నాటి సీఎం బాబు కాదా?
ఆయన ప్రస్తావన చెయ్యరెందుకు?
ఎమ్మార్లో ఎలాంటి తప్పూ జరగలేదు
అందుకే నేను న్యాయపోరాటం చేస్తున్నా
‘ఈనాడు’ రాతలపై మండిపడ్డ - కోనేరు ప్రసాద్
ఎమ్మార్ వ్యవహారానికి సంబంధించి కొద్దిరోజులుగా కొన్ని పత్రికల్లో వ్యతిరేక వా ర్తలు వస్తుండటం, ప్రత్యర్థులు సైతం ఈ వ్యవహారంపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాని సారాంశం...
‘‘ఎమ్మార్ వ్యవహారంలో ఎలాంటి తప్పూ జరగలేదని నేను మొదట్నుంచీ చెబుతున్నా. న్యాయస్థానంలోనూ అదే చెప్పా. న్యాయపోరా టం కూడా చేస్తున్నా. సీబీఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి చార్జిషీటు కూడా వేసింది. దాన్ని పట్టుకుని కొన్ని పత్రికలు తీర్పులిచ్చేస్తూ రాతలు రాయటం దారుణం.. బాధాకరం. సీబీఐ వేసింది అభియోగపత్రమే తప్ప అదేమీ తుది తీర్పు కాదు. దాని దర్యాప్తు నివేదికను అది కోర్టుకిచ్చిం ది అంతే!! సీబీఐ ఆ చార్జిషీట్లో మొత్తం రూ. 96 కోట్ల మేర ఏపీఐఐసీకి నష్టం జరిగిందని చెప్పింది. కానీ కొన్ని పత్రికల్లో అది రూ. 167 కోట్లుగా రాస్తున్నారు. నా ప్రత్యర్థులైతే ఏకంగా రూ. 5వేల కోట్లంటున్నారు. ఇదంతా విజయవాడ ఓటర్లను ప్రభావితం చేసి, ప్రజా జీవితంలో ఉన్న నన్ను దెబ్బతీయడానికేనన్నది ఎవరికీ తెలి యంది కాదు. ఓటర్లను ప్రభావితం చేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలపై నేను ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నా. సీబీఐ చార్జిషీటు ప్రకారం చూసినా ఈ వ్యవహారం 2002లో జరిగిందని పేర్కొంది.
ఆ రకంగా చూసినా అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఉండాలి కదా? ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిన దగ్గర్నుంచి, భూములు కేటాయించడం వరకూ అంతా జరిగింది ఆయన హయాంలోనే. కేసు కోర్టులో ఉంది కనుక ఈ విషయంలో ఇప్పుడు ఇంతకంటే ఏమీ చెప్పలేను. ఎవరెన్ని ఆరోపణలు చేసినా నేను చెప్పేదొక్కటే. విజయవాడతో మా కుటుంబానికి 70 ఏళ్ల అనుబంధం ఉంది. స్థానిక ప్రజలకు నేనేంటో తెలుసు. వారిచ్చే తీర్పు ముందు... ఈ ఆరోపణలు ఎందుకూ పనికిరావనేది నా ప్రగాఢ విశ్వాసం.’’