electric tariff
-
ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.50వేలు లోపే .. అస్సలు మిస్ అవ్వొద్దు!
రద్దీగా ఉండే రోడ్లు, భారీ ట్రాఫిక్ జామ్ సమయాల్లో కార్లలో ప్రయాణించడం చాలా కష్టం. అందుకే అలాంటి క్లిష్ట సమయాల్లో ప్రయాణం సాఫిగా జరిగేలా స్కూటర్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు మొగ్గు చూపుతుంటారు. మీరూ అలా తక్కువ బడ్జెట్లో అంటే రూ.50 వేలకే స్కూటర్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరల్లో స్కూటర్లను అందించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు పోటీపడుతున్నాయి. అందుకే ఇప్పుడు మనం ధర తక్కువ, మైలేజ్, నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తూ ప్రయాణానికి సౌకర్యంగా ఉండే స్కూటర్ల గురించి తెలుసుకుందాం. టీవీఎస్ ఎక్స్ఎల్ 100 ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ ‘టీవీఎస్ ఎక్స్ఎల్ 100 (TVS XL100)’ పేరుతో 6 మోడళ్లు, 15 రకాల రంగులతో రూ.46,671 నుంచి రూ.57,790 ధరతో స్కూటర్లను అందిస్తుంది. 99పీపీ బీఎస్6 ఇంజిన్‌తో 4.4 హార్స్ పవర్, 6.5 ఎన్ఎం టారిక్ను ఉత్పత్తి చేస్తుంది. వెహికల్ ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని బరువు 89 కిలోలు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 4 లీటర్లు.సైలెంట్ స్టార్టర్, ఇంజిన్ కిల్‌స్విచ్, యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ (డీఆర్ఎల్)తో వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన వెహికల్స్‌లో ఇదొకటి. కొమాకి ఎక్స్‌జీటీ కేఎం Komaki XGT KM ఎలక్ట్రిక్ స్కూటర్. ఢిల్లీ కేంద్రంగా 35ఏళ్ల నుంచి ఆటోమొబైల్ రంగంలో రాణిస్తున్న కేఐబీ కొమాకి సంస్థకు చెందిన ఈ స్కూటర్లో అండర్‌సీట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్, డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకునేందుకు వీలుగా స్థలం ఉంది. అదనంగా Komaki XGT KM డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ లాక్ ఇలా అనేక ఫీచర్లు ఉన్నాయి. అదనపు భద్రత కోసం ముందు చక్రం డిస్క్ బ్రేకులు అమర్చబడ్డాయి. పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, XGT KM 130-150కిమీల పరిధిని కవర్ చేయగలదు. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 6-8 గంటలు పడుతుంది. అవాన్ ఇ లైట్ Avon E Lite దేశీయంగా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదికొటి. కేవలం రూ. 28,000కి కొనుగోలు చేయొచ్చు. పూర్తి ఛార్జ్ తర్వాత, E లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 50 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఫుల్ ఛార్జింగ్ చేసేందుకు 4-8 గంటలు పడుతుంది. లోహియా ఓమా స్టార్ Lohia Oma Star దేశీయంగా తయారు చేసింది. క్లచ్ తక్కువ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, సీటు కింద స్టోరేజ్ బాక్స్‌ను కలిగి ఉంది. స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 60 కిమీ/ఛార్జ్ వరకు ప్రయాణించగలదు. దీని ప్రారంభం ధర రూ.41,444 ఉండగా.. ఖరీదైన వేరియంట్ ధర రూ.51,750కే కొనుగోలు చేయొచ్చు. ఎవాన్ ఈ స్కూట్ Avon E Scoot 65 కిమీ/ఛార్జ్ పరిధితో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ.45,000 నుంచి రూ. 50,000 లోపు అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. టెక్కో ఎలక్ట్రా నియో Techo Electra Neo భారత్‌లో తయారైంది. రూ. 41,919 ధరతో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. నాలుగు విభిన్న రంగులలో లభిస్తుంది. టెక్కో ఎలెక్ట్రా నియో మోటారు 250 డబ్ల్యూ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్ సుమారు 5-7 గంటలు పడుతుంది.సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డిజిటల్ స్పీడోమీటర్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్,విశాలమైన స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటి ఇతర సదుపాయాలు ఉన్నాయి. -
ఒకేసారి మూడేళ్లకు.. విద్యుత్ చార్జీల పెంపు!
గత రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. దాంతో డిస్కంల ఆదాయలోటు కొండలా పెరిగిపోయింది. రూ. 20 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) లు ఈ నెల 8 లేదా 9న రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించనున్నాయని ఉన్నతాధికార వర్గాలు ధ్రువీకరించాయి. విద్యుత్ చట్టం ప్రకారం ఏటా నవంబర్ 30లోగా... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల అంచనా నివేదిక (ఏఆర్ఆర్)ను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ను జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా డిస్కంలు వాయిదా వేసుకున్నాయి. 2019–20, 2020–21 సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికలను సైతం ఇప్పటివరకు డిస్కంలు ఈఆర్సీకి సమర్పించలేదు. ఈ నేపథ్యంలో మూడేళ్ల ఏఆర్ఆర్ నివేదికలను ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో ఒకేసారి సమర్పించబోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ సుదీర్ఘ కసరత్తు... వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం? ఈ విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయడానికి ఎంత ఖర్చు కానుంది? ప్రస్తుత విద్యుత్ చార్జీలతో సరఫరా చేస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడనుంది? ఆర్థిక లోటును అధిగమించడానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి? గృహ, వాణిజ్య, పరిశ్రమల కేటగిరీల్లో ఎవరికెంత పెంచుతారు? వంటి ప్రతిపాదనలు ఏఆర్ఆర్ నివేదికలో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ తొలుత అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తుంది. అనంతరం బహిరంగ విచారణ నిర్వహించి ఏప్రిల్ 1తో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఉత్తర్వులను మార్చి 31లోగా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ నిర్వహణకు కనీసం నాలుగు నెలల సమయం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా నవంబర్ 30లోగా ఏఆర్ఆర్ నివేదికను సమర్పించాలని విద్యుత్ చట్టం పేర్కొంటోంది. రాజకీయ కారణాలతో గత మూడేళ్లుగా ఏఆర్‌ఆర్‌ను వాయిదా వేసుకుంటూ రావడంతో డిస్కంలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2018–19 నాటి టారిఫ్‌నే తర్వాతి రెండేళ్లు కొనసాగించడంతో డిస్కంల ఆర్థికలోటు రూ.20 వేల కోట్లకు చేరిందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 2019–20, 2020–21లో విద్యుత్ చార్జీలు పెంచకపోవడంతో జరిగిన నష్టాన్ని వినియోగదారుల నుంచి ‘ట్రూ అప్’చార్జీల రూపంలో వసూలు చేసేందుకు అనుమతించాలని సైతం డిస్కంలు ఈఆర్సీని కోరనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. దీనికి ఈఆర్సీ సమ్మతిస్తుందా? లేదా? అనేది వేచిచూడాలి. (చదవండి: ట్రూ-అప్ చార్జెస్ అంటే ఏమిటి?) డిస్కంలు గాడిలో పడేలా... ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీలు పోగా, మిగిలిన ఆదాయ లోటును చార్జీల పెంపు ద్వారా డిస్కంలు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంపునకు అనుమతిస్తే, అంతమేరకు ఆదాయ లోటు ఉందని ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వులు జారీ చేయడం ఆనవాయితీగా మారింది. ఇలా సర్దుబాటు చేస్తున్న ఆదాయలోటు వచ్చే ఏడాదికి బదిలీ కావడం, ఏటేటా ఇదే తంతు సాగుతుండడంతో ప్రస్తుతం కొండలా రూ.20 వేల కోట్లకు పెరిగిపోయి డిస్కంలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడేసింది. ఇక జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీతో పాటు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలు, సొలార్ విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలే రూ.14 వేల కోట్లకు చేరిపోయాయి. వీటిని చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో ఇటీవల డిస్కంలు కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీ కింద ఆర్ఈసీ, పీఎఫ్సీ నుంచి రూ.14 వేల కోట్ల రుణాన్ని పొందాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల కోట్ల వరకు విద్యుత్ చార్జీలు పెంచితే కాని డిస్కంలు ఆర్థికంగా కుదుటపడవని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త టారిఫ్‌లో ఉచిత హామీలు డిసెంబర్ నుంచి సెలూన్లు, ధోబి ఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టారిఫ్ పట్టికలో కొత్త కేటగిరీని సృష్టించి వీరికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదించనున్నాయి. ఉచిత విద్యుత్ సరఫరాతో డిస్కంలపై పడనున్న భారాన్ని ప్రభుత్వం భరించి... ఈ మేరకు విద్యుత్ సబ్సిడీలు పెంచాల్సి ఉంటుంది. -
పేదలపై భారం పడదు
సాక్షి, అమరావతి: పేదలపై పైసా కూడా భారం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కొత్త విద్యుత్ టారిఫ్ అమలులోకి రానుంది. 2020–21 టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఫిబ్రవరిలోనే వెలువరించింది. గత ఐదేళ్లుగా అనుసరించిన టారిఫ్‌కు ఇది పూర్తి భిన్నంగా ఉంది. దొడ్డిదారిన ప్రజలపై భారం మోపే విధానాలకు కమిషన్ స్వస్తి పలికింది. ప్రజలకు ఊరట.. సర్కారుపైనే భారం పేద, మధ్య తరగతి వర్గాలపై పైసా కూడా భారం పడరాదని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా డిస్కమ్‌లకు ఈసారి రూ.10,060.63 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ వినియోగానికి రూ.1,707.07 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ► విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధిక భారం మోపే విధానాన్ని గత సర్కారు ఐదేళ్లుగా అమలు చేసింది. దీన్ని ఇప్పుడు పూర్తిగా ఎత్తివేశారు. ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తారో టారిఫ్ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేస్తారు. దీనివల్ల 50 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. ► రాష్ట్రంలోని 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారుల్లో నెలకు 50 యూనిట్లు వినియోగించేవారు దాదాపు 50.90 లక్షల మంది ఉన్నారు. వీరి బిల్లు ఇప్పుడు (యూనిట్ రూ.1.45 చొప్పున) నెలకు రూ.72.50కి మించదు. ► ఇక నెలకు 51–75 యూనిట్లు విద్యుత్ వాడే వారి సంఖ్య 22.47 లక్షలు ఉంది. వీరికి గతంలో రూ.137.50 చొప్పున బిల్లు వస్తుండగా ఇప్పుడు కూడా అంతే రానుంది. (50 యూనిట్ల వరకూ యూనిట్ రూ.1.45 చొప్పున లెక్కిస్తారు. మిగిలిన 25 యూనిట్లకు యూనిట్ రూ.2.60 చొప్పున చెల్లించాలి). తద్వారా దాదాపు 74 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఒక్కపైసా కూడా కరెంట్ బిల్లు పెరిగే ప్రసక్తి ఉండదు. ► వినియోగం నెలకు 75 యూనిట్లు దాటిన వారికి కొత్త టారిఫ్ ప్రకారం బిల్లు తగ్గే వీలుంది. గతంలో 75 యూనిట్లు దాటితే ‘సి’ కేటగిరీ కింద పరిగణించేవారు. అంటే ఏడాదికి 900 యూనిట్లకు బదులు అదనంగా ఒక్కయూనిట్ వాడినా కేటగిరీ మారతారు. ఇప్పుడు ఏ నెలలో బిల్లు ఆ నెలలోనే వస్తుంది కాబట్టి చాలామందికి కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉంది. ► 101–200 యూనిట్ల విద్యుత్తు వినియోగించేవారు రాష్ట్రంలో 37.28 లక్షల మందే ఉన్నారు. 201–225 యూనిట్ల వాడకం ఉన్న వారు కేవలం 6.28 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వినియోగం తగ్గితే వీరు కూడా తక్కువ రేటు ఉండే శ్లాబులోకి వెళ్తారు. ప్రజాభిప్రాయం మేరకే.. ‘విద్యుత్ బిల్లుల భారం ప్రజలపై పడకూడదన్న ప్రభుత్వ విధానం మేరకు టారిఫ్ ఆర్డర్ రూపొందించాం. ప్రజాభిప్రాయాన్ని సేకరించాం. ఏడాదిలో క్రితం టారిఫ్‌ను లెక్కలోకి తీసుకుని సంవత్సరం పొడవునా బిల్లుల మోత ఏమిటని ప్రజలు ప్రశ్నించారు. అందుకే ఇలాంటి పద్ధతులను తొలగించాం. అన్ని వర్గాలకు ఊరట కల్పించేలా టారిఫ్ ప్రకటించాం. లాక్డౌన్ సమయంలోనూ ప్రజలపై భారం లేకుండా చేయగలిగామనే సంతృప్తి ఉంది’ -
నష్టాల్లో ఉన్నా విద్యుత్ టారిఫ్‌లను పెంచం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విద్యుత్ శాఖ నష్టాల్లో ఉన్నా విద్యుత్ టారిఫ్‌ను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విజయవాడ ఐదో నంబర్ రూట్లో పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) ప్రధాన కార్యాలయాన్ని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్‌లతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎనిమిది జిల్లాలకు కలిపి తిరుపతి కేంద్రంగా ఉండేదని చెప్పారు. విద్యుత్తు రంగంలో సంస్కరణల్లో భాగంగా సెంట్రల్ పవర్ డి్రస్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను మూడు జిల్లాలకు కలిపి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వ చర్యల వల్ల విద్యుత్ శాఖ రూ.70 వేల కోట్ల నష్టాల్లో ఉందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా వినియోగదారులపై భారం మోపవద్దని సీఎం స్పష్టం చేశారని చెప్పారు. ఆరు నెలల్లో ఎన్నో విద్యుత్ సంస్కరణలు.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆరు నెలల పాలనలో ఎన్నో విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చారని చెప్పారు. ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నెడ్ క్యాప్ ఎండీ రమణారెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాధరావు మాట్లాడుతూ.. పారిశ్రామికంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు, వ్యవసాయం, ఆక్వా రంగాల్లో ప్రకాశం జిల్లా ముందున్నాయన్నారు. -
పవర్‌పై చార్జ్!!
ముంబై: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలనే డిమాండ్ రోజురోజుకు మరింత రాజుకుంటుంది. విద్యుత్ చార్జీలను తగ్గించాలని మొన్న విదర్భ జనాందోళన్ సమితి ముఖ్యమంత్రిని కొరగా నిన్న కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్. 500 యూనిట్లలోపు వినియోగదారుల విద్యుత్ చార్జీలను సగానికిపైగా తగ్గించాని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నిన్నమొన్నటిదాకా లేఖలకే పరిమితమైన ఈ డిమాండ్ శనివారం హెచ్చరికల స్థాయికి చేరింది. విద్యుత్ టారిఫ్‌ను తగ్గించకపోతే ఉద్యమిస్తామని, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తూ సంజయ్ నిరుపమ్ ఈసారి కాస్త స్వరం పెంచారు. విద్యుత్ టారిఫ్ తగ్గింపు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనట్లయితే ఈ నెల 13న రిలయన్స్ ఎనర్జీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ‘ఫిక్స్డ్ చార్జిల పేరుతో గత ఏడాది రెండేళ్లుగా నగరవాసులపై భారం మోపుతున్నారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆస్తుల క్రమబద్ధీకరణ సాకుతో నగరంలో రిలయన్స్ ఎనర్జీ మౌలిక వసతులను కల్పిస్తోంది. ఈ పేరుతో రూ. 522 కోట్ల నుంచి రూ. 600 కోట్ల భారం ప్రజలపైనే మోపుతున్నారు. 500 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారు కూడా ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది. దీనిని వెంటనే ఆపివేయాలి. ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనట్లయితే 13వ తేదీని భారీ మోర్చా చేపడతాం. ఒకవేళ ఆ లోపు నిర్ణయం వెలువడితే మోర్చా రద్దు చేసుకునే విషయమై ఆలోచిస్తామ’ని నిరుపమ్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. భారమంతా ప్రభుత్వంపైనే మోపాల్సిన అవసరం లేదని, వ్యాపారం చేసుకుంటూ లాభాలు పొందుతున్న ప్రైవేటు కంపెనీలు కూడా కొంత భారం మోయాల్సిందేనన్నారు. గృహ వినియోగదారులకు ఊరట కలిగేలా ఒకట్రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తాము ఆశిస్తున్నామన్నారు. విద్యుత్ అమ్మకంపై పన్నును 15 శాతం తగ్గించుకుంటుందా? లేక కంపెనీలకు సబ్సిడీ ఇస్తుందా? అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. పన్నును తగ్గించుకున్నట్లయితే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని, సబ్సిడీ ఇచ్చినట్లయితే ప్రభుత్వ ఖర్చు పెరుగుతుందని, ప్రజలకు ఊరట కలిగించేందుకు చివరకు భారమేదైనా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై తాను రాసిన లేఖపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞలు చెప్పారు. అయితే ఒకట్రెండు వారాల్లో నిర్ణయం వస్తుందని ఆశిస్తూ.. వేచిచూస్తామని, అలా జరగనట్లయితే ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. దక్షిణ ముంబై నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నిరుపమ్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకే విద్యుత్‌ను అందిస్తున్నప్పుడు భారీగా ఆధాయమున్న మహారాష్ట్ర ఎందుకు ఇవ్వరాదంటూ ఎంపీ ప్రశ్నిస్తుండడాన్ని చాలా మంది సమర్థిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు జరిగేలా పథకం ప్రకారమే నిరుపమ్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, విద్యుత్ చార్జీలు తగ్గింపు కీర్తి అంతా కాంగ్రెస్‌కే దక్కేలా ఆయన వ్యూహాన్ని అమలు చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రంలో కూడా అమలు చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయని, ఇది రాష్ట్రంలో ఆప్ పార్టీ మరింత బలపడేందుకు ఉపయోగపడుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. అందుకే ఆప్ కంటే ముందే తామే చొరవ తీసుకొని సదరు పథకాలను అమలు చేసి, కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలనే ఉద్దేశంతో నే ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.