తెలుగు భాషను కాపాడుకోవాలి
నాంపల్లి: ఆధునిక యుగంలో తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆధ్వర్యంలో 2013- 14 సంవత్సరం సంస్కృతి పురస్కార ప్రదానోత్సవవేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆయన హాజరయ్యారు.
మాతృ భాషలోని మాధుర్యాన్ని భావి తరతరాలకు అందించేందుకు అందరూ పాటుపడాలని కోరారు. తెలుగు భాషకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు మండలి వెంకటకృష్ణారావు పాటుపడ్డారన్నారు. పొరుగు దేశాల్లో తెలుగును కాపాడుకుంటుంటే మన రాష్ట్రంలో మాత్రం తక్కువచేసి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి మాట్లాడుతూ జపాన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో మాతృభాషలోనే అన్ని వ్యవహారాలు కొనసాగుతాయని, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా సాగుతోందన్నారు. డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ ప్రభుత్వాధినేతలకు భాషాభిమానం కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రీయ హిందీ సంస్ధాన్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సంఘాల పుట్టుకకు, భాష చైతన్యానికి మండలి వెంకట కృష్ణారావు స్ఫూర్తినిచ్చారని అన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి భాషాసంస్కృతికి,అభ్యుదయానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిందన్నారు. అనంతరం బర్మా తెలుగు సంఘం(మయన్మార్)-2013) ఎర్ర నాయుడికి, ప్రపంచ తెలుగు సమాఖ్య(చెన్నై)-2014 ఆదిశేషయ్యలకు మండలి వెంక ట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. రూ. 25వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ తెలుగు కేంద్రం డెరైక్టర్ ఆచార్య డి.మునిరత్నం నాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం పాల్గొన్నారు.