elite match
-
ఆంధ్రను గెలిపించిన స్టీఫెన్
వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతా లో రెండో విజయం చేరింది. జార్ఖండ్ జట్టుతో శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. ఆంధ్ర బౌలర్లు చీపురపల్లి స్టీఫెన్ (3/23), హరిశంకర్ రెడ్డి (3/24) రాణించారు. 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడిపో యింది. చివరి ఓవర్లో జార్ఖండ్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఐదు వికెట్లున్నాయి. అయితే జార్ఖండ్ ఒక్క పరుగు మాత్రమే చేసి నాలుగు వికెట్లు (రెండు వికెట్లు స్టీఫెన్, రెండు రనౌట్లు) కోల్పోయింది. ఆఖరి ఓవర్ వేసిన ఆంధ్ర బౌలర్ స్టీఫెన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి జార్ఖండ్‌ను కట్టడి చేశాడు. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ నాలుగు క్యాచ్‌లు తీసుకోవడంతోపాటు ఒక రనౌట్‌లో పాలుపంచుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. అశ్విన్ హెబ్బార్ (45; 6 ఫోర్లు), శ్రీకర్ భరత్ (48; 5 ఫోర్లు), రికీ భుయ్ (15 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. -
కేరళకు ఆంధ్ర షాక్
ముంబై: వరుసగా మూడు పరాజయాలు చవిచూశాక... నాకౌట్ అవకాశాలు గల్లంతయ్యాక... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తేరుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరుమీదున్న కేరళ జట్టును ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. టాస్ నెగ్గిన ఆంధ్ర ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ 20 ఓవర్లలో 4 వికెట్లకు 112 పరుగులే చేసింది. ఆంధ్ర స్పిన్నర్లు జి.మనీశ్ (2/19), లలిత్ మోహన్ (1/21), షోయబ్ మొహమ్మద్ ఖాన్ (1/12) కేరళ జట్టును కట్టడి చేశారు. రాబిన్ ఉతప్ప (8), మొహమ్మద్ అజహరుద్దీన్ (12), సంజూ సామ్సన్ (7), విష్ణు వినోద్ (4) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో కేరళ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సచిన్ బేబీ (34 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్స్‌లు), జలజ్ సక్సేనా (34 బంతుల్లో 27 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా 74 పరుగులు జోడించడంతో కేరళ స్కోరు 100 పరుగులు దాటింది. 113 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీకర్ భరత్ (9), మనీశ్ (5), రికీ భుయ్ (1) వెంటవెంటనే అవుటవ్వడంతో ఆంధ్ర 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. అయితే ఓపెనర్ అశ్విన్ హెబర్ (46 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (27 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) నాలుగో వికెట్‌కు 48 పరుగులు జత చేసి ఆదుకున్నారు. శ్రీశాంత్ బౌలింగ్‌లో అశ్విన్ అవుటయ్యాక... ప్రశాంత్ కుమార్ (9 నాటౌట్)తో కలిసి రాయుడు ఆంధ్రను విజయతీరాలకు చేర్చాడు. -
జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
కడప స్పోర్ట్స్ : ఈనెల 27 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు కడప నగరంలో నిర్వహించనున్న అంతర్ జిల్లాల అండర్–19 ఎలైట్ గ్రూపు మ్యాచ్‌లలో పాల్గొనే జిల్లా అండర్–19 జట్టును జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రామ్మూర్తి ప్రకటించారు. గత నెలలో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రాబబుల్స్‌కు ఎంపికచేసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించిన అనంతరం తుదిజట్టును శనివారం ప్రకటించారు జిల్లా అండర్–19 జట్టు : ఎస్ఎండీ రఫీ (కెప్టెన్), వంశీకృష్ణ (వైస్ కెప్టెన్), ధృవకుమార్, నూర్‌బాషా, భరద్వాజ్, హరికృష్ణ, శ్రీహరి, సాయిసుధీర్, అభిషేక్, అజారుద్దీన్, తేజ, మారుతీశంకరాచార్య, జహీర్అబ్బాస్, సత్యప్రణవ్, సులేమాన్, ఆరీఫ్‌బాషా. స్టాండ్‌బై : నూర్‌అహ్మద్,మదన్, భరత్‌రెడ్డి, దిలీప్, జాఫర్, సాయిచెన్నారెడ్డి, సుదర్శన్.