ఆయన నా నిర్మాత కావటం అదృష్టం: చిరంజీవి
హైదరాబాద్ : భారతీయ సినీ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గౌరవాన్ని ఇనుమడించేలా ఏడిద నాగేశ్వరారవు సినిమాలు తీశారని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ఆయన సోమవారం ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పూర్ణోదయ సంస్థలో తొలిసారి తాను 'తాయారమ్మ, బంగారయ్యా' చిత్రంలో గెస్ట్ రోల్ చేశానని, ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాల్లో నటించానట్లు చెప్పారు. ఆ రెండు సినిమాలు అత్యద్భుతమైన చిత్రాలని, ఆ సినిమాలు ఆ రోజుకూ తలనమానికంగా నిలిచి, గొప్పగా చెప్పుకునే చిత్రాలన్నారు. ఆ రెండు సినిమాల్లో తనకు అవార్డులు తెచ్చిపెట్టాయని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
నటుడు కావాలని చిత్ర పరిశ్రమకు వచ్చిన ఏడిద నాగేశ్వరరావు గారు.... అత్యున్నత అభిరుచి గల నిర్మాతగా తనను తాను ఆవిష్కరించుకున్నారని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఎన్ని కమర్షియల్ సినిమాలు వచ్చినా వాటికి లోబడకుండా కళాత్మక విలువలు ఉన్న సినిమాలను ఆయన ప్రేక్షకులకు అందించారన్నారు. కళా సేవతో సినిమాలు చేశారని, ఆయన సంస్థ రూపొందించిన సినిమాల్లో నటించటం తన అదృష్టమన్నారు. ఆయన తీసిన ఒక్కొక్క సినిమా ఓ ఆణిముత్యమన్నారు.అలాంటి ఏడిద నాగేశ్వరరావుగారు మన మధ్య లేకపోవడం దురదృష్టకమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చిరంజీవి ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు.