జాతీయస్థాయిలో పలు అవార్దులు పొంది తెలుగులో గర్వించే సంస్థగా పేరొందిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర లోగోను సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ చిత్రంతో ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ శిష్యులు వంశీ, లక్ష్మీనారాయణలు దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఏడిద నాగేశ్వరరావుగారు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది గ్రేట్ జర్నీ. అలాంటి గొప్ప సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. శంకరాభరణం, స్వాతిముత్యం.. ఇలా చాలా క్లాసిక్ మూవీలు వారి సంస్థ నుంచి వచ్చాయి. ఆ సినిమాలన్నీ చూశాను. వారి సినిమాల్లో ‘ఆపద్భాంథవుడు’ సినిమా చాలా ఇష్టం. నేను చదువుతున్న రోజుల్లో ఆ సినిమా చూశాను. కానీ అది ఆడలేదని చాలా కోపం వచ్చింది. ఎందుకు ఆడలేదో ఆర్థం కాలేదు. ఈ జర్నీలో వారి వారసులు నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్‌కు హెల్ప్ అవడం సంతోషంగా ఉంది.
ఇంత పెద్ద సంస్థలో అవకాశం ఉంటే తప్పకుండా నేను సినిమా చేస్తాను. ఇకపై శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌లో మంచి సినిమాలు రావాలి’ అని అన్నారు. అనంతరం దర్శకుడు అనుదీప్‌పై ఈ సందర్బంగా అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాకు అనుదీప్ కథ, స్క్రీన్క్‌ప్లే, డైలాగ్ ఇచ్చాడంటే చాలా ఫన్ ఉంటుంది. జాతిరత్నాలు హిట్ తర్వాత తన స్వార్థం చూసుకోకుండా తన తోటివారిని ఎంకరేజ్ చేయడం నాకు గర్వంగా ఉంది. దర్శకుడు వంశీ ఎం.బి.బి.ఎస్. చదివాడు. సినిమాపై తపనతో ఈ రంగంలోకి వచ్చాడు. ఇప్పుడు అనుదీప్ వల్ల దర్శకుడు అయ్యాడు’ అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, వివిఎల్. నరసింహారావు తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment