ప్రతీకాత్మక చిత్రం
గత రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. దాంతో డిస్కంల ఆదాయలోటు కొండలా పెరిగిపోయింది. రూ. 20 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) లు ఈ నెల 8 లేదా 9న రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించనున్నాయని ఉన్నతాధికార వర్గాలు ధ్రువీకరించాయి. విద్యుత్ చట్టం ప్రకారం ఏటా నవంబర్ 30లోగా... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల అంచనా నివేదిక (ఏఆర్‌ఆర్)ను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ను జీహెచ్‌ఎంసీ ఎన్నికల కారణంగా డిస్కంలు వాయిదా వేసుకున్నాయి. 2019–20, 2020–21 సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్‌ఆర్ నివేదికలను సైతం ఇప్పటివరకు డిస్కంలు ఈఆర్సీకి సమర్పించలేదు. ఈ నేపథ్యంలో మూడేళ్ల ఏఆర్‌ఆర్ నివేదికలను ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో ఒకేసారి సమర్పించబోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్
సుదీర్ఘ కసరత్తు...
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం? ఈ విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయడానికి ఎంత ఖర్చు కానుంది? ప్రస్తుత విద్యుత్ చార్జీలతో సరఫరా చేస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడనుంది? ఆర్థిక లోటును అధిగమించడానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి? గృహ, వాణిజ్య, పరిశ్రమల కేటగిరీల్లో ఎవరికెంత పెంచుతారు? వంటి ప్రతిపాదనలు ఏఆర్‌ఆర్ నివేదికలో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ తొలుత అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తుంది. అనంతరం బహిరంగ విచారణ నిర్వహించి ఏప్రిల్ 1తో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఉత్తర్వులను మార్చి 31లోగా జారీ చేయాల్సి ఉంటుంది.
ఈ మొత్తం ప్రక్రియ నిర్వహణకు కనీసం నాలుగు నెలల సమయం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా నవంబర్ 30లోగా ఏఆర్‌ఆర్ నివేదికను సమర్పించాలని విద్యుత్ చట్టం పేర్కొంటోంది. రాజకీయ కారణాలతో గత మూడేళ్లుగా ఏఆర్‌ఆర్‌ను వాయిదా వేసుకుంటూ రావడంతో డిస్కంలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2018–19 నాటి టారిఫ్‌నే తర్వాతి రెండేళ్లు కొనసాగించడంతో డిస్కంల ఆర్థికలోటు రూ.20 వేల కోట్లకు చేరిందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 2019–20, 2020–21లో విద్యుత్ చార్జీలు పెంచకపోవడంతో జరిగిన నష్టాన్ని వినియోగదారుల నుంచి ‘ట్రూ అప్’చార్జీల రూపంలో వసూలు చేసేందుకు అనుమతించాలని సైతం డిస్కంలు ఈఆర్సీని కోరనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. దీనికి ఈఆర్సీ సమ్మతిస్తుందా? లేదా? అనేది వేచిచూడాలి. (చదవండి: ట్రూ-అప్ చార్జెస్ అంటే ఏమిటి?)
డిస్కంలు గాడిలో పడేలా...
ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీలు పోగా, మిగిలిన ఆదాయ లోటును చార్జీల పెంపు ద్వారా డిస్కంలు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంపునకు అనుమతిస్తే, అంతమేరకు ఆదాయ లోటు ఉందని ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వులు జారీ చేయడం ఆనవాయితీగా మారింది. ఇలా సర్దుబాటు చేస్తున్న ఆదాయలోటు వచ్చే ఏడాదికి బదిలీ కావడం, ఏటేటా ఇదే తంతు సాగుతుండడంతో ప్రస్తుతం కొండలా రూ.20 వేల కోట్లకు పెరిగిపోయి డిస్కంలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడేసింది.
ఇక జెన్‌కో, సింగరేణి, ఎన్టీపీసీతో పాటు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలు, సొలార్ విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలే రూ.14 వేల కోట్లకు చేరిపోయాయి. వీటిని చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో ఇటీవల డిస్కంలు కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీ కింద ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ నుంచి రూ.14 వేల కోట్ల రుణాన్ని పొందాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల కోట్ల వరకు విద్యుత్ చార్జీలు పెంచితే కాని డిస్కంలు ఆర్థికంగా కుదుటపడవని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొత్త టారిఫ్‌లో ఉచిత హామీలు
డిసెంబర్ నుంచి సెలూన్లు, ధోబి ఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టారిఫ్ పట్టికలో కొత్త కేటగిరీని సృష్టించి వీరికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదించనున్నాయి. ఉచిత విద్యుత్ సరఫరాతో డిస్కంలపై పడనున్న భారాన్ని ప్రభుత్వం భరించి... ఈ మేరకు విద్యుత్ సబ్సిడీలు పెంచాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment