'ఈ మెయిల్స్'లో హిల్లరీకి ఊరట.. ట్రంప్‌పై నిప్పులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష స్థానంకోసం పోటీపడుతోన్న హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ మెయిల్స్ వివాదంలో క్లీన్ చిట్ లభించడంతో డెమోక్రాటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్.. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతోన్న ట్రంప్ పై విమర్శల జడిని ఉధృతం చేశారు. ఒబామా ప్రభుత్వంలో విదేశాంగ కార్యదర్శిగా ఉన్నప్పుడు అధికార విధులకు వ్యక్తిగత ఈ-మెయిల్స్ వినియోగించినట్లు వెలుగులోకి రావడంతో హిల్లరీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇరాక్, అఫ్ఘానిస్థాన్ లలో అమెరికా సాగించిన యుద్ధానికి సంబంధించి పలువురు ఉన్నతాధికారులతో క్లింటన్ మెయిల్స్ ద్వారా సమాచారం పంచుకున్నారు. అయితే పారదర్శకంగా సాగాల్సిన ప్రభుత్వ వ్యవహారాన్ని ఆమె వ్యక్తిగతంగా మార్చేశారని, తద్వారా అమెరికన్లను మోసం చేశారని ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ ఆరోపించింది. దీంతో మొత్తం వ్యవహారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) దర్యాప్తు చేపట్టింది.
దాదాపు 30 వేల మెయిల్స్ లో చాలావాటిని బహిర్గతం చేసిన ఎఫ్ బీఐ.. కొన్నింటిని మాత్రం దేశ భద్రత దృష్ట్యా 'టాప్ సీక్రెట్' మెయిల్స్ గా పేర్కొంది. ఏడాది పాటు సాగిన దర్యాప్తులో హిల్లరీ ఎలాంటి నేరానికిగానీ, పొరపాటుకుగానీ పాల్పడలేదని తేలింది. ఈ మేరకు ఎఫ్ బీఐ సమర్పించిన నివేదికను యూఎస్ అటార్నీ జనరల్ లోరెట్టా లించ్ ఆమోదించారు. హిల్లరీపై ఎలాంటి కేసు నమోదు చేయబోయేది లేదని, దర్యాప్తును ఇంతటితో ముగిస్తున్నట్లు లోరెట్టా బుధవారం మీడియాకు చెప్పారు. ఈ మెయిల్స్ కేసు నుంచి విముక్తి పొందిన హిల్లరీ.. రిపబ్లికన్ పార్టీపై మరీ ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతోన్న డోనాల్డ్ ట్రంప్ పై నిప్పులు చెరిగారు.
బుధవారం అట్లాంటిక్ సిటీ(న్యూజెర్సీ)లో జరిగిన ప్రచార కార్యక్రమంలో హిల్లరీ.. అట్లాంటికి సిటీలో ట్రంప్ కంపెనీలకు సంబంధించిన అక్రమాలను వరుసపెట్టారు. ట్రంప్ యజమానిగా ఉన్న సంస్థల్లో అక్రమాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయని, పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని ఎగవేసే ప్రయత్నం చేశారని, కోర్టులు ఆయన కంపెనీలను దివాలకోరుగా ప్రకటించాయని హిల్లరీ గుర్తుచేశారు. అమెరికా చట్టాలపై ఏమాత్రం గౌరవంలేని ట్రంప్ కు అధ్యక్షుడు అయ్యే అర్హత లేదని అన్నారు. హిల్లరీ ఆరోపణలకు బదులిస్తూ ట్రంప్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ ఎఫ్ బీఐకీ అబద్ధాలు చెప్పి ఈ మెయిల్స్ కేసు నుంచి తప్పించుకున్నారని, ఆమె కచ్చితంగా తప్పుచేసిందని, అయితే మున్ముందు కాలంలో నిజాలు బయటపడాతయని ట్రంప్ ట్వీట్ చేశారు. అట్లాంటిక్ సిటీలో వ్యాపారాలు నిర్వహించి చాలా డబ్బు సంపాదించానని, ఆ సిటీని వదిలిన ఏడేళ్లయిందని, దురదృష్టవశాత్తు ఎన్నికల సమయంలోనే కంపెనీల దివాలా వ్యవహారంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.