నేనేం పాపం చేశానయ్యా...!
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర రోడ్లు, భవనాల రవాణా శాఖమంత్రి శిద్దా రాఘవరావు సొంత నియోజకవర్గంలో గత 28 సంవత్సరాలుగా రేషన్ దుకాణం నిర్వహించుకుంటున్న ఓ వికలాంగుడి డీలర్‌షిప్‌ను రద్దు చేసి మరొకరి ఇచ్చేయడంతో ‘నేను ఏ అన్యాయం చేశానయ్యా’ అంటూ సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ పరిస్థితిని మొరపెట్టుకున్నారు.
దర్శి మండలం తానంచింతల గ్రామానికి చెందిన ఏకాశి శివయ్య 1986 నుంచి రేషన్ దుకాణం సక్రమంగా నిర్వహించుకుంటూ వస్తున్నాడు. ఏ తప్పు చూపించకుండానే అర్థంతరంగా తొలగించినట్లు ఈ ఏడాది అక్టోబర్ నెలలో దర్శి తహశీల్దార్ చెప్పటంతో శివయ్య కంగుతిన్నాడు. తాను ఏం నేరం చేస్తే రేషన్ షాప్‌ను తొలగించారని ప్రశ్నించినా తహశీల్దార్ నుంచి సమాధానం లేదు. అదే గ్రామానికి చెందిన సంధు నాగమణి అనే మహిళకు రేషన్ షాప్‌ను కేటాయించేశారు. ఓ పక్క పుట్టు వికలాంగుడిగా రెండు కాళ్ళు మెలికతిరిగి కర్ర ఆసరాతో సైతం నడవలేని స్థితిలో ఉన్న శివయ్య తన గోడును జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో విన్నవించుకునేందుకు సోమవారం ఒంగోలుకు చేరుకున్నాడు. ఈయన భార్య కూడా వికలాంగురాలు. వీరిరువురికితోడు వీరి బిడ్డ కూడా వికలాంగురాలిగానే పుట్టింది.