టాయ్ బ్యాంక్, ఇది పిల్లలు డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంకు కాదు. పిల్లలు ఆడుకునే బొమ్మల బ్యాంకు. పుస్తకాలు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పెద్దవాళ్లు లైబ్రరీకి వెళ్లి తమకు నచ్చిన పుస్తకాన్ని చదువుకున్నట్లే ఇది కూడా. అందరూ అన్ని పుస్తకాలనూ కొనుక్కోవడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి లైబ్రరీ అనే ఒక అందమైన ప్రదేశం ఆవిష్కృతమైంది. మరి, బొమ్మలతో ఆడుకునే బాల్యాన్ని హక్కుగా కలిగిన పిల్లల గురించి ఎవరైనా ఆలోచించారా? విద్యున్ గోయెల్ ఆలోచించారు. ఆమె టాయ్ బ్యాంకు పేరుతో ఒక బొమ్మల నిలయానికి రూపకల్పన చేశారు. నాలుగేళ్ల కిందట ఆమె ప్రారంభించిన టాయ్ బ్యాంకు బొమ్మలతో ఇప్పటికి ఐదు లక్షల మంది పిల్లలు ఆడుకున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
విద్యున్ గోయెల్ బాల్యం దాటి కాలేజ్ చదువుకు వచ్చిన సమయం అది. పైగా వాళ్ల నాన్నకు ఉద్యోగ రీత్యా బదిలీ కూడా. ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ ఒక చోట జమ చేస్తే ఓ గది నిండేలా ఉంది. వాటన్నింటినీ ఏం చేయాలనే ప్రశ్న అందరిలో. పారేయడానికి మనసు ఒప్పుకోదు. తమతో తీసుకువెళ్లడమూ కుదిరే పని కాదు. అప్పుడు వాళ్ల నాన్న ‘ఈ బొమ్మలన్నింటినీ వెనుక ఉన్న కాలనీలో పిల్లలకు ఇస్తే, వాళ్లు సంతోషంగా ఆడుకుంటారు’ అని సలహా ఇచ్చారు. అంతే... తన బొమ్మలతోపాటు తన స్నేహితుల ఇళ్లలో అటక మీద ఉన్న బొమ్మలను కూడా జత చేసి పంచేసింది విద్యున్ గోయెల్. అలా మొదలైన బొమ్మల పంపకాన్ని ఆమె పెద్దయిన తర్వాత కూడా కొనసాగించింది. టాయ్ బ్యాంకు పేరుతో బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది.
చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు..
దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లలుంటారు. వాళ్లు పెద్దయిన తర్వాత ఆ బొమ్మలు అటకెక్కుతుంటాయి. అలా తెలిసిన వాళ్లందరి నుంచి సేకరించిన బొమ్మలను ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు, షెల్టర్ హోమ్స్‌లో ఉన్న పిల్లలకు, పిల్లల హాస్పిటళ్లు, అల్పాదాయ వర్గాల కాలనీలకు వెళ్లి పంపిణీ చేయడం మొదలు పెట్టింది. ఆమె టాయ్ బ్యాంకు సర్వీస్ ఏ ఒక్క నగరానికో, పట్టణానికో పరిమితం కాలేదు. ఆమె మొదలు పెట్టిన ఈ కాన్సెప్ట్‌ను దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకున్నారు. ఇప్పటి వరకు టాయ్ బ్యాంకు బొమ్మలతో ఆడుకున్న పిల్లలు ఐదు లక్షలకు చేరి ఉంటుందని అంచనా.
మనం కూడా మనవంతుగా టాయ్‌బ్యాంకు వితరణలో పాల్గొందాం. ఇంట్లో ఉన్న బొమ్మలను మన ఊళ్లోని అంగన్‌వాడీ కేంద్రానికి విరాళంగా ఇద్దాం. మన పిల్లలకు వాళ్ల జ్ఞాపకంగా ఒకట్రెండు బొమ్మలను ఉంచి మిగిలిన వాటిని బొమ్మలతో ఆడుకునే వయసు పిల్లలకు ఇద్దాం. ఇచ్చేసే బొమ్మలు కూడా ఓ జ్ఞాపకంగా ఉండాలనుకుంటే మన పిల్లల చేతనే ఇప్పిస్తూ చక్కటి ఫొటో తీసుకుంటే... పెద్దయ్యాక ఆ ఫొటోలు చూసుకుని సంతోషిస్తారు. ఆ బొమ్మలతో ఆడుకునే పిల్లలు బొమ్మల లోకంలో ఆనందంగా విహరిస్తారు.
చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట!
Comments
Please login to add a commentAdd a comment