రెండోవిడత కౌన్సెలింగ్కు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ : ఎంసెట్ రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 15 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. 2013-14 అనుబంధ కళాశాలలకే వర్తిస్తుందని, స్లైడింగ్కు అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో తెలంగాణలోని 174 కళాశాలలకు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్ కు అనుమతి లభించింది.
అలాగే డిసెంబర్ 31 నాటికి తరగతులు ముగించాలని సూచించింది. ఆదివారం రోజు తరగతులు నిర్వహించరాదని ఆదేశాలు ఇచ్చింది. రోజుకు ఎనిమిది మాత్రమే తరగతులు నిర్వహించాలని, మొదటి సెమిస్టర్ 527 గంటల్లో పూర్తి చేయాలని తెలిపింది. ఏఐసీటీసీ షెడ్యూలు ప్రకారం జనవరి 15తో తొలి సెమిస్టర్ పూర్తవుతున్నందున.. ఇందులో పరీక్షలకు కొన్ని దినాలు, అందుకు విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు 15 రోజులు తీసేసి, ఆదివారాలు కూడా మినహాయించి కనీసం 60 రోజుల పని దినాలను చూపాలని న్యాయస్థానం పేర్కొంది. పని గంటలు కూడా 10 గంటలకు మించరాదని, అందులో గంట భోజన విరామం ఉండాలని సూచించింది. కాగా రెండో విడత కౌన్సెలింగ్ కోసం గడువు పొడిగించేందుకు తమకు ఇబ్బందేమీ లేదని, తరగతుల నిర్వహణకు తగిన షెడ్యూలు ఇవ్వాలంటూ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ, ఎస్ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.