ముంచుకొస్తున్న మరో ముప్పు!
వాషింగ్టన్: మనం నిత్యం వాడుతున్న మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, ఎలక్రిక్ వస్తువులు, ఇతర గాడ్జెట్లు... విచ్చలవిడిగా పెరుగుతున్న వాడకమే కాదు. వీటవల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఎలక్ట్రానిక్ వేస్టేజ్ కూడా ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2020 నివేదిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 52.7 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి కాగా అందులో కేవలం 17.4 శాతం మాత్రమే సేకరించి రీసైకిల్ చేసినట్లు వెల్లడించింది. ఈ నివేదిక ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను తిప్పికొట్టడంలో ఎంతో దోహదం చేస్తుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయ పడింది. గత ఏడాది మొత్తం ఉత్పత్తి అయిన ఈ-వ్యర్థాలలో ఆసియా పెద్దమొత్తంలో అనగా సుమారు - 46.4 శాతం ఉత్పత్తి చేయగా తరువాత స్థానాల్లో అమెరికా (24.4 శాతం), యూరప్ (22.3 శాతం), ఆఫ్రికా (5.4 శాతం), ఓషియానియా (1.3 శాతం) ఉన్నాయి. ఐరాస నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రస్తుతం ఉన్న ఈ-వేస్ట్‌కు అదనంగా 19.6 మిలియన్ టన్నులు జోడించి మొత్తం ఈ- వేస్ట్ 72.8 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని నివేదిక తెలిపింది. అంతేకాక ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ-వేస్ట్ సమస్య మరింత తీవ్రమవుతుందని నివేదిక హెచ్చరించింది. (కరోనా వ్యాక్సిన్‌కు రెండున్నర ఏళ్లు పడుతుంది)
ప్రపంచవ్యాప్తంగా ఏసీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ట్రిక్ దీపాల వాడకంతో పాటు స్మార్ట్ ఫోన్ల వినియోగం, తక్కువ లైఫ్‌టైం ఉన్న టెక్ గాడ్జెట్లు ఈ-వ్యర్థాల ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ఈ-వేస్ట్‌పై పోరాడటానికి ప్రపంచ దేశాలకు 2014వరకు ఎలాంటి విధానాలు లేవు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు ఈ-వేస్ట్ నియంత్రణ కోసం చట్టాలు, విధానాలు రూపొందించాయని నివేదిక పేర్కొన్నది. ప్రస్తుతం ఈ- వేస్ట్ నియంత్రణకు చట్టాలు రూపొందించిన దేశాల సంఖ్య 61 నుంచి 78 కి పెరిగిందని నివేదిక తెలిపింది. రాజకీయ కారణాల వల్ల ఇప్పటికి ఈ-వేస్ట్ నిర్వహణను పలు దేశాలు సరిగా అమలు చేయడం లేదని యూఎన్వో తెలిపింది. ఐక్యరాజ్యసమితి టెలికాం శాఖ అయిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సగానికి పైగా ప్రపంచ దేశాలు ఈ-వేస్ట్ చట్టాన్ని అమలు చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుతం 78 దేశాలు మాత్రమే ఈ-వేస్ట్ చట్టాలను రూపొందించాయి.
2015 సెప్టెంబరులో యూఎస్, దాని సభ్య దేశాలు సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను ఆమోదించాయి. దీనిలో 17 ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ (ఎస్డీజీ), ‘పేదరికాన్ని అంతం చేయడం, భూమిని పరిరక్షించడం,అందరి శ్రేయస్సుకు కృషి చేయడం’ వంటి 169 లక్ష్యాలను గుర్తించాయి. అయితే పెరుగుతున్న ఈ-వ్యర్థాలతో పాటు వాటిని అసురక్షిత పద్దతిలో ట్రీట్ చేయడం, కాల్చడం, పల్లపు ప్రదేశాలలో పారవేయడం వల్ల ఈ లక్ష్యాలను సాధించడానికి అవరోధం కలగడమే కాక మానవ ఆరోగ్యం పర్యావరణం దెబ్బతింటుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది.
ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2020 నివేదిక వెల్లడించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి
2019 లో వినియోగించిన ఫ్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్ల నుండి 98 మెట్రిక్ టన్నుల కార్జన్డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల అయ్యింది. ఇది ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో సుమారు 0.3 శాతంగా ఉంది.
గత సంవత్సరం పోగుపడ్డ ఈ-వ్యర్థాలను పంచితే భూమిపై ఉన్న ప్రతి పురుషుడు, స్త్రీ , బిడ్డకు సగటున 7.3 కిలోలు వస్తుంది.
16.2 కిలోల తలసరి ఈ-వ్యర్థాల ఉత్పత్తితో యూరప్ ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది. ఓషియానియా రెండవ స్థానంలో (16.1 కిలోలు), అమెరికా (13.3 కిలోలు) తువాతి స్థానంలో ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా చాలా తక్కువగా ఈ- వేస్ట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.
ఏటా 50 టన్నుల పాదరసాన్ని మానిటర్లు, పీసీబీలు ఫ్లోరోసెంట్, ఎనర్జీ సేవింగ్ లైట్ సోర్స్‌లలో ఉపయోగిస్తున్నారు.
2019 లో ఉత్పత్తి అయిన ఈ-వ్యర్థాల్లో ప్రధానంగా చిన్న పరికరాలు (17.4 టన్నులు), పెద్ద పరికరాలు (13.1 మెట్రిక్ టన్నులు) ఉష్ణోగ్రత మార్పిడి పరికరాలు (10.8 టన్నులు) ఉన్నాయి.
ఈ-వేస్ట్‌లో స్క్రీన్స్, మానిటర్లు, లైట్స్, చిన్న ఐటి ,టెలికమ్యూనికేషన్ పరికరాలు వరుసగా 6.7 మెట్రిక్ టన్నులు 4.7 మెట్రిక్ టన్నులు, 0.9 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి.
తక్కువ ఆదాయ దేశాలలో ఆర్థిక పరిస్థితులు మెరుగు పడుతుండటంతో ఎలాక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరుగుతుంది. ఫలితంగా ఈ-వెస్ట్ పెరుగుతోంది.
ఈ-వేస్ట్‌లో చిన్న ఐటీ, టెలికమ్యూనికేషన్ పరికరాల పెరుగుదల నెమ్మదిగా ఉండగా, స్క్రీన్లు మానిటర్లు స్వల్పంగా తగ్గుదలని చూపించాయి (-1 శాతం). భారీ సీఆర్టీ మానిటర్లు, స్క్రీన్ల స్థానంలో తేలికైన ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు ఎక్కువవుతున్నాయి.
2014 నుండి, జాతీయ ఈ-వేస్ట్ విధానాలు, చట్టాలు రూపొందించిన దేశాల సంఖ్య 61 నుంచి 78 కి పెరిగింది.
ఇది సానుకూల ధోరణి అయినప్పటికి, ఇది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నిర్దేశించిన లక్ష్యానికి దూరంగా ఉంది. ఈ యూనియన్ ఈ-వేస్ట్ చట్టాలు రూపొందించిన దేశాల శాతాన్ని 50 శాతానికి పెంచాలని భావిస్తోంది.