మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త
కొడవలూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా): కొడవలూరు మండలం నాయుడుపాళెంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను హతమార్చాడు. ఈ సంఘటన గురువారం వేకువజామున జరిగింది. నాయుడుపాళెం గ్రామానికి చెందిన జంపాల మల్లికార్జున బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకూ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. వేకువ జామున ఇంటికి వచ్చిన భర్తను ప్రశ్నించిన భార్య ఈశ్వరమ్మ (35)ను రోకలిబండతో తలపై బాదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
సమాచారం తెలిసిన వెంటనే కొడవలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఈశ్వరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. నిందితుడు మల్లికార్జున పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.