కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.. | tribute to legendary producer edida nageswara rao | Sakshi
Sakshi News home page

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..

Published Mon, Oct 5 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..

 దొరకునా ఇటువంటి సేవా... ఇది పల్లవి.
 ఇప్పుడు అనుపల్లవి రాయాలి.
 వేటూరి రాశారు.
 నీపద రాజీవముల చేరు నిర్వాణ
 సోపాన మధిరోహణము సేయు త్రోవ...

ఆత్రేయ అంతటివాడే భయపడిపోయాడు- కొండ వీటి చాంతాడంత ఉంది.. ఇది అనుపల్లవా అని. కాని అనుపల్లవే. అంత పొడవైనదే. దర్శకుడు ఓకే అన్నాడు. నిర్మాత డబుల్ ఓకే అన్నాడు. ఈ అనుపల్లవి రాసిన వేటూరే అంతకు కొంత కాలం ఆరేసుకోబోయి పారేసుకున్నాను అన్నాడు. జనం దానికి వెర్రెక్కిపోయారు. ఇండస్ట్రీ కోటి రూపాయల పాట అంది. మూడ్ ఇలా ఉన్నప్పుడు ఏ నిర్మాత అయినా చిలక కొట్టుడు కొడితే అనాలి. లేదంటే చీరలెత్తుకెళ్లాడే చిలిపి కృష్ణుడు అని ప్రేక్షకుల కోసం హీరోయిన్ అందచందాలు ఆరబోయాలి. కాని ఈ నిర్మాత అలా అనుకోలేదు. పాటను పాన్‌లా చేసి నమిలి ఊసే ఒక పదార్థం అనుకోలేదు. పల్లవి అనేది పరులకు కన్నుగీటే దురదృష్టవంతురాలైన వెలయాలు అనుకోలేదు. అది ఒక స్త్రీ. చక్కటి కన్నెపిల్ల. లేదంటే సజీవ అనుభూతులు ఉన్న ఒక ప్రాణం. స్నేహం చేయ బుద్ధేసే సాటి స్పందన.

తనువూగింది ఈ వేళ.... అని ఉంటుంది ‘సిరిసిరి మువ్వ’లో. సుశీల పాడుతుంటే తనువు ఊగుతుంది. ఝమ్మంది నాదం... అని అంటుంటే పాదం సై అంటుంది. అది పాట. అదీ పూర్ణోదయా సంస్థ. అదీ ఒక నిర్మాతకుండాల్సిన అభిరుచి. ఆ అభిరుచి పేరే ఏడిద నాగేశ్వరరావు.

హిందీలో ఆర్.కె. స్టూడియోస్ అంటే కేవలం గొప్ప సినిమాలు మాత్రమే కాదు. గొప్ప పాటలు కూడా. దేవ్ ఆనంద్ సొంత బేనర్ నవకేతన్ బేనర్ అంటే ఎస్.డి.బర్మన్- రఫీ- కిశోర్- లతా కలిసి చేసే గళ సమ్మోహనం. కె.ఆసిఫ్, నాసిర్ హుసేన్ ఇలాంటి వాళ్లంతా సినిమాకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో పాటకూ అంతే ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగులో బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, దుక్కిపాటి, ఆదుర్తి వంటి వారు తొలి తరంలో నిలిస్తే మలి తరంలో పూర్ణోదయా సంస్థ, మురారి, యువచిత్ర ఈ పరంపరను సగౌరవంగా నిలబెట్టాయి. పూర్ణోదయాకు గాని, యువచిత్రకు గాని నోటి నిండా తాంబూలం పండి కనిపించే మామా - కె.వి. మహదేవనే రాగం... తానం... పల్లవి.

‘శంకరాభరణం’ ముఖ్యతారాగణంలో ‘పాట’ కూడా ఒకటి. సినిమా మొదలెడుతూ వేటూరిని, మహదేవన్‌ని ఉద్దేశించి నమస్కరిస్తూ మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నారట విశ్వనాథ్. కాని అంత కంటే ఎక్కువ నమ్ముకున్నది ఏడిద నాగేశ్వరరావే. సినిమా ఫ్లాప్ అయితే విశ్వనాథ్‌కు ఇంకో సినిమా దర్శకత్వానికి అవకాశం దొరుకుతుంది. కాని పెట్టిన పెట్టుబడి తుడిచిపెట్టుకుని పోతే పైకి లేవడానికి నిర్మాతకు ఒక జీవిత కాలం పడుతుంది. కాని ఏడిద పెట్టుకున్న నమ్మకం ఒమ్ముకాలేదు.

బ్రోచేవారెవరురా... అని దప్పికతో నోళ్లు తెరుచుకుని ప్రేక్షకుల మీద ఈ పాటలు కుంభవృష్టిలా కురిశాయి. మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు... అనంటే అవును కాబోలు అనుకుంటూ తడిశారు. ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరిమువ్వలు కాబోలు... అనంటే అవును కాబోలు అంటూ తడిసి ముద్దయ్యారు. ఇప్పటికీ ఏ డిస్కషన్‌లో కూచున్నా ఏ పాట చేస్తున్నా అబ్బే రిక్షావాడికి ఎక్కదండీ అని కొట్టిపారేస్తుంటాడు. ఆంధ్రదేశంలో ప్రతి రిక్షావాడు ఈ పాట పాడాడు... శంకరా... నాదశరీరా పరా...

తెలుగువారికి ఒక తమిళుడి బాకీ తాత్కాలికంగా తీరింది. ఇంకో తమిళవాడి బాకీ మిగిలి ఉంది. ఏడిద నాగేశ్వరరావు ఆ బాకీ చెల్లింప చేశారు. ‘సీతాకోకచిలుక’ పాటలను ఇచ్చి ఆలిండియా రేడియో మోగే ఇళ్లల్లో ఆడవాళ్ల తీరిక వేళలను సఫలం చేశారు. మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మా.... పాట చుక్కలాగా నవ్వడం వేకువ చుక్కానిలా దారి చూపడం ఈ పాటలతో చూశారు. మాటే మంత్రము... మనసే బంధము.... జనం విని తలలను పడగల్లా ఆడిస్తూ ‘పాటే మంత్రము’ అని అంగీకరించి పూర్ణోదయాకే తమ ఓటు అని కలెక్షన్ బాక్సుల్లో నోట్ల కాగితాలను జార విడిచారు.

సాగరసంగమానికి మొదటి హీరో స్క్రిప్ట్. రెండో హీరో కమలహాసన్. మూడో హీరో ఇళయరాజా చేసిన పాట. 1983 అంటే చక్రవర్తి మంచి ఊపు మీద ఉన్నారు. పాట రగులుతున్న మొగలిపొదలా ఉంది. ఆ సమయంలోనే నిశ్శబ్దంగా ఒంటి మీద చప్పుడు చేయకుండా జారే స్నానపు ధారగా లేతగా నాసికను తాకే నురగ సువాసనగా మౌనమేలనోయి ఈ మరపురాని రేయి... వచ్చింది. ప్రేక్షకులు స్పెల్‌బౌండ్ అయ్యారు. తకిట తథిమి తకిట తథిమి తందానా... అనంటే టెన్షన్‌తో అట్టుడికి బావికి వలలు పట్టారు. గొడుగు మర్చిపోయి గట్టు దాకా పరిగెత్తి ఆ తాగుబోతు కళాకారుడి చేయి పట్టుకున్నారు.

ఇక ‘సితార’ వచ్చింది కిన్నెరసానిని తెచ్చింది. పచ్చని చేల పావడగట్టి కొండమల్లెలె కొప్పున గట్టి వచ్చే పాట ఎంత రూపసిగా, ఎంత లావణ్యంతో, ఎంత దేశీయ సౌందర్యంతో ఉంటుందో చూసి విచ్చుకున్న పెదవులతో మెచ్చుకున్నారు. ‘స్వాతిముత్యం’లో సినారె సువ్వి సువ్వి సువ్వాలమ్మాఅన్నారు. వటపత్ర శాయికి వరహాలలాలి పాడితే ఎలా ఉంటుందో చూపి ఇంటింటి తల్లులకు ఓ లాలిపాట అరువిచ్చారు.

ఇవన్నీ ఒకెత్తు పూర్ణోదయాకు రమేశ్ నాయుడు చేయడం ఒకెత్తు. చిరంజీవి చెప్పులు కుట్టేవాడట. వీపున బిడ్డను కట్టుకుని పాట పాడతాడట. తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్... ఇంకేం పారాహుషార్. విన్న ప్రతివాడూ దాని వెంట నడుస్తూ ఆ కొండల్లో కోనల్లో తప్పిపోయాడు. మంచి గడపను చూస్తే మంచి ముగ్గేయబుద్ధవుతుంది... మంచి నిర్మాణ సంస్థ దొరికితే ఎవరికైనా సరే మంచి పాటే చేయబుద్ధవు తుంది. సిగ్గూ పూబంతి యిసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి... ఎంత జానపద సౌందర్యం.  సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ... ఇంత మంచి పాట ఇచ్చాక ప్రేక్షకులు ఏమడిగినా ఇవ్వకుండా ఉంటారా?

చివరి సినిమా ‘ఆపద్బాంధవుడు’. స్వర సేనాపతి కీరవాణి. హార్మోనియం మీద కత్తులు కాదు దూయాల్సింది. మల్లెల గుత్తులు. విరజాజుల పొత్తులు. మీటాడు. ఔరా అవ్ముక చెల్లా ఆలకించి నవ్ముడమెల్లా అంత వింత గాథల్లో ఆనంద లాల... హిట్ పడిపోయింది. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి... మరోసారి మంచి సిరివెన్నెల పాటకు దారి దొరికింది.

ఆ తర్వాత పూర్ణోదయా సంస్థ సినిమాలు తీయలేదు.
చాలా సినిమాలు వస్తున్నాయి. అప్పుడప్పుడు మంచి పాటలు మెరుస్తున్నాయి. కాని దండలోని ప్రతి పువ్వునూ సువాసన కలిగినదిగా చూడటం... ముంచిన ప్రతి కడవనూ పాలతో నింపడం... పట్టిన ప్రతి దోసిలినీ తేనెతో తొర్లేలా చేయడం పూర్ణోదయాకే చెల్లింది. ఆ సంస్థ సినిమాలకే దక్కింది.
 ఏడిద నాగేశ్వరరావుకు సెలవు.
 - ఖదీర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement