నగరాల్లోనూ పౌష్టికాహార సమస్య
ఏకాత్మిక్ బాల్ వికాస్ సంస్థ సర్వేలో వెల్లడి
సాక్షి, ముంబై: మొన్నటి వరకు గిరిజన ప్రాంతాలకే పరిమితమైన పౌష్టికాహర లోపం సమస్య ఇప్పుడు నగరాల్లో కూడా కనిపిస్తోంది. నగరాల్లో దాదాపు 17 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని వివిధ నగరాలలో 15.54 లక్షల మంది ఆరేళ్ల లోపు పిల్లలపై ఏకాత్మిక్ బాల్ వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యయనం చేశారు.
ఇందులో 10.62 లక్షల మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువున్నట్లు వెల్లడైంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో ఈ సమస్య అధికరంగా కనిపించేది. ఇప్పుడు ప్రధాన నగరాల్లోని మురికివాడల్లో పేదరికం, అజ్ఞానం, నిరక్షరాస్యత, ఆరోగ్యంపై సరైన మార్గదర్శనం లేకపోవడంవల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం సమస్య ఎదురవుతోందని అధ్యయనంలో బయటపడింది.
పౌష్టికాహార సమస్యను నిర్మూలించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది. గ్రామీణ, గిరిజన ప్రాంత పేద ప్రజలకు మార్గదర్శనం చేసేందుకు ప్రభుత్వ వైద్యాధికారులను, ఆంగన్వాడీ కార్యకర్తలను పంపిస్తున్నారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయవద్దని, వెంటనే పిల్లల్ని కనకూడదని, ఇద్దరు బిడ్డల మధ్య కనీసం మూడేళ్ల దూరం ఉండాలని బోధిస్తూ, గర్భిణులు తిసుకునే ఆహారం తదితరాలపై మార్గదర్శనం చేస్తున్నారు. నగరాల్లో ఈ సమస్య లేకపోవడంతో అందరి దృష్టి గ్రామీణ ప్రాంతాలపైనే ఉండేది.
కానీ నగరాల్లో వెలుస్తున్న మురికివాడల్లోని పేద ప్రజల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తుండడంతో ఆరోగ్య శాఖ ఆందోళనకు గురవుతోంది. రాష్ట్రంలోని మొదటి పది నగరాలలో మాలేగావ్, నాగపూర్, మాల్వణి (ముంబై), నాందేడ్, ఠాణే, షోలాపూర్ , ఇచల్కరంజీ, యవత్మాల్, పింప్రి, బల్లార్పూర్లో ఈ సమస్య ఉంది. ఇక్కడ ప్రస్తుతం 17 శాతం మంది పిల్లలు పౌష్టికాహరం లోపంతో ఉన్నారు. భవిష్యత్తులో ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ఏకాత్మిక్ బాల్వికాస్ సేవా సంస్థ హెచ్చరించింది.