కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
న్యూఢిల్లీ: గత నాలుగోతేదీన జరిగిన ఢిల్లీ విధాన సభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఆది వారం జరగనున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. నగరవ్యాప్తంగా ఉన్న 14 కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పారామిలటరీ దళానికి చెందిన 2000 మంది సాయుధులతోపాటు ఢిల్లీ పోలీస్ సిబ్బందిని భారీగా మోహరించారు. ఆయా కేంద్రా ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయడంతోపాటు వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయనున్నారు. సదరు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అంతర్గత భద్రతా వ్యవహారాలను పారామిలటరీ దళాలు, బయట భద్రతా చర్యలను ఢిల్లీ పోలీసులు చూసుకుంటారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ను లెక్కిస్తారు. ఈసారి మొత్తం 43 వేల పోస్టల్ బ్యా లెట్లు వచ్చాయని, గత ఎన్నికల్లో ఈ సంఖ్య 1,600 మాత్రమేనని ఎన్నికల కమిషన్ అధికారి దేవ్ తెలి పారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరుగకుండా మొత్తం ప్రక్రియను కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా సీనియర్ ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన వివరించారు.