అల్లు అర్జున్ పేరిట ఓటుకు దరఖాస్తు
సైబర్ క్రైం పోలీసులకుకలెక్టర్ సమాచారం
‘ఆన్లైన్’ దరఖాస్తుపై కేసు నమోదు
వరంగల్ (పోచమ్మ మైదాన్) : ఇటీవల విడుదలైన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించిన విషయం విదితమే. ఈ మేరకు చరిత్రతో పాటు సినిమాలోనూ రాణి రుద్రమదేవికి అండగా నిలిచే ఆయనకు కాకతీయుల రాజధాని అయిన వరంగల్లో ఓటు హక్కు ఉండాలని అనుకున్నారో ఏమో కానీ... గుర్తు తెలియని వ్యక్తులు ఆ దిశగా ముందడుగు వేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కోసం సినీ హీరో అల్లు అర్జున్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు.
‘అల్లు అర్జున్, తండ్రి అరవింద్, ఇంటి నంబర్ 16-10-1452. ఖిలా వరంగల్’ చిరునామాపై దరఖాస్తు రాగా.. వరంగల్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది గురువారం చేపట్టిన పరిశీలనలో ఈ దరఖాస్తును చూసి ఖంగుతిన్నారు. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించగా.. మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.