యానించడం తగదంటూనే పవన్ అందంగా ఉన్నాడని కౌగిలించుకోలేమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన పూర్తయినందున గతంలోకి వెళ్లకుండా మున్ముందు ఏమి జరగాలన్నదే ప్రస్తుతం యోచిస్తున్నామని రాఘవులు తెలిపారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకూ అభ్యంతరం ఉండాల్సిన పని లేదని, కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో సర్దుబాట్లకు తాము సిద్ధమేనని చెప్పారు.
టీఆర్‌ఎస్‌తో సీపీఐ, సీపీఐతో సీపీఎం...
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీతో సీపీఎం సర్దుబాట్లు చేసుకోవాలన్న వ్యూహానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమంలో సీపీఐ, టీఆర్‌ఎస్ భుజంభుజం కలిపి నడిచాయి. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్ కూడా తాము సీపీఐతో పొత్తుకు సిద్ధమని చెప్పారు. ఈమేరకు ఇరుపార్టీల నేతల మధ్య ఢిల్లీలో ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించి పాత ముచ్చట మరిచి ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సీపీఐతో చర్చలకు సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌తో పొత్తుకూ సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఇందుకు టీఆర్‌ఎస్ అంగీకరిస్తుందో లేదో తెలియనందున సీపీఐని మధ్యలో పెట్టి సీపీఎం తెలంగాణలో ఎన్నికల్ని ఎదుర్కోవాలని భావిస్తోంది. సీపీఐ రాష్ట్ర నాయకత్వం కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.