electronics engineer
-
Vidya Nambirajan: తండ్రి వారసురాలు.. ఉద్యోగం చేసుకోమని మీ నాన్న అయినా చెప్పలేదా?
‘‘అమ్మాయిలకు ఇక్కడేం పని?’’ నలుగురూ నడిచే దారిలో కాకుండా తనకంటూ కొత్తబాట వేసుకున్న స్త్రీలకు ఎదురయే తప్పనిసరి ప్రశ్న. ‘‘అప్పట్లో కార్పొరేట్ ఉద్యోగం చేసినట్లున్నావు!’’ ఆశ్చర్యం రూపంలో ఎదురయ్యే మరో ప్రశ్న. ‘‘నువ్వు చదివింది లైఫ్ సైన్స్ కదా!?’’ ‘‘గ్యారేజ్‌లోనే ఉంటావా! ఉద్యోగానికి వెళ్లవా!?’’ ‘‘నీకీ కష్టం ఎందుకే అమ్మాయి’’ ఆత్మీయుల ఆవేదన. ‘‘పెళ్లి చేసుకుని వెళ్లాల్సిన నువ్వు ఎంతకాలం ఇలాగ!! ఉద్యోగం చేసుకోమని మీ నాన్న అయినా చెప్పలేదా?’’ అన్నింటికీ ఆమె సమాధానం ఒక్కటే. ‘మా నాన్న కోసమే ఈ గ్యారేజ్‌లోకి వచ్చాను’. విద్యానంబిరాజన్... పేరులోనే తమిళదనాన్ని నింపుకున్న ఆమె పుట్టింది చెన్నైలో, పెరిగింది హైదరాబాద్‌లో. తంజావూరులో అయ్యంగార్ కుటుంబం, మాడభూషి వంశం. తాత హైకోర్టు న్యాయమూర్తి, తండ్రి నంబిరాజన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ముంబయిలోని శాంతాక్రజ్‌లో సివిల్ ఏవియేషన్‌లో ఉద్యోగం, ఆ తర్వాత హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగం. రిటైర్ అయిన తరవాత సికింద్రాబాద్, సైనిక్‌పురిలో ఇంటి ఆవరణలోనే ‘పారామౌంట్ ఆటో బే సర్వీసెస్’ పేరుతో తన కలల సామ్రాజ్యాన్ని స్థాపించారాయన. అలా 1988లో మొదలైన గ్యారేజ్‌ను తన ప్రయోగాలకు వేదిక చేసుకున్నారాయన. కుటుంబ కారణాల రీత్యా పరిశ్రమ బాధ్యత చేపట్టిన తర్వాత ఎదురైన సవాళ్లను విద్యానంబిరాజన్ ‘సాక్షి’తో పంచుకున్నారు. అక్కా అన్న వాళ్లే... ‘‘మా ఇంట్లోనే గ్యారేజ్ కావడంతో నాన్న దగ్గర పని చేసే ఉద్యోగులందరూ పరిచయమే. నేను చెన్నై నుంచి వచ్చినప్పుడు అందరూ ‘అక్కా’ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. అలాంటిది నేను గ్యారేజ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మారిపోయారు. నన్ను బాస్‌గా స్వీకరించలేకపోయారు. నేనేమో అప్పటివరకు కార్పొరేట్ సెక్టార్లోనే ఉద్యోగం చేశాను. ఒక మాట చెబితే ఆ పని పూర్తయిపోవాలి. అలాంటిది ఇక్కడ ఏదో ఒక నెపం చెప్పి పనిని వాయిదా వేసేవారు. ఇక కస్టమర్లయితే ‘రాంగ్ ప్లేస్‌కి వచ్చామా’ అన్నట్లు చూసేవారు. కారు ఇవ్వవచ్చా, మరో గ్యారేజ్‌కి వెళ్లిపోదామా అనే సందిగ్ధం కనిపించేది. ఇంటర్వ్యూ చేసినట్లు మెకానికల్ రంగం గురించి అనేక ప్రశ్నలు వేసేవాళ్లు. రిపేర్, పెయింటింగ్, ఐసీ ఇంజిన్ వంటివన్నీ నాన్న నేర్పించారు. అయితే అప్పట్లో ఫియట్లు, అంబాసిడర్లే ఎక్కువ. నేను 2001లో టేకప్ చేసినప్పటి నుంచి ఆటోమొబైల్ రంగం చాలా వేగంగా మార్పులు సంతరించుకుంది. టెక్నాలజీ అంతా సాఫ్ట్వేర్ ఆధారితంగా మారిపోయింది. ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను. ఎంత నేర్చుకున్నప్పటికీ, నా ధోరణి మాత్రం సీఈవో తన సీట్లో నుంచి కదలాల్సిన అవసరమేముంది? అన్నట్లు ఉండేది. నాన్న అందుకు ఒప్పుకునేవారు కాదు. ‘వాహనం రిపేరు చేస్తున్నది మెకానిక్ అయినా సరే పని జరుగుతున్నప్పుడు నువ్వు దగ్గర ఉండాలి’ అనేవారు. అలాగేనని నేను దగ్గర ఉంటే మెకానిక్‌లు నేను కారు దగ్గర ఉన్నంతసేపు పని పూర్తిచేసే వారు కాదు. పది నిమిషాలు మరో విభాగంలోకి వెళ్లి వచ్చేలోపు అంతా సెట్ చేసి పెట్టేసేవాళ్లు. ‘ప్రాబ్లమ్ ఏంటి’ అంటే మాట దాట వేసే వాళ్లు. మళ్లీ మళ్లీ అడుగుతుంటే వాళ్లకు నచ్చేది కాదు. నేనే స్వయంగా పని చేయడానికి టూల్స్ తీసుకుంటే అవమానంగా భావించేవాళ్లు. అలా నాన్నతో ఉన్నవాళ్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. మొత్తానికి నాకు పని వచ్చని తెలిసిన సందర్భం ఏదంటే... మా సీనియర్ మెకానిక్ ఉద్యోగం మానేసి వెళ్లినప్పుడు. గ్యారేజ్‌లో ఇలా ఉంటే... ఇక మెటీరియల్ కొనేటప్పుడు కూడా ఘోరంగా మోసపోతుండేదాన్ని. వాళ్ల రిసీవింగ్ గొప్పగా ఉండేది. ‘ఎంత మంచి ఇంగ్లిష్ మాట్లాడుతున్నారో’ అని ప్రశంసిస్తూ ‘మేడమ్‌కి స్పెషల్ మెటీరియల్ ఇవ్వమని’ చెప్పేవాళ్లు. సీల్ పక్కాగా ఉండేది. ఒకసారి ప్రయత్నించి విఫలమైన వస్తువులను కూడా తిరిగి ప్యాక్ చేసి సీల్ చేస్తారని తెలిసింది. ఈ ప్రొఫెషన్ వదిలి వెళ్లిపోవాలనిపించిన ఇలాంటి సందర్భాలెన్నో. ఉద్యోగ జీవితం నాకు నల్లేరు మీద నడకలా సాగింది మరి. చూస్తూ ఊరుకోకూడదు! ‘ఒక ఉద్యోగి మన గ్యారేజ్ వదిలి వెళ్తున్నాడంటే అందుకు కారణం ఏమిటో స్వయంగా నువ్వే తెలుసుకోవాలి. ఒక ఉద్యోగి నాలుగ్గోడల మధ్య యజమాని ముందు మాత్రమే మనసు విప్పి మాట్లాడతారు’ అని చెప్పేవారు నాన్న. అలాగే ‘నాకు టైమ్ లేదు’ అని ఎవరైనా అన్నారంటే అందుకు ఒప్పుకునేవారు కాదు. తెలివైన వారయితే టైమ్ కుదుర్చుకుంటారు... అని కూడా చెప్పేవారు. నా సేవింగ్స్ మూడు లక్షలు, బ్యాంకు లోన్ మూడున్నర లక్షలు పెట్టి గ్యారేజ్‌ను విస్తరించాను. ఉద్యోగులకు జీతాలిస్తూ, బ్యాంకు వాయిదాలు కట్టడం కష్టమైపోయింది. తుంటి ఎముక విరగడంతో అమ్మ మూడేళ్లు మంచంలోనే ఉంది. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది– పది వరకు ఇల్లు, గ్యారేజ్ పని. నా పరిస్థితి చూసి నాన్న ఓసారి చాలా బాధగా ‘నీ కెరియర్ స్పాయిల్ చేశానా విద్యా?’ అన్నారు. ఉద్యోగంలో కొనసాగి ఉంటే ఇప్పటికి ఏదో ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయ్యేదానివి... అన్నారు. నా శ్రమను మరో కంపెనీ అభివృద్ధి కోసం వినియోగించడం ఎందుకు నాన్నా? నీ పరిశ్రమను విస్తరించడానికే ఉపయోగపెడతానని చెప్పాను. అదే సమయంలోనే ఈ రంగంలో స్కానర్ వచ్చింది. నా చదువు ఆ టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి బాగా ఉపకరించింది. అప్పటినుంచి మెకానిక్‌లు నన్ను తేలికగా చూడడానికి సాహసించలేకపోయారు. గ్యారేజ్ మొత్తం నా నియంత్రణలోకి వచ్చేసింది. అప్పటికి 2012 వచ్చింది. అప్పుడు నాన్న సంతోషంగా ‘నువ్వు పదిమందికి జీవితాన్ని ఇవ్వగలవు’ అన్నారు. అది నాకు అసలైన సర్టిఫికేట్. మూడు నెలల శిక్షణ తరగతులు మా గ్యారేజ్‌ను పతాక స్థాయికి తీసుకువెళ్లాయి. నాన్న పేరుతో ఫౌండేషన్ స్థాపించి శిక్షణనిస్తున్నాం. మన గవర్నమెంట్లో ఏఎస్‌డీసీ సహకారంతో ట్రైనింగ్ క్లాసుల ద్వారా ఎనిమిది వందల మందికి శిక్షణనిచ్చాం. జర్మనీ కంపెనీతో నేరుగా అంగీకారం కుదుర్చుకున్నాం. అనేక కాలేజ్‌లు మాతో అనుసంధానం అయి ఉన్నాయిప్పుడు’’ అని మెండైన ఆత్మవిశ్వాసంతో చెప్పారు విద్యానంబిరాజన్. ప్రయాణం ఆపలేదు! గ్యారేజ్ నిర్వహణలో ఓ దశలో నా బంగారం కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అన్న, తమ్ముడు యూఎస్‌లో మంచి స్థితిలోనే ఉన్నారు కానీ వారి నుంచి సహాయం తీసుకోవడం నాన్నకు ఇష్టం లేదు. కష్టమైనా నష్టమైనా మనిద్దరమే భరించాలనేవారు. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన చెప్పినట్లే నడిపిస్తున్నాను. కరోనా సమయంలో మాత్రం మా తమ్ముడు ‘గ్యారేజ్ నడవకపోతే నీ ఉద్యోగుల జీతాలకు డబ్బు ఎలాగ’ అని కొంత డబ్బు పంపించాడు. ఎన్నో సంతోషాలు, సవాళ్లు... ఎన్ని సవాళ్లు ఎదురైనా నా జర్నీని ఆపలేదు. ఎన్నిసార్లు కిందపడ్డామని కాదు, ఎన్నిసార్లు లేచామనేది ముఖ్యం. మొదటిసారి పడినప్పుడు లేవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఆ తర్వాత పడిన మరుక్షణం లేచి పొరపాటును సరిదిద్దుకోగలుగుతారు ఎవరైనా. నాన్న కోసం ఎంచుకున్న రంగానికి వన్నె తెచ్చానని చెప్పగలను. మా కంపెనీ లోగోలో ఉన్నట్లు నా ప్రయాణం శిఖరానికి చేరువవుతోంది. – విద్యానంబిరాజన్, సీఈవో, పారామౌంట్ ఆటో బే సర్వీసెస్, సికింద్రాబాద్. నాన్నా! నేనున్నాను! నంబిరాజన్ గ్యారేజ్ స్థాపించి పదేళ్లు గడిచిపోయాయి. ఇద్దరు కొడుకులు యూఎస్‌లో స్థిరపడ్డారు. కూతురు విద్య హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అన్నపూర్ణ ఫాయిల్స్కి రీజియనల్ మేనేజర్. తల్లిదండ్రులు అనారోగ్యం బారిన పడితే ఉన్నఫళాన ఫ్లయిట్ ఎక్కి హైదరాబాద్‌కు రాగలిగింది ఇండియాలో ఉన్న కూతురు మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో విద్యానంబిరాజన్కు ఎయిర్టెల్, హైదరాబాద్ విభాగంలో పెద్ద ప్యాకేజ్‌తో ఉద్యోగం వచ్చింది. అప్పటికే పాలిన్ ఎలర్జీ, అల్ట్రా వయొలెట్ కిరణాలను భరించలేకపోవడం వంటి సమస్యలు తండ్రిని తీవ్రమైన చర్మసమస్యకు గురి చేశాయి. కూతురు దగ్గరే ఉంది. కానీ ఆయనలో తీవ్రమైన బెంగ. కొడుకులు దగ్గర లేరు. తాను నిర్మించుకున్న ఈ చిన్న సామ్రాజ్యాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? ఇది ఆడపిల్లలు చేయగలిగిన పని కాదు కదా అని మథనపడుతున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో విద్యానంబిరాజన్ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ఇంటికి వచ్చి ‘మీ ఇండస్ట్రీని నేను నడిపిస్తాను’ అని చెప్పారు. -వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
బొమ్మలు తెచ్చి... బాలలకిచ్చి...
శ్వేతాచారి... ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవాలనే లక్ష్యంతో... తన ఇరవై రెండోఏట ‘టాయ్‌బ్యాంక్’ పేరిట ఓ ఎన్‌జివోను స్థాపించారు. ఇవ్వగలిగే స్థితిలో ఉన్నవారి దగ్గర నుంచి బొమ్మలు సేకరించి, కొనలేని స్థితిలో ఉన్నవారికి అందచేస్తున్నారు. ఆ రకంగా ధనిక పేద అనే విభజన రేఖను పిల్లల మధ్య చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. ముంబైకి చెందిన ఆమె ప్రయాణం ఎంతో ఆసక్తికరం. ‘‘స్నేహితులమంతా కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్యలో... మన దేశంలోని పిల్లలంతా బొమ్మలతో ఆడుకోగలుగుతున్నారా? అని చర్చించుకున్నాం. మాకు తెలిసినంత వరకు చాలామంది పిల్లలకు బొమ్మలు అందుబాటులో లేవు. వారంతా బొమ్మలతో ఆడుతుంటే, చూసి ఆనందించాలనుకున్నాం. ఈ ఆలోచనకు కార్యరూపం సరిగ్గా పదేళ్ళ క్రితం ఆగస్టు 15న ఆచరణలోకి వచ్చింది’’ అంటారు శ్వేతాచారి. అందుకోసం ‘టాయ్ బ్యాంక్’ అనే లాభాపేక్ష రహిత సంస్థను స్థాపించి, చిన్నారులకు ఆట బొమ్మలు అందచేసి, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని తయారుచేయాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు శ్వేతాచారి. సంస్థను ప్రారంభించిన కొత్తలో ఇలా సేకరించిన బొమ్మలను కేవలం ముంబై చుట్టుపక్కల ప్రాంతాలలోని బాలలకు మాత్రమే అందచేశారు. ఇప్పుడు ఈ టాయ్‌బ్యాంక్ బెంగళూరు, పుణే, ఢిల్లీ ప్రాంతాలకు విస్తరించింది. ఇలా అందచేస్తారు... ధనికుల ఇళ్ళ నుంచి ఈ సంస్థ ద్వారా సేకరించిన బొమ్మలను ఏ వయసుకు తగ్గ పిల్లలకు ఇవ్వాలో చూసి, అలా వర్గీకరిస్తారు. ఆ పైన అందమైన గిఫ్ట్ ప్యాకింగ్ చేసి చిన్నారులకు అందచేస్తారు. ఇలా బొమ్మలు అందచేశాక, ఆ పిల్లల ప్రవర్తన, ఆలోచన ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ‘‘ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ బొమ్మలతో ఆడుకున్న తర్వాత పిల్లల ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ఆ సంగతి మేము గమనించాం’’ అంటారు శ్వేతాచారి. వారి చిరునవ్వే లక్ష్యం శ్వేతాచారి చేస్తున్న మంచిపనికి చాలామంది సహకరించారు. కొందరు బొమ్మలు అందచేస్తే, కొందరు ఆ బొమ్మలతో ఆడుకోవడానికి కావలసిన స్థలం కేటాయించారు. ‘‘మేం చేస్తున్న పనికి ఊహించనంత ఆదరణ లభించింది. ఈ బొమ్మలతో ఆడుకోవడానికి ఇక్కడకు వచ్చే పిల్లలకు... ‘ఇతరులతో పంచుకోవడం’ అనే విషయాన్ని నేర్పిస్తాం. ఇక్కడకు వచ్చి ఆడుకునే పిల్లల ముఖాలలో చిరునవ్వు చూడాలన్నదే మా ఆశ’’ అంటారు శ్వేతాచారి. ప్రచారం లేని... మంచి పని ఎటువంటి ప్రచారం, ప్రకటనలు లేకుండా టాయ్‌బ్యాంక్ తన సేవలను అందిస్తూనే ఉంది. పిల్లలకు విజ్ఞానాన్ని కలిగించే బొమ్మలను ఎంచుకుంటారు. బొమ్మలతో ఆడుకోవడం పిల్లలకు ఎంత అవసరమో చెబుతూ, ‘‘వీధిబాలలు రాళ్లతో, విరిగిన బొమ్మలతో, సైకిల్ టైర్లతో ఆడుతూ కనపడతారు. అటువంటివారికి మా సంస్థ ఆట బొమ్మలు అందచేస్తుంది. పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పేలా బొమ్మలను అందచేస్తున్నాం. పిల్లలకు బొమ్మలు ఇవ్వకపోతే, పెద్దయ్యాక వారిలో హింసా ప్రవృత్తి చోటుచేసుకుంటుంది’’ అంటారు శ్వేతాచారి. దేశవ్యాప్తంగా తొమ్మిది వేల బొమ్మలను సేకరించి, నిరుపేద చిన్నారులకు పంపిణీ చేసిన శ్వేతాచారి ఒక ఉత్పాదక కేంద్రం ప్రారంభించి, దాని మీద వచ్చే లాభాలతో బొమ్మలు కొనుగోలు చేసి టాయ్‌బ్యాంక్ కార్యకలాపాలు నడపాలనుకుంటున్నారు. ప్రపంచంలోని బాలలంతా ఎక్కువ తక్కువలనే తేడా లేకుండా బాగా చదువుకుని, బొమ్మలతో ఆడుకొనేలా చేస్తే మా లక్ష్యం నెరవేరినట్లే’’ అంటారు శ్వేత. ఇలాంటి బొమ్మలు తీసుకోరు! హింసను ప్రేరేపించే తుపాకులు, కత్తులు పాడైపోయి, విరిగిపోయినవి బార్బీ బొమ్మలు (ఈ సంస్థ వివక్షను ఇష్టపడదు) ఆటబొమ్మలతో ఆశయాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలలంతా బొమ్మలతో ఆడుకోవడం ఆర్థిక అసమానతలకు దూరంగా బాలలంతా సృజనాత్మకతతో ఆడుకుంటూ అనేక కార్యక్రమాలలో పాల్గొనడం బాలల పార్లమెంట్, ప్లేగ్రూప్స్, బొమ్మల పాఠ్యప్రణాళిక ద్వారా పిల్లలకు విద్య, విజ్ఞానం కలిగించడం బొమ్మల గ్రంథాలయాలు ఏర్పాటుచేసి, పిల్లలు ఆడుకోవడానికి అనువైన స్థలం ఉండేలా చేయడం