
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విద్యుత్ శాఖ నష్టాల్లో ఉన్నా విద్యుత్ టారిఫ్‌ను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విజయవాడ ఐదో నంబర్ రూట్‌లో పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) ప్రధాన కార్యాలయాన్ని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్‌లతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎనిమిది జిల్లాలకు కలిపి తిరుపతి కేంద్రంగా ఉండేదని చెప్పారు. విద్యుత్తు రంగంలో సంస్కరణల్లో భాగంగా సెంట్రల్ పవర్ డి్రస్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను మూడు జిల్లాలకు కలిపి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వ చర్యల వల్ల విద్యుత్ శాఖ రూ.70 వేల కోట్ల నష్టాల్లో ఉందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా వినియోగదారులపై భారం మోపవద్దని సీఎం స్పష్టం చేశారని చెప్పారు.
ఆరు నెలల్లో ఎన్నో విద్యుత్ సంస్కరణలు..
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆరు నెలల పాలనలో ఎన్నో విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చారని చెప్పారు. ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నెడ్ క్యాప్ ఎండీ రమణారెడ్డి, ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాధరావు మాట్లాడుతూ.. పారిశ్రామికంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు, వ్యవసాయం, ఆక్వా రంగాల్లో ప్రకాశం జిల్లా ముందున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment