ఆ కవలలు సెంచరీ కొట్టేశారు..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన కవల సోదరులు సెంచరీ కొట్టేశారు. ఈ కవలలు క్రికెటర్లు అని భావించారంటే మీరు తప్పులో కాలేసినట్లే. సాధారణంగా అన్నదమ్ముళ్లు కొన్నేళ్ల వరకు కలిసి ఉండటం, ఆ తర్వాత ఆస్తితగాదాల వంటి విషయాలతో వేరు పడి ఉండటం చూస్తుంటాం. అయితే అమెరికా కొలరెడోకు చెందిన ఈ ఏకరూప కవలలు అల్బర్ట్, ఎల్మర్ వందేళ్లు గడుస్తున్నప్పటికీ ఎంతో అప్యాయతతో ఉంటున్నారు. మార్చి 15న తమ 100వ జన్మదిన వేడుకలను ఘనంగా చేసుకున్నారు. దేవుడు తమకు చూపించిన దారిలో నడుస్తున్నామని, చిన్నప్పుడు గోల్ఫ్ కోర్టులో ఎక్కవ టైం గడిపేవారిమని చెప్పారు.
మిచిగాన్ లోని సాగినౌలో మార్చి15, 1916లో వీరు జన్మించారు. ఈ ఇద్దరిలో అల్బర్ట్ పెద్దవాడు. ఎల్మర్ కంటే 15 నిమిషాల ముందే ఈ ప్రపంచంలోకి వచ్చేశాడు. అల్బర్ట్ కొలరెడోలో నివాసం ఉంటుండగా, ఎల్మర్ అరిజొనాలో నివసిస్తున్నాడు. తమ 100వ బర్త్ డే సందర్భంగా ఈ అన్నదమ్ములు కలిసి సంబరాలు జరుపుకున్నారు. స్కూలుకు వెళ్లే రోజుల్లో ఒకరికి బదులు మరొకరం వెళ్లి టీచర్లను కంగారు పెట్టేవాళ్లమని కవలలు చెబుతున్నారు. డ్రైవింగ్ కూడా ఒకే కారుతో, ఒకే సమయంలో నేర్చుకున్నామంటూ తమ అనుభవాలను, చిన్ననాటి జ్ఞాపకాలు, తమ అల్లరిని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు.
అల్బర్ట్ కు సంతానం ముగ్గురు కాగా, 7 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉండగా.. 14 మంది ముని మనవడు, వారి వారసులు కూడా ఇద్దరు ఉన్నారు. ఎల్మర్ కు కూడా సంతానం ముగ్గురు ఉండగా, మనవడు-మనవరాళ్లు కలిపి ఆరుగురు, ముని మనవళ్లు నలుగురు ఉన్నట్లు వారు తమ వివరాలను చెప్పుకొచ్చారు.