ఆ పార్టీలో మూడు స్తంభాలాట!
♦ అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు
♦ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎడపాడి పాట్లు
♦ ఎడపాడి, దినకరన్, పన్నీర్‌సెల్వం వర్గాల పోరు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ కనుసైగకు కట్టుబడి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన అన్నాడీఎంకే మూడు స్తంభాలాటలా మారింది. సీఎం ఎడపాడి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, టీటీవీ దినకరన్‌ల ఆధిపత్యపోరుతో పార్టీ అట్టుడికిపోతోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ముఖ్యమంత్రి కావాలన్న దినకరన్ కలలు ఫలించలేదు. పైగా తీహార్ జైలు జీవితం గడిపి బెయిల్‌పై వచ్చిన దినకరన్ అధికార పార్టీ నేతలపై తన రాజకీయకసిని ప్రదర్శిస్తున్నారు. ఎడపాడి ప్రభుత్వాన్ని కూల్చివేయడమే ప్రధాన లక్ష్యంగా పావులుకదుపుతున్న దినకరన్ బుధవారం నాటికి 31 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టగలిగారు. శశికళే తమ ప్రధాన కార్యదర్శి అని మంత్రి రాజేంద్రబాలాజీ బుధవారం వ్యాఖ్యానించారు.
కొందరు మంత్రులు దినకరన్‌కు మద్దతుగా సీఎంపై బహిరంగ విమర్శలు చేశారు. దినకరన్‌ను బహిష్కరించినట్లు ప్రకటించడం ద్వారా అన్నాడీఎంకేలో కల్లోలానికి మంత్రి జయకుమార్ ప్రధాన కారకుడని పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ ఆరోపించారు. ప్రజలకు, పార్టీకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీరుగాక పుదుచ్చేరీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు దినకరన్‌కు జై కొడుతున్నారు. ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడిన సీఎం ఎడపాడి తన ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. దినకరన్‌ను తీవ్రంగా విభేదించే శశికళ తమ్ముడు దివాకరన్ను చేరదీయడం ద్వారా అతనివైపున్న మంత్రుల మద్దతు కూడగట్టగలిగారు.
అంతేగాక ఎమ్మెల్యేలను తన వద్దకు పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసే వరకు తన ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదని ఎడపాడి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే తనవంతు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పన్నీర్‌సెల్వంతో చేతులు కలపడం ద్వారా దినకరన్ ఢీకొట్టాలని సీఎం భావిస్తున్నారు. విలీనం చర్చలను మరోసారి ముందుకు తెచ్చారు.
శశికళకు ఉద్వాసన పలికి సాధారణ సభ్యత్వం, దినకరన్ బహిష్కరణ, శశికళ తీసుకున్న నిర్ణయాలు రద్దు, వేటుపడిన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం, పన్నీర్‌సెల్వంకు పార్టీ పగ్గాలు, సీఎంగా ఎడపాడి కొనసాగడం వంటి కొత్త ఒప్పందాలకు ఇరువర్గాలు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే జయలలిత మరణంపై న్యాయవిచారణకు ఆదేశించాలన్న పన్నీర్‌వర్గం డిమాండ్‌పై ఇంకా స్పష్టత లేదు.
ఎడపాడి, పన్నీర్‌సెల్వం, దినకరన్‌ల మధ్య మూడు స్తంభాలాటలా సాగుతున్న అన్నాడీఎంకే రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ జోక్యం వల్లనే అన్నాడీఎంకే మూడు ముక్కలైందని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ విమర్శించగా, మెజార్టీ ఎమ్మెల్యేల బలం కోల్పోయిన సీఎం ఎడపాడి రాజీనామా చేయాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ అన్నారు.
దినకరన్‌ను కలుసుకున్న నటి విజయశాంతి: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపుకోసం ప్రచారం చేసిన నటి విజయశాంతి బుధవారం చెన్నైకి వచ్చి ఆయన్ను కలుసుకున్నారు. దినకరన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అన్నారు.