Girdling, Ring Barking: పాత చెట్లకు కొత్త ఊపు!
పాత తరం మామిడి చెట్లకు క్రమేణా కాపు తగ్గిపోతుంటుంది. దీంతో, కొందరు రైతులు పాత చెట్లను మొదలంటూ నరికేసి.. కొత్తగా మళ్లీ మొక్కలు నాటుతూ ఉంటారు. కానీ, బాగా పాత చెట్ల కొమ్మల బెరడును కొద్ది మేరకు కత్తిరించి వలిచెయ్యటం ద్వారా ఆ పాత చెట్ల ద్వారా కూడా అధిక మొత్తంలో పండ్ల దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా, పాత చెట్టు కొమ్మను కత్తిరిస్తే.. ఆ మొండి కొమ్మలకే విస్తారంగా కాయలు కాస్తాయి. ఇటువంటి ప్రయోగాలు రైతులు, శాస్త్రవేత్తలకు తెలియనివి కాకపోయినప్పటికీ.. గుజరాత్‌కు చెందిన రాజేష్ షా, ఈడ్పుగల్లుకు చెందిన శ్రీనివాస్‌ల అనుభవాలు ఆసక్తిగొలుపుతున్నాయి.
35 ఏళ్లు దాటిన చెట్లకే..!
35–40 ఏళ్ల క్రితం నాటిన పాత మామిడి చెట్ల కాపు తగ్గిపోవటం సహజమే. ఇటువంటి చెట్ల కాండానికి బెజ్జం వెయ్యటం వంటి చిట్కాల ద్వారా పండ్ల దిగుబడిని పెంపొందించుకోవడం చిరపరిచితమైనదే. గుజరాత్‌కు చెందిన రాజేష్ షా తోటలో 65 ఎకరాల్లో అల్ఫాన్సో, కేసర్ వంటి రకాల మామిడి చెట్లు వందల కొద్దీ ఉన్నాయి. వాళ్ల తాత కాలం నుంచీ ఆ తోట ఉంది. పాత చెట్లకు కాపు ఏటేటా తగ్గిపోతుండటంతో షా ‘గిర్డ్లింగ్ లేదా రింగ్ బార్కింగ్’ చిట్కాను ప్రయోగించడం పాతికేళ్ల క్రితమే ప్రారంభించారు.
పాత పండ్ల చెట్టు కాండం లేదా కొమ్మ లేదా రెమ్మలకు చుట్టూ బెరడును కత్తిరించి తీసెయ్యటమే హార్టీకల్చర్ పరిభాషలో ‘గిర్డ్లింగ్ లేదా రింగ్ బార్కింగ్’ అంటే. 15 ఏళ్ల తర్వాత గానీ ఈ పనిలో తనకు పూర్తిస్థాయి నైపుణ్యం చేకూరలేదంటారాయన. ఈ సంవత్సరం 75 కొమ్మలకు గిర్డ్లింగ్ చేశారాయన.
రింగ్ బార్కింగ్ చేసేదెలా?
శుభ్రమైన, పదునైన చాకుతో అంగుళం వెడల్పున చెట్టు కాండం చుట్టూతా కత్తిరించి, బెరడును తొలగించాలి. ఆ గాయంలో నుంచి చెట్టుకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి క్రిమిసంహారక మందు లేదా స్థానికంగా రైతులు తయారు చేసుకునే పేస్ట్‌ను పూయాలి. అంతే, చెట్టు ఆ ప్రాంతానికి ముఖ్యమైన పోషకాలను అందించడానికి కత్తిరించిన ప్రాంతంలో కొత్త పొరలను అభివృద్ధి చేస్తుంది. తద్వారా పోషకాలు పుష్కలంగా అంది చెట్టు కాపు పెరుగుతుంది.
గాలిలో తేమ 70% మేరకు ఉండే దీపావళి కాలంలో రింగ్ బార్కింగ్ చేయటం వల్ల తమ తోటలో చెట్లకు ఉపయోగపడిందని షా తెలిపారు. 35 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న చెట్లకు, నేల పై నుంచి 15–20 అడుగుల కన్నా ఎత్తున్న కొమ్మలకే రింగ్ బార్కింగ్ టెక్నిక్ సమర్థవంతంగా పని చేస్తోందని షా వివరించారు.
అంతేకాదు, కాండం లేదా కొమ్మల చుట్టుకొలత కనీసం 12 (30 సెం.మీ.) అంగుళాల మేరకు ఉంటేనే ఈ చిట్కా బాగా పని చేస్తున్నదని షా వివరించారు. గాటు పెట్టి బెరడు తీసేసిన పై ప్రాంతంలో కొమ్మల్లో కాపు చాలా ఎక్కువగా వస్తుందని, పండ్లు పెద్దగా, తియ్యగా ఉంటాయని ఆయన చెబుతున్నారు. 125, 100, 80 ఏళ్ల క్రితం నాటిన చెట్లకు కూడా ఈ టెక్నిక్ ద్వారా మంచి పండ్ల దిగుబడిని పొందానని సంబరపడుతున్నారాయన.
కొమ్మ కత్తిరిస్తే.. గుత్తులు..!
45 ఏళ్ల నాటి మామిడి చెట్టు కొమ్మను కత్తిరిస్తే ఆ మోడుకు ఆశ్చర్యకరంగా గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాస్తున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లుకు చెందిన పర్వతనేని వెంకట శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో దేశవాళీ రకం మామిడి చెట్టుకు వింతగా ఎక్కువ మొత్తంలో కాసిన కాయలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
శ్రీనివాస్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనా వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఆయన తండ్రి కోటేశ్వరరావు 45 ఏళ్ల క్రితం దేశవాళీ మామిడి విత్తనాన్ని నాటారు. ప్రస్తుతం అది మహా వృక్షంగా మారింది. పీచు లేకుండా, ముదురు పసుపు రంగులో తియ్యని గుజ్జుతో కూడిన ఈ చెట్టు పండ్లు రుచికరంగా ఉన్నాయి. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ చెట్టు కాస్తుందని శ్రీనివాస్ తెలిపారు.
ఏ ఎరువూ వెయ్యటం లేదు..
కొమ్మలు బాగా విస్తరించటంతో అడ్డుగా ఉన్న కొమ్మలను రంపంతో రెండేళ్ల క్రితం కత్తిరించారు. అలా కత్తిరించిన ప్రదేశంలో గుత్తులుగా కాయలు వచ్చాయి. ఈ ఏడాది కూడా మరికొన్ని కొమ్మలను కత్తిరించారు. కత్తిరించిన ప్రతి చోటా గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉన్న రకం. సేంద్రియ/రసాయనిక ఎరువులు ఏవీ వెయ్యటం లేదు. నీరు పెడుతున్నాం అంతే అన్నారాయన.
విషయం తెలుసుకున్న డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. టి. జానకిరాం తదితర ఉద్యాన శాస్త్రవేత్తలు ఇటీవల ఈ దేశవాళీ మామిడి చెట్టు వైభవాన్ని సందర్శించి రైతును ప్రశంసించారు. 45 ఏళ్ల నాటి దేశవాళీ మామిడి చెట్టు జన్యు వనరుల పరంగా ఎంతో విలువైనదని అంటూ మెరుగైన వంగడాల అభివృద్ధి కోసం జరిపే పరిశోధనల్లో ఈ జన్యు వనరును ఉపయోగిస్తామని తెలిపారు. వాణిజ్య దృష్టితో కాకుండా దేశవాళీ రకం పండ్ల రకాలను మక్కువతో పెంచడమే తనకు ఇష్టమని శ్రీనివాస్ (93929 22007) సంతోషంగా చెప్పారు. జామలో కూడా ఈ టెక్నిక్‌ను ప్రయోగిస్తున్నానన్నారు.
– ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు
అధిక పోషకాల నిల్వ వల్లనే..!
మామిడి చెట్ల కొమ్మలను డిసెంబర్, జనవరి నెలల్లో పూతకు ముందుగా నరకడం ∙కొన్ని సందర్భాలలో కొమ్మలపైన చిగురు కాకుండా పూత రావడం, పిందె కట్టడం జరుగుతుందని డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. టి.జానకిరామ్ తెలియజేశారు. కార్బోహైడ్రేట్స్ అధిక శాతం నిల్వ వలన, కార్బన్–నత్రజని శాతంలో వ్యత్యాసం వలన నరికిన కొమ్మలకు కాయలు గుత్తులుగా వస్తాయన్నారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులోని పర్వతనేని శ్రీనివాస్ తోటలోని దేశవాళీ మామిడి చెట్టుకు కొమ్మలపైన గుత్తులు గుత్తులుగా కాసిన మామిడి పండ్లను ఉపకులపతి డా. టి.జానకిరామ్ పరిశీలించారు.
పరిశోధన సంచాలకులు డా. ఆర్‌విఎస్‌కె రెడ్డి, నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. శ్రీమతి బి. కనకమహాలక్ష్మి, కంకిపాడు ఉద్యాన అధికారి జి. లక్పతి, రైతులు ఆయన వెంట ఉన్నారు. రైతు శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వివిధ రకాలైన జామ, వాటర్ ఆపిల్, స్టార్ ఫ్రూట్, చెర్రిగోవా, నోని, మాల్టా బత్తాయి, బొప్పాయి మొక్కలను పరిశీలించారు. పరాగ సంపర్కానికి అవసరమైన తేనేటీగలను కూడా పెంచి తోటలలో ఫలదీకరణ శాతం పెరిగి దిగుబడి అధికంగా ఉంటుందని డా.జానకిరామ్ సూచించారు.