edida nageswara rao
-
నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’ మూవీ లోగో విడుదల
జాతీయస్థాయిలో పలు అవార్దులు పొంది తెలుగులో గర్వించే సంస్థగా పేరొందిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్లో తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర లోగోను సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ చిత్రంతో ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ శిష్యులు వంశీ, లక్ష్మీనారాయణలు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఏడిద నాగేశ్వరరావుగారు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది గ్రేట్ జర్నీ. అలాంటి గొప్ప సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. శంకరాభరణం, స్వాతిముత్యం.. ఇలా చాలా క్లాసిక్ మూవీలు వారి సంస్థ నుంచి వచ్చాయి. ఆ సినిమాలన్నీ చూశాను. వారి సినిమాల్లో ‘ఆపద్భాంథవుడు’ సినిమా చాలా ఇష్టం. నేను చదువుతున్న రోజుల్లో ఆ సినిమా చూశాను. కానీ అది ఆడలేదని చాలా కోపం వచ్చింది. ఎందుకు ఆడలేదో ఆర్థం కాలేదు. ఈ జర్నీలో వారి వారసులు నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్‌కు హెల్ప్ అవడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సంస్థలో అవకాశం ఉంటే తప్పకుండా నేను సినిమా చేస్తాను. ఇకపై శ్రీజ ఎంటర్టైన్మెంట్లో మంచి సినిమాలు రావాలి’ అని అన్నారు. అనంతరం దర్శకుడు అనుదీప్‌పై ఈ సందర్బంగా అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాకు అనుదీప్ కథ, స్క్రీన్క్‌ప్లే, డైలాగ్ ఇచ్చాడంటే చాలా ఫన్ ఉంటుంది. జాతిరత్నాలు హిట్ తర్వాత తన స్వార్థం చూసుకోకుండా తన తోటివారిని ఎంకరేజ్ చేయడం నాకు గర్వంగా ఉంది. దర్శకుడు వంశీ ఎం.బి.బి.ఎస్. చదివాడు. సినిమాపై తపనతో ఈ రంగంలోకి వచ్చాడు. ఇప్పుడు అనుదీప్ వల్ల దర్శకుడు అయ్యాడు’ అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, వివిఎల్. నరసింహారావు తదితరులు నటిస్తున్నారు. -
ఏడిదకు కడసారి వీడ్కోలు
-
ఏడిద నాగేశ్వరావుకి ప్రముఖుల నివాళి
-
ఆయన నా నిర్మాత కావటం అదృష్టం: చిరంజీవి
హైదరాబాద్ : భారతీయ సినీ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గౌరవాన్ని ఇనుమడించేలా ఏడిద నాగేశ్వరారవు సినిమాలు తీశారని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ఆయన సోమవారం ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పూర్ణోదయ సంస్థలో తొలిసారి తాను 'తాయారమ్మ, బంగారయ్యా' చిత్రంలో గెస్ట్ రోల్ చేశానని, ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాల్లో నటించానట్లు చెప్పారు. ఆ రెండు సినిమాలు అత్యద్భుతమైన చిత్రాలని, ఆ సినిమాలు ఆ రోజుకూ తలనమానికంగా నిలిచి, గొప్పగా చెప్పుకునే చిత్రాలన్నారు. ఆ రెండు సినిమాల్లో తనకు అవార్డులు తెచ్చిపెట్టాయని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. నటుడు కావాలని చిత్ర పరిశ్రమకు వచ్చిన ఏడిద నాగేశ్వరరావు గారు.... అత్యున్నత అభిరుచి గల నిర్మాతగా తనను తాను ఆవిష్కరించుకున్నారని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఎన్ని కమర్షియల్ సినిమాలు వచ్చినా వాటికి లోబడకుండా కళాత్మక విలువలు ఉన్న సినిమాలను ఆయన ప్రేక్షకులకు అందించారన్నారు. కళా సేవతో సినిమాలు చేశారని, ఆయన సంస్థ రూపొందించిన సినిమాల్లో నటించటం తన అదృష్టమన్నారు. ఆయన తీసిన ఒక్కొక్క సినిమా ఓ ఆణిముత్యమన్నారు.అలాంటి ఏడిద నాగేశ్వరరావుగారు మన మధ్య లేకపోవడం దురదృష్టకమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చిరంజీవి ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
'ఆయన నా నిర్మాత కావటం అదృష్టం'
-
ఏడిదకు నివాళి మంచి సినిమా మరలిపోయింది..
-
ఏడిదకు నివాళి మంచి సినిమా మరలిపోయింది...
మూగ అమ్మాయి, దంపతుల తగాదాలు తీర్చే ముసలి దంపతులు, ఒకప్పుడు బాగా బతికి ఆ తర్వాత చితికిపోయిన గాత్ర విద్వాంసుడు, తాడూ బొంగరం లేకపోయినా పరాయి మతం అమ్మాయితో ప్రేమలో పడే అల్లరి చిల్లరి కుర్రాడు, జీవితంలో అన్ని విధాలా దివాలా తీసిన డాన్సర్... ఇలాంటి పాత్రలు తెరమీద కనపడాలంటే ఆ నిర్మాతకు ఉండాల్సింది కరెన్సీని ఎంచే వేళ్లు కాదు... కథను అక్కున జేర్చుకునే గుండె . ఏడిదకు అది నిండుగా ఉంది. ‘సాగర సంగమం’లో ఒక సన్నివేశం ఉంటుంది. ‘పంచభూతములు ముఖపంచకమై..’ అనే చరణానికి ఎస్.పి.శైలజ చేసిన అభినయాన్ని తప్పు పడుతూ రిపోర్టర్ పాత్రధారి అయిన కమల్ పిచ్చి చేష్టలు కుప్పిగంతులు అని రిపోర్ట్ రాస్తాడు. అది చూసి శైలజ ప్రియుడు రెచ్చిపోయి నీకేం తెలుసని... అపాలజీ చెప్పరా బాస్టర్డ్ అంటాడు. అప్పుడు జరిగే సన్నివేశం తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ఇష్టమైనది. ‘సాగర సంగమం’ ఎప్పుడొచ్చినా అందరూ పదే పదే చూసేది. ఆ సన్నివేశంలో కమల్ పంచభూతములు అనే చరణానికి భరతనాట్యం, కథక్, కథాకళి... ఈ నృత్య సంప్రదాయాలన్నింటిలోనూ అభినయం చేసి చూపిస్తాడు. పొగరు కాదు అది. పాండిత్యం. మంచి కథను ఎంపిక చేసుకోవడంలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు కూడా అలాంటి పాండిత్యమే ఉంది. లేకుంటే మూగపిల్ల ఉంటుంది.... ఆమెకు డాన్స్ చేయాలని ఉంటుంది అనంటే బాగుందే అని ‘సిరిసిరిమువ్వ’ తీయడానికి అంగీకరించేవారా? ఒక గొప్ప గాత్ర విద్వాంసుడు. కాలం మారి సంగీతం కలుషితమయ్యి సంప్రదాయానికి విలువ తగ్గిపోయి దీనావస్థలో బతుకుతుంటాడు అనంటే ఇది చెప్పాల్సిన కథే అని రంగంలోకి దిగి ఉండేవారా?... మంచి దర్శకులు ఎప్పుడూ తయారవుతూనే ఉంటారు. గొప్ప కథలు సిద్ధమవుతూనే ఉంటాయి. కాని కళ ఉన్నవాడి దగ్గర కాసు ఉండదు.కాసు ఉన్నవాడికి ఆ కళను గ్రహించగలిగే శక్తి ఉండి దానిని జనం దగ్గరకు తీసుకెళ్లాలనే హృదయం ఉండాలి. మంచి పని చేస్తే విజయం ఎలాగూ వస్తుంది. దాని వెనుక కాసు రాకుండా ఉంటుందా? ఏడిద నాగేశ్వరరావు తీసిన సినిమాలు చూస్తే అదే అనిపిస్తుంది. ‘శంకరాభరణం గొప్పదా... సాగర సంగమం గొప్పదా’ అనంటే శంకరాభరణమే గొప్పది అనంటాను. ఎందుకంటే కమల్ లేకపోతే ‘సాగర సంగమం’ లేదు. కమల్ని దృష్టిలో పెట్టుకోకపోతే ఆ సినిమా కథ లేదు. కాని ‘శంకరాభరణం’ అలా కాదు. అది దానికదే ఒక ప్రాణమున్న కథ. దానికి నటులతో పని లేదు’ అన్నారు కృష్ణవంశీ ఒక సందర్భంలో. నిజం. దానికదే ఒక కథ అయిన దానిని ఏడిద నాగేశ్వరరావు గౌరవించారు. దర్శకుడు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలకు సపోర్టివ్‌గా నిలిచారు. నాటకాలు వేసుకునే జె.వి.సోమయాజులు, వాంప్ పాత్రల ముద్రపడిన మంజుభార్గవి... వీళ్లతో సినిమా తీయడమా? నిర్మాతకు దర్శకుడి మీద నమ్మకం ఉంది. ప్రేక్షకుల మీద ఇంకా ఎక్కువ నమ్మకముంది. యాక్షన్ సినిమాలు, డబుల్ మీనింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలు.... సీజన్ ఏదైతే దాని చుట్టూ పరిశ్రమ తిరగడం చాలా సార్లు జరిగింది. కాని పూర్ణోదయా సంస్థ, దాని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పంథాలో మాత్రం మార్పు లేదు. మంచి కథ, మంచి దర్శకుడు, మంచి సంగీతం... ఈ మూడింటినే నమ్ముకున్నారు. ఏడిద నాగేశ్వరరావుకు తాను తీసిన సినిమాల్లో కీలకమైన సూచనలు చేసే శక్తి ఉంది. ‘సాగర సంగమం’లో చివరన హీరో చనిపోవాలా వద్దా అనే తర్జన భర్జన జరుగుతున్న సందర్భంలో చనిపోతేనే బాగుంటుందన్న సూచన ఆయనదే. అది ప్రేక్షకులకు ఎటువంటి ఫీల్ మిగిల్చిదో మనకు తెలుసు. ‘సీతాకోక చిలుక’ క్లయిమాక్స్‌ను దుఃఖాంతం చేయాలని దర్శకుడు భారతీరాజా పట్టుబట్టారు. కాని సుఖాంతమే కరెక్టని ఏడిద పంతం. భారతీరాజా రెండు విధాలుగా చిత్రీకరించి తెలుగులో నిర్మాత కోరిక మేరకు సుఖాంతం, తమిళంలో దుఃఖాంతంతో విడుదల చేద్దామనుకుని చివరకు ఏడిద నిర్ణయమే కరెక్టని రెండు భాషల్లోనూ సుఖాంతంగా విడుదల చేశారు. అది ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. ఒక చెప్పులు కుట్టేవాడి పాత్ర చిరంజీవికి బాగుంటుంది.. ఆయన చేస్తే జనం చూస్తారు అనే నమ్మకం ఒమ్ముకాకపోవడం కూడా ఏడిద అభిరుచికి ఒక నిదర్శనం. ఏడిద నాగేశ్వరరావు చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ‘సితార’ వంటి కొత్త తరహా కథ చెప్పినా, కొత్త తరహా సంవిధానంతో తీసినా వంశీ వంటి కొత్త దర్శకుడికి మద్దతుగా నిలిచి ఆయనను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత ఆయన.సినిమా ఇండస్ట్రీలో చాలా థియరీలు ఉంటాయి. ఫలానా కథ మాస్కు ఎక్కదని ఫలానా కథ యూత్‌కు పట్టదని.... ఏడిద నాగేశ్వరరావు ఈ లెక్కలేవి వేసుకున్న పాపాన పోలేదు. ‘సిరిసిరి మువ్వ’తో మా అనుబంధం మొదలైంది. ఆ తర్వాత పూర్ణోదయాలో ‘శంకరాభరణం’ చేశాను. ఆ చిత్రంతో దర్శకుడిగా నాకు ఇంకో కొత్త తొడుగు వచ్చినట్లయింది. ఆ తర్వాత మేం చేసిన ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘స్వర్ణకమలం’ చిత్రాలు కూడా ఆణిముత్యాలే. ఏడిద నాగేశ్వరరావుగారి స్థానం భర్తీ కానిది.ఙ- కె.విశ్వనాథ్, దర్శకుడు విలువలున్న చిత్రాలు తీశారు. భాగస్వామ్యంతో ఆయన తీసిన ‘సిరి సిరి మువ్వ’లో హీరోగా చేశాను. పూర్ణోదయా సంస్థపై నిర్మించిన చిత్రాల్లో ‘శంకరా భరణం’, ‘తాయారమ్మ బంగారయ్య’లో గెస్ట్ రోల్స్ చేశాను. ఏడిద నాగేశ్వరరావుగారితో నాది 30ఏళ్ల అనుబంధం. ఆయన మరణం తీరని లోటు. - చంద్రమోహన్, నటుడు ఏడిద నాగేశ్వరరావుగారు నిర్మించిన చిత్రాల్లో నేను పాడని చిత్రం లేదు. ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ చిత్రాలకు జాతీయ అవార్డులు పొందాను. ఆరోగ్యవంతమైన సినిమాలు, సకుటుంబంగా చూడబడే సినిమాలు కూడా వ్యాపారాత్మకమైన సినిమాలని నిరూపించిన సంస్థ పూర్ణోదయా. చిత్రసీమ ఓ మంచి నిర్మాతను కోల్పోయింది. - బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు నాలో ఆయన్ను చూసుకున్నారు ‘‘నాన్నగారు గొప్ప నిర్మాత మాత్రమే కాదు.. మంచి వ్యక్తి కూడా. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు ఏడిద శ్రీరామ్. తండ్రి గురించి మరికొన్ని విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నాన్నగారికి నటన అంటే చాలా ఇష్టం. మొదట్లో కొన్ని పాత్రలు చేశారు. కానీ, నిర్మాత అయిన తర్వాత ఆయనంతట ఆయన నటుడిగా రిటైర్ అయ్యారు. నేను నటుడు కావాలన్నది ఆయన కోరిక. నాలో తనను చూసుకోవాలనుకున్నారు. అందుకే నేను ఆర్టిస్ట్ అయినప్పుడు చాలా ఆనందపడ్డారు. ఇటీవల ‘శ్రీమంతుడు’లో నేను చేసిన పాత్రను చాలా ఇష్టపడారు. నాన్నగారు ఆరోగ్యంగానే ఉండేవారు. గత నెల 19న వాంతులు అయ్యాయి. దాంతో ఆస్పత్రిలో చేర్చాం. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. నాన్నగారు పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. అది మాకు సంతృప్తిగా ఉంటుంది. కానీ, నాన్నగారి మరణం మా కుటుంబానికి తీరని లోటు’’. - ఏడిద శ్రీరామ్, నటుడు పూర్ణోదయ సంస్థలో ఆరు చిత్రాల్లో నటించాను. ఏడిద నాగేశ్వరరావుగారికి నేనంటే ఓ గురి. అందుకని, నాకు నప్పే పాత్ర ఉంటే తప్పకుండా తీసుకునే వారు. కమర్షియల్ చిత్రాలు తీస్తేనే సక్సెస్ కాగలం అనే పరిస్థితి ఉన్న తరుణంలో, ఆ పంథాలో కాకుండా తాను నమ్మిన కథతో సినిమాలు తీసి, కమర్షియల్ విజయం సాధించారు. మంచి నిర్మాతగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. -శరత్‌బాబు, నటుడు పూర్ణోదయా చిత్రావళి ప్రతి ఒక్కడూ మనిషే. ఒక మంచి కథ మన హృదయాన్ని తాకితే హృదయాన్ని తాకేలా తీయగలిగితే అది అందరికీ చేరుతుంది అని నమ్మాడాయన. ఆయనగాని, ఆయన సినిమాలుగాని ఇప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ ఒక రుజువులా నిలిచిపోతాయి.- సాక్షి ఫ్యామిలీ -
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
దొరకునా ఇటువంటి సేవా... ఇది పల్లవి. ఇప్పుడు అనుపల్లవి రాయాలి. వేటూరి రాశారు. నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ... ఆత్రేయ అంతటివాడే భయపడిపోయాడు- కొండ వీటి చాంతాడంత ఉంది.. ఇది అనుపల్లవా అని. కాని అనుపల్లవే. అంత పొడవైనదే. దర్శకుడు ఓకే అన్నాడు. నిర్మాత డబుల్ ఓకే అన్నాడు. ఈ అనుపల్లవి రాసిన వేటూరే అంతకు కొంత కాలం ఆరేసుకోబోయి పారేసుకున్నాను అన్నాడు. జనం దానికి వెర్రెక్కిపోయారు. ఇండస్ట్రీ కోటి రూపాయల పాట అంది. మూడ్ ఇలా ఉన్నప్పుడు ఏ నిర్మాత అయినా చిలక కొట్టుడు కొడితే అనాలి. లేదంటే చీరలెత్తుకెళ్లాడే చిలిపి కృష్ణుడు అని ప్రేక్షకుల కోసం హీరోయిన్ అందచందాలు ఆరబోయాలి. కాని ఈ నిర్మాత అలా అనుకోలేదు. పాటను పాన్‌లా చేసి నమిలి ఊసే ఒక పదార్థం అనుకోలేదు. పల్లవి అనేది పరులకు కన్నుగీటే దురదృష్టవంతురాలైన వెలయాలు అనుకోలేదు. అది ఒక స్త్రీ. చక్కటి కన్నెపిల్ల. లేదంటే సజీవ అనుభూతులు ఉన్న ఒక ప్రాణం. స్నేహం చేయ బుద్ధేసే సాటి స్పందన. తనువూగింది ఈ వేళ.... అని ఉంటుంది ‘సిరిసిరి మువ్వ’లో. సుశీల పాడుతుంటే తనువు ఊగుతుంది. ఝమ్మంది నాదం... అని అంటుంటే పాదం సై అంటుంది. అది పాట. అదీ పూర్ణోదయా సంస్థ. అదీ ఒక నిర్మాతకుండాల్సిన అభిరుచి. ఆ అభిరుచి పేరే ఏడిద నాగేశ్వరరావు. హిందీలో ఆర్.కె. స్టూడియోస్ అంటే కేవలం గొప్ప సినిమాలు మాత్రమే కాదు. గొప్ప పాటలు కూడా. దేవ్ ఆనంద్ సొంత బేనర్ నవకేతన్ బేనర్ అంటే ఎస్.డి.బర్మన్- రఫీ- కిశోర్- లతా కలిసి చేసే గళ సమ్మోహనం. కె.ఆసిఫ్, నాసిర్ హుసేన్ ఇలాంటి వాళ్లంతా సినిమాకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో పాటకూ అంతే ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగులో బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, దుక్కిపాటి, ఆదుర్తి వంటి వారు తొలి తరంలో నిలిస్తే మలి తరంలో పూర్ణోదయా సంస్థ, మురారి, యువచిత్ర ఈ పరంపరను సగౌరవంగా నిలబెట్టాయి. పూర్ణోదయాకు గాని, యువచిత్రకు గాని నోటి నిండా తాంబూలం పండి కనిపించే మామా - కె.వి. మహదేవనే రాగం... తానం... పల్లవి. ‘శంకరాభరణం’ ముఖ్యతారాగణంలో ‘పాట’ కూడా ఒకటి. సినిమా మొదలెడుతూ వేటూరిని, మహదేవన్‌ని ఉద్దేశించి నమస్కరిస్తూ మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నారట విశ్వనాథ్. కాని అంత కంటే ఎక్కువ నమ్ముకున్నది ఏడిద నాగేశ్వరరావే. సినిమా ఫ్లాప్ అయితే విశ్వనాథ్‌కు ఇంకో సినిమా దర్శకత్వానికి అవకాశం దొరుకుతుంది. కాని పెట్టిన పెట్టుబడి తుడిచిపెట్టుకుని పోతే పైకి లేవడానికి నిర్మాతకు ఒక జీవిత కాలం పడుతుంది. కాని ఏడిద పెట్టుకున్న నమ్మకం ఒమ్ముకాలేదు. బ్రోచేవారెవరురా... అని దప్పికతో నోళ్లు తెరుచుకుని ప్రేక్షకుల మీద ఈ పాటలు కుంభవృష్టిలా కురిశాయి. మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు... అనంటే అవును కాబోలు అనుకుంటూ తడిశారు. ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరిమువ్వలు కాబోలు... అనంటే అవును కాబోలు అంటూ తడిసి ముద్దయ్యారు. ఇప్పటికీ ఏ డిస్కషన్లో కూచున్నా ఏ పాట చేస్తున్నా అబ్బే రిక్షావాడికి ఎక్కదండీ అని కొట్టిపారేస్తుంటాడు. ఆంధ్రదేశంలో ప్రతి రిక్షావాడు ఈ పాట పాడాడు... శంకరా... నాదశరీరా పరా... తెలుగువారికి ఒక తమిళుడి బాకీ తాత్కాలికంగా తీరింది. ఇంకో తమిళవాడి బాకీ మిగిలి ఉంది. ఏడిద నాగేశ్వరరావు ఆ బాకీ చెల్లింప చేశారు. ‘సీతాకోకచిలుక’ పాటలను ఇచ్చి ఆలిండియా రేడియో మోగే ఇళ్లల్లో ఆడవాళ్ల తీరిక వేళలను సఫలం చేశారు. మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మా.... పాట చుక్కలాగా నవ్వడం వేకువ చుక్కానిలా దారి చూపడం ఈ పాటలతో చూశారు. మాటే మంత్రము... మనసే బంధము.... జనం విని తలలను పడగల్లా ఆడిస్తూ ‘పాటే మంత్రము’ అని అంగీకరించి పూర్ణోదయాకే తమ ఓటు అని కలెక్షన్ బాక్సుల్లో నోట్ల కాగితాలను జార విడిచారు. సాగరసంగమానికి మొదటి హీరో స్క్రిప్ట్. రెండో హీరో కమలహాసన్. మూడో హీరో ఇళయరాజా చేసిన పాట. 1983 అంటే చక్రవర్తి మంచి ఊపు మీద ఉన్నారు. పాట రగులుతున్న మొగలిపొదలా ఉంది. ఆ సమయంలోనే నిశ్శబ్దంగా ఒంటి మీద చప్పుడు చేయకుండా జారే స్నానపు ధారగా లేతగా నాసికను తాకే నురగ సువాసనగా మౌనమేలనోయి ఈ మరపురాని రేయి... వచ్చింది. ప్రేక్షకులు స్పెల్‌బౌండ్ అయ్యారు. తకిట తథిమి తకిట తథిమి తందానా... అనంటే టెన్షన్‌తో అట్టుడికి బావికి వలలు పట్టారు. గొడుగు మర్చిపోయి గట్టు దాకా పరిగెత్తి ఆ తాగుబోతు కళాకారుడి చేయి పట్టుకున్నారు. ఇక ‘సితార’ వచ్చింది కిన్నెరసానిని తెచ్చింది. పచ్చని చేల పావడగట్టి కొండమల్లెలె కొప్పున గట్టి వచ్చే పాట ఎంత రూపసిగా, ఎంత లావణ్యంతో, ఎంత దేశీయ సౌందర్యంతో ఉంటుందో చూసి విచ్చుకున్న పెదవులతో మెచ్చుకున్నారు. ‘స్వాతిముత్యం’లో సినారె సువ్వి సువ్వి సువ్వాలమ్మాఅన్నారు. వటపత్ర శాయికి వరహాలలాలి పాడితే ఎలా ఉంటుందో చూపి ఇంటింటి తల్లులకు ఓ లాలిపాట అరువిచ్చారు. ఇవన్నీ ఒకెత్తు పూర్ణోదయాకు రమేశ్ నాయుడు చేయడం ఒకెత్తు. చిరంజీవి చెప్పులు కుట్టేవాడట. వీపున బిడ్డను కట్టుకుని పాట పాడతాడట. తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్... ఇంకేం పారాహుషార్. విన్న ప్రతివాడూ దాని వెంట నడుస్తూ ఆ కొండల్లో కోనల్లో తప్పిపోయాడు. మంచి గడపను చూస్తే మంచి ముగ్గేయబుద్ధవుతుంది... మంచి నిర్మాణ సంస్థ దొరికితే ఎవరికైనా సరే మంచి పాటే చేయబుద్ధవు తుంది. సిగ్గూ పూబంతి యిసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి... ఎంత జానపద సౌందర్యం. సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ... ఇంత మంచి పాట ఇచ్చాక ప్రేక్షకులు ఏమడిగినా ఇవ్వకుండా ఉంటారా? చివరి సినిమా ‘ఆపద్బాంధవుడు’. స్వర సేనాపతి కీరవాణి. హార్మోనియం మీద కత్తులు కాదు దూయాల్సింది. మల్లెల గుత్తులు. విరజాజుల పొత్తులు. మీటాడు. ఔరా అవ్ముక చెల్లా ఆలకించి నవ్ముడమెల్లా అంత వింత గాథల్లో ఆనంద లాల... హిట్ పడిపోయింది. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి... మరోసారి మంచి సిరివెన్నెల పాటకు దారి దొరికింది. ఆ తర్వాత పూర్ణోదయా సంస్థ సినిమాలు తీయలేదు. చాలా సినిమాలు వస్తున్నాయి. అప్పుడప్పుడు మంచి పాటలు మెరుస్తున్నాయి. కాని దండలోని ప్రతి పువ్వునూ సువాసన కలిగినదిగా చూడటం... ముంచిన ప్రతి కడవనూ పాలతో నింపడం... పట్టిన ప్రతి దోసిలినీ తేనెతో తొర్లేలా చేయడం పూర్ణోదయాకే చెల్లింది. ఆ సంస్థ సినిమాలకే దక్కింది. ఏడిద నాగేశ్వరరావుకు సెలవు. - ఖదీర్ -
శంకరాభరణం టైటిల్‌తో...
‘శంకరాభరణం’... తెలుగు తెరపై ఓ క్లాసిక్.జేవీ సోమయాజులు, మంజు భార్గవి, బేబీ తులసి ముఖ్యతారలుగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై ఇప్పటికి 35 ఏళ్లయినా ప్రేక్షకుల మనోఫలకాలపై శాశ్వతంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ ప్రస్తావన దేనికంటే... ‘శంకరాభరణం’ టైటిల్‌తో తెలుగులో మరో సినిమా రూపొందనుంది. రచయిత కోన వెంకట్ ఈ టైటిల్‌తో స్క్రిప్టు సిద్ధం చేశారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇటీవలే అంజలి కథానాయికగా ‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. కోన వెంకట్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలుకానుంది. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలుస్తాయి. -
సినీ కళా పూర్ణోదయ కర్తకు ఎనిమిది పదులు
ఎనభై రెండేళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో కొన్ని వందల మంది నిర్మాతలు, వేలకొద్దీ సినిమాలు వచ్చాయి. కానీ, జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమా కీర్తిని వ్యాపింపజేసిన నిబద్ధత గల నిర్మాతలు, సినిమాల సంఖ్య మాత్రం కొద్దే. ముఖ్యంగా, తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా బాట పట్టిన 1970, ’80లలో అలాంటి అరుదైన మంచి చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకోవడం ఆషామాషీ విషయం కాదు. ‘శంకరాభరణం’ లాంటి ఆణిముత్యాలతో ఆ ఘనతను అందుకున్న అరుదైన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. కాకినాడ కాలేజీ రోజుల్లోనే ‘ఇన్స్పెక్టర్ జనరల్’ లాంటి నాటకాలు ప్రదర్శించి, హీరో అవుదామని సినీ రంగానికి వచ్చిన కళాప్రియుడు ఏడిద. డబ్బింగ్ కళాకారుడిగా, తరువాత చిన్నాచితకా వేషాల ఆర్టిస్టుగా ప్రయత్నించిన ఆయన నిర్మాతగా స్థిరపడినప్పుడూ ఆ కళాభిరుచిని వదులుకోకపోవడం విశేషం. నిర్మాతగా ఆయన తీసినవి పట్టుమని పది చిత్రాలే. ‘పూర్ణోదయా మూవీ క్రియేషన్స్’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు సినిమా తల్లికి పదికాలాలు నిలిచే పట్టు చీరల్లాంటి సినిమాలు కట్టబెట్టారు. ఏ దేశం వెళ్ళినా, ఇవాళ తెలుగువారు సగర్వంగా చెప్పుకొనే ‘శంకరాభరణం’ (’80), ‘సాగర సంగమం’ (’83), ‘స్వాతిముత్యం’ (’86) లాంటి కళాఖండాలు నిర్మాతగా ఆయన అభిరుచిని పదుగురికీ పంచాయి. ప్రేక్షకుల అభిరుచిని పెంచాయి. మన సినిమాకు ప్రశంసలు, పురస్కారాలు తెచ్చాయి. నిర్మాతగా తాను ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించడానికి దర్శకుడు కె. విశ్వనాథ్, రచయిత జంధ్యాల లాంటి ఎంతోమంది సృజనశీలురు కారణమని ఆయన ఎప్పుడూ నిజాయితీగా నమ్రతతో చెబుతుంటారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సినీ అవార్డుల కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం చిత్ర నిర్మాణానికి దూరంగా విశ్రాంతి జీవితం గడుపుతున్నారాయన. వయోభారం ఇబ్బంది పెడుతున్నా, చెన్నై, హైదరాబాద్‌ల మధ్య తిరుగుతూ, ఇప్పటికీ ముఖ్యమైన సినీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సినిమా పట్ల తరగని ఆయన ప్రేమకు దర్పణం. ఇవాళ్టితో 80 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఈ సినీ కళాపూర్ణోదయ కర్తకు శుభాకాంక్షలు.