జ్వరాలతో వణుకుతున్న గురుకులం
సిద్దిపేట రూరల్:మండలంలోని మిట్టపల్లి, ఎల్లుపల్లి గ్రామాల శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విష జ్వరాలతో వణుకుతోంది. ఒకే రోజు పదుల సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా వాంతులు, విరేచనాలు, విషజ్వరాలతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావడంతో, 20మందిని ఆటోల్లో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్సలు అందించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ సంబంధిత పుల్లూర్ పీహెచ్సీ వైద్యులకు సూచించారు. దీంతో వైద్యుడు శివకుమార్ నేతృత్వంలో పాఠశాలలో హెల్త్క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్త్క్యాంప్ ద్వారా విద్యార్థినీలందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విషజ్వరాలు తీవ్రంగా ఉన్న 8మంది విద్యార్థినులను ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ పాఠశాలలో నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది విషజ్వరాలు సోకినట్లు తెలిపారు.