వివాహిత ఆత్మహత్యాయత్నం
ధర్మవరం రూరల్ : మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన వివాహిత శ్యామలమ్మ శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల సమాచారం మేరకు.. తపాలాశాఖలో విధులు నిర్వహిస్తున్న జయరాజ్, శ్యామలమ్మలు దంపతులు. వీరికి నలుగురు కూతుర్లు. కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని స్థానికులు అంటున్నారు. శనివారం కూడా భార్యభర్తల మధ్య గొడవలు జరిగినట్లు స్థానికులు అంటున్నారు.
ఇంట్లో ఆమె ఆర్తనాదాలు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. సంఘటన జరిగిన సమయంలో భర్త పరారీలో ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్షణికావేశంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా? లేక భర్తే కిరోసిన్ పోసి నిప్పంటించాడా? అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.