పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రానిక్ పంపులనే వాడాలి
ఏలూరు : జిల్లాలోని పెట్రోల్ బంక్‌లలో ఎలక్ట్రానిక్ పంపులను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబురావునాయుడు తూనికలు, కొలతల శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మంగళవారం నిర్వహించిన నా రేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి ఫోన్ ద్వారా వచ్చిన 26 ఫిర్యాదులు అందాయి. తాడేపల్లిగూడెంలో పెట్రోలు బంకులలో ఎలక్ట్రానిక్ పంపులు వినియోగించడం లేదని, వీటిలో పెట్రోలు కొనుగోలు చేసినప్పుడు పూర్తి స్థాయిలో సొమ్ముకు తగ్గ పెట్రోలు రావడం లేదని వచ్చిన ఫిర్యాదుపై జేసీ స్పందించారు.
జిల్లాలో తూకంలో తేడాలు ఉండడానికి వీల్లేదని ప్రజలు చెల్లించే సొమ్ముకు తగిన విధంగా తూకం, కొలతలు ఉండాలని ఎక్కడైనా తప్పుడు తూనికలు, కొలతలు సాగిస్తే దాడులు చేసి చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతలు శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ సిద్ధార్థ్ కుమార్‌ను జేసీ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ వ్యక్తులు గ్యాస్‌ను అధిక ధరలకు అమ్ముతున్నారని పలువురు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో ఇటువంటి దళారులు ఉంటే ఆ సమాచారాన్ని సంబంధిత తహసిల్దార్లకు అందజేస్తే వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. తణుకు ప్రాంతంలో చౌకడిపో డీలర్ ఉదయం పూట షాపు తెరవడంలేదని, రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్లు నమోదు చేయడానికి చర్యలు తీసుకోవాలని తదితర అంశాలపై ప్రజలడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. డీఎస్వో శివశంకరెడ్డి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆర్ఎస్ఆర్ మాస్టార్, ఆనందరావు, రమణమూర్తి పాల్గొన్నారు.