పట్టణంపై తుపాను పంజా
శ్రీకాకుళం/అర్బన్/కల్చరల్/రిమ్స్ క్యాంపస్: హుదూద్ తుపాను శ్రీకాకుళం పట్టణంపై తీవ్ర ప్రభావం చూపింది. తుపాను ప్రభావం శని, ఆదివారాలలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పట్టణంలో చాలా వరకూ నష్టం జరిగింది. శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు జలమయమయ్యాయి. హోరు గాలి తీవ్రతకు చాలా వరకూ దుకాణాల హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపోయాయి. వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. పట్టణంలోని ఆదివారంపేట, బలగ, హడ్కోకాలనీలు పూర్తిగా నీటమునిగాయి. డే అండ్ నైట్ కూడలి, ఇలిసిపురం, రైతుబజార్, సాయిబులతోట, సరస్వతీమహల్కు సమీపంలోని గొంటివీధి, విశాఖ-ఏ, బీ కాలనీలు, మహలక్ష్మీనగర్ కాలనీ, కిన్నెర కూడలి తదితర లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా జలమయమయ్యాయి. పట్టణంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద ఉన్న అటవీశాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న పెద్ద చెట్టు కూలి రోడ్డుపై పడింది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ స్తంభం కూడా నేలకొరిగింది.
విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆ చెట్లును తొలగించారు. కలెక్టరేట్‌కు సమీపంలోని రెవెన్యూ అతిథిగృహంకు దగ్గరగా ఉన్న పెద్ద చెట్టు విరిగి నేలకొరిగింది. అయితే ఈ చెట్టు ఖాళీప్రదేశంలో పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాతబస్టాండ్‌కు సమీపంలోని పోలీస్ క్వార్టర్స్‌కు ఆనుకుని ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ డూం విరిగిపోయింది. కృష్ణాపార్కు సమీపంలో డివైడర్‌లో ఉన్న మొక్కలు విరిగిపోయాయి. డే అండ్ నైట్ కూడలి సమీపంలో పెద్దరెల్లివీధి వద్ద రోడ్డుకు ఆనుకుని ఉన్న దుస్తుల దుకాణం మొత్తం కూలిపోయింది. పట్టణంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద, పట్టణ ముఖద్వారం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ షెల్టర్లు పడిపోయాయి. పలు దుకాణాలకు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రేకులు గాలికి ఎగిసిపడ్డాయి. వైఎస్ఆర్ కూడలి వద్ద సెంటర్ లైటింగ్ విద్యుత్ స్తంభం నేలకొరిగింది. అలాగే డేఅండ్‌నైట్ కూడలి, కొత్తబ్రిడ్జి రోడ్డు, ఇలిసిపురం రోడ్డులో, అరసవల్లి, గూనపాలెం తదితర ప్రాంతాలో
్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచే పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భోజనాలకు గిరాకీ
పీఎన్ కాలనీ: శ్రీకాకుళం పట్టణంలో తుపాను కారణంగా చాలామంది భోజనాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హోటళ్లు తెరుచుకోక, తీసిన హోటళ్లలో ప్రజలకు సరిపడినంత భోజనం అందించలేక జనాలు భోజనం కోసం పాట్లు పడ్డారు. ఏమిచేయాలో తెలియక హోటల్ వద్ద గంటల తరబడి వేచివుండాల్సిన పరిస్థితి నెలకొంది. డే అండ్ ైనె ట్ కూడలిలో ఉన్న ఒక్క హోటల్ వద్దే భోజనం దొరికింది.
పెట్రోల్ దొరక్క ఇబ్బందులు
పట్టణంలో ఉన్న పెట్రోలు బంకులన్నీ ఒక్కసారిగా మూతపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బంకులన్నీ మూతపడ్డాయి. అలాగే పెట్రోలు తీసుకురావాల్సిన వాహనాలు రాకపోవడంతో పెట్రోల్, డీజిల్ లభించలేదు.
పునరావాస కేంద్రాల్లో పాట్లు
గార: మండలంలో తుపాను పెను విధ్వంసం సృష్టించింది. భారీ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, నెలకొరిగాయి. పలుచోట్ల వరి నేలవాలింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. 20 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. బందరువానిపేట, నగరాలపేట, ట్రైమెక్స్ స్కూల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి సుమారు 2000 మందిని తరలించారు. అయితే బందరువానిపేట పునరావాస కేంద్రంలో జనరేటర్ పనిచేయలేదు. వైద్య సిబ్బంది కూడా పత్తా లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఇన్చార్జి ఆర్డీవో సీతారామారావు, తహశీల్దార్ సింహాచలం, ఏవో బి.వి.త్రినాథరావు గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
బందరువానిపేట చుట్టుముట్టిన సముద్రుడు
- 120 నుంచి 150 అడుగుల ముందుకొచ్చిన సముద్రం
- బిక్కుబిక్కుమంటున్న జనం
శ్రీకాకుళం సిటీ: హుదూద్ తుపాను బీభత్సానికి బందరువానిపేట భీతిల్లింది. తుపాన్లంటే పెద్దగా ఆందోళనచెందని ఈ గ్రామస్తులు సైతం హుదూద్ ధాటికి తట్టుకోలేకపోయారు. గార మండల పరిధిలోని సుమారు ఐదువేల మంది నివాసముంటున్న ఈ గ్రామం స్వరూపమే మారిపోయింది. ఒకవైపంతా సముద్రం ఉగ్రరూపంలో ఉంటే, మరోవైపంతా వంశధార నీరు పొంగి పొర్లడంతో ఈ గ్రామం నీటి మధ్య ఉంది. ఈ గ్రామానికి ప్రధాన రోడ్డు మార్గం కూడా మరమ్మతులకు గురికావడంతో ఇక్కడి జనానికి ఆందోళన నెలకొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సముద్రం తీవ్ర ఉధృతి అలలతో సుమారు 120 నుంచి 150 అడుగుల ముందుకు రావడంతో పాటు చూడ్డానికే భయంకరంగా కనపడడంతో నిత్యం సముద్రంలోకి వెళ్లిన వారిని సైతం భయభ్రాంతులకు గురిచేసినట్లైంది. హుదూద్ ప్రభావంతో పెద్ద పెద్ద చెట్లు నేలకొరగగా, రోడ్లు కోతకు గురయ్యాయి. ఇక విద్యుత్‌స్తంభాలు ఎక్కడికక్కడ కూలిపోవడంతో తీవ్ర సమస్యగా మారింది. బందరువానిపేటతో సహా, మొగదాలపాడు, కె.మత్స్యలేశం, కళింగపట్నం తదితర గ్రామలన్నీ విలవిల్లాడాయి.