బొమ్మలు తెచ్చి... బాలలకిచ్చి...
శ్వేతాచారి... ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవాలనే లక్ష్యంతో... తన ఇరవై రెండోఏట ‘టాయ్‌బ్యాంక్’ పేరిట ఓ ఎన్‌జివోను స్థాపించారు. ఇవ్వగలిగే స్థితిలో ఉన్నవారి దగ్గర నుంచి బొమ్మలు సేకరించి, కొనలేని స్థితిలో ఉన్నవారికి అందచేస్తున్నారు. ఆ రకంగా ధనిక పేద అనే విభజన రేఖను పిల్లల మధ్య చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. ముంబైకి చెందిన ఆమె ప్రయాణం ఎంతో ఆసక్తికరం.
‘‘స్నేహితులమంతా కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్యలో... మన దేశంలోని పిల్లలంతా బొమ్మలతో ఆడుకోగలుగుతున్నారా? అని చర్చించుకున్నాం. మాకు తెలిసినంత వరకు చాలామంది పిల్లలకు బొమ్మలు అందుబాటులో లేవు. వారంతా బొమ్మలతో ఆడుతుంటే, చూసి ఆనందించాలనుకున్నాం. ఈ ఆలోచనకు కార్యరూపం సరిగ్గా పదేళ్ళ క్రితం ఆగస్టు 15న ఆచరణలోకి వచ్చింది’’ అంటారు శ్వేతాచారి.
అందుకోసం ‘టాయ్ బ్యాంక్’ అనే లాభాపేక్ష రహిత సంస్థను స్థాపించి, చిన్నారులకు ఆట బొమ్మలు అందచేసి, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని తయారుచేయాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు శ్వేతాచారి. సంస్థను ప్రారంభించిన కొత్తలో ఇలా సేకరించిన బొమ్మలను కేవలం ముంబై చుట్టుపక్కల ప్రాంతాలలోని బాలలకు మాత్రమే అందచేశారు. ఇప్పుడు ఈ టాయ్‌బ్యాంక్ బెంగళూరు, పుణే, ఢిల్లీ ప్రాంతాలకు విస్తరించింది.
ఇలా అందచేస్తారు...
ధనికుల ఇళ్ళ నుంచి ఈ సంస్థ ద్వారా సేకరించిన బొమ్మలను ఏ వయసుకు తగ్గ పిల్లలకు ఇవ్వాలో చూసి, అలా వర్గీకరిస్తారు. ఆ పైన అందమైన గిఫ్ట్ ప్యాకింగ్ చేసి చిన్నారులకు అందచేస్తారు. ఇలా బొమ్మలు అందచేశాక, ఆ పిల్లల ప్రవర్తన, ఆలోచన ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ‘‘ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ బొమ్మలతో ఆడుకున్న తర్వాత పిల్లల ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ఆ సంగతి మేము గమనించాం’’ అంటారు శ్వేతాచారి.
వారి చిరునవ్వే లక్ష్యం
శ్వేతాచారి చేస్తున్న మంచిపనికి చాలామంది సహకరించారు. కొందరు బొమ్మలు అందచేస్తే, కొందరు ఆ బొమ్మలతో ఆడుకోవడానికి కావలసిన స్థలం కేటాయించారు. ‘‘మేం చేస్తున్న పనికి ఊహించనంత ఆదరణ లభించింది. ఈ బొమ్మలతో ఆడుకోవడానికి ఇక్కడకు వచ్చే పిల్లలకు... ‘ఇతరులతో పంచుకోవడం’ అనే విషయాన్ని నేర్పిస్తాం. ఇక్కడకు వచ్చి ఆడుకునే పిల్లల ముఖాలలో చిరునవ్వు చూడాలన్నదే మా ఆశ’’ అంటారు శ్వేతాచారి.
ప్రచారం లేని... మంచి పని
ఎటువంటి ప్రచారం, ప్రకటనలు లేకుండా టాయ్‌బ్యాంక్ తన సేవలను అందిస్తూనే ఉంది. పిల్లలకు విజ్ఞానాన్ని కలిగించే బొమ్మలను ఎంచుకుంటారు. బొమ్మలతో ఆడుకోవడం పిల్లలకు ఎంత అవసరమో చెబుతూ, ‘‘వీధిబాలలు రాళ్లతో, విరిగిన బొమ్మలతో, సైకిల్ టైర్లతో ఆడుతూ కనపడతారు. అటువంటివారికి మా సంస్థ ఆట బొమ్మలు అందచేస్తుంది. పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పేలా బొమ్మలను అందచేస్తున్నాం. పిల్లలకు బొమ్మలు ఇవ్వకపోతే, పెద్దయ్యాక వారిలో హింసా ప్రవృత్తి చోటుచేసుకుంటుంది’’ అంటారు శ్వేతాచారి.
దేశవ్యాప్తంగా తొమ్మిది వేల బొమ్మలను సేకరించి, నిరుపేద చిన్నారులకు పంపిణీ చేసిన శ్వేతాచారి ఒక ఉత్పాదక కేంద్రం ప్రారంభించి, దాని మీద వచ్చే లాభాలతో బొమ్మలు కొనుగోలు చేసి టాయ్‌బ్యాంక్ కార్యకలాపాలు నడపాలనుకుంటున్నారు. ప్రపంచంలోని బాలలంతా ఎక్కువ తక్కువలనే తేడా లేకుండా బాగా చదువుకుని, బొమ్మలతో ఆడుకొనేలా చేస్తే మా లక్ష్యం నెరవేరినట్లే’’ అంటారు శ్వేత.
ఇలాంటి బొమ్మలు తీసుకోరు!
హింసను ప్రేరేపించే తుపాకులు, కత్తులు
పాడైపోయి, విరిగిపోయినవి
బార్బీ బొమ్మలు (ఈ సంస్థ వివక్షను ఇష్టపడదు)
ఆటబొమ్మలతో ఆశయాలు
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలలంతా బొమ్మలతో ఆడుకోవడం
ఆర్థిక అసమానతలకు దూరంగా బాలలంతా సృజనాత్మకతతో ఆడుకుంటూ అనేక కార్యక్రమాలలో పాల్గొనడం
బాలల పార్లమెంట్, ప్లేగ్రూప్స్, బొమ్మల పాఠ్యప్రణాళిక ద్వారా పిల్లలకు విద్య, విజ్ఞానం కలిగించడం
బొమ్మల గ్రంథాలయాలు ఏర్పాటుచేసి, పిల్లలు ఆడుకోవడానికి అనువైన స్థలం ఉండేలా చేయడం