ఆత్మహత్య అంటే! ఆపగలిగిన మరణం!!
‘పుట్టిన వాడు గిట్టక తప్పదు...’
ఈ నానుడిలో మహోన్నతమైన తత్వచింతన ఉంది.
ఇది ప్రకృతి సహజం కూడా.
కానీ... గిట్టడం అనేది సహజంగా లేకపోతే...
అసహజ మరణాన్ని స్వీకరించడానికి మనిషి సిద్ధమవుతుంటే...
అవాంఛనీయమైన నిర్ణయానికి విరుగుడేది ?
జీవనయానంలో ఎదురైన అడ్డంకిని అధిగమించాలి.
ఈ ప్రయాణంలో ఎప్పుడూ దారి మూసుకుపోదు అని నమ్మాలి.
దారి మళ్లించి మరో దారిలో ప్రయాణాన్ని కొనసాగించాలి.
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ గురుదత్. నటుడు, దర్శకుడు, నిర్మాతగా వెలిగిన వాడు. అలాంటి వ్యక్తి నలభై ఏళ్లు నిండకనే 1964లో మరణించాడు. నిద్రమాత్రలు కలిసిన మద్యం సేవించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతడి కుటుంబసభ్యులు మాత్రం... నిద్రమాత్రలను మోతాదుకు మించి పొరపాటుగా తీసుకోవడంతో ప్రాణం పోయిందనుకున్నారు. కానీ గురుదత్ మరణించడానికి ముందురోజు రాత్రి ఆయన్ను కలిసిన సినీ నిర్మాత అబ్రార్ ఆల్వి మాత్రం అది ఆత్మహత్య అయి ఉండవచ్చన్నాడు. ముందురోజు గురుదత్ నిర్లిప్తంగా జీవితేచ్ఛ నశించిన మనిషిలా కనిపించాడని చెప్పాడు ఆల్వి.
అలాంటిదే మరో మరణం ఫ్యాషన్ మోడల్ వివేకా బబాజీది. వాణిజ్య ప్రకటనల్లో నటించిన వివేక 2010, జూన్ 25వ తేదీన ముంబయిలో తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి వారు మరణించిన సమయంలో కానీ, రెండు రోజుల ముందు కానీ ఆత్మీయమైన పలకరింపు ఉంటే, వారి ఆలోచనలను గాడిలో పెట్టగలిగి ఉంటే ఆ ప్రాణాలు పోయేవి కాదు.
ఆత్మహత్య కాదు అది ఆర్తనాదం!
ఆత్మహత్య అంటే మరణాన్ని కోరుకోవడం కాదు. బతకాలనే కోరికకు- బతకలేని నిస్సహాయతకు మధ్య పెనుగులాట. ‘నన్ను రక్షించండి’ అని వేడుకునే ఆర్తనాదం. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్లు నిర్వేదంగానో, నిర్లిప్తంగానో తమ భావాలను తప్పనిసరిగా వ్యక్తం చేస్తారు. ‘బతకాలని లేదు, చచ్చిపోతే బావుణ్ను, బతికి ప్రయోజనం ఏముంది’ వంటి జీవితేచ్ఛ నశించిన మాటలు వినిపిస్తాయి. భావోద్వేగాలు క్షణాల్లో మారిపోతుంటాయి.
దారి చూపించాలి!
సాధారణంగా ఆత్మహత్యకు దారి తీసే కారణాలు వయసుల వారీగా మారిపోతుంటాయి. మగవారిలో సాంఘిక, ఆర్థిక కారణాలు ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంటే ఆడవారిలో భావోద్వేగాలు కారణమవుతున్నాయి. ఎవరిలోనైనా తేడాను గమనించిన వెంటనే వారి మనసును మళ్లించాలి. వారితో జీవితేచ్ఛ కలిగించే విషయాన్ని చర్చించాలి. ఎంతటి కష్టంలోనైనా జీవించడానికి ఒకదారి ఉంటుంది. ఆ దారిని వారికి చూపించగలగాలి.
ఆత్మహత్యలను నివారించవచ్చు!
డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి మానసిక సాంత్వన కలిగించాలి. ఎమోషనల్ సపోర్టు ఒక ప్రాణాన్ని మాత్రమే కాదు. ఆ వ్యక్తి చుట్టూ అల్లుకున్న అనేక మంది జీవితాలను నిలబెడుతుంది. డిప్రెషన్లో ఉన్న వారిని పలకరించి వారు చెప్పేదంతా వినాలి. ఆ తర్వాత మాత్రమే వారికి ఏ విధంగా నచ్చచెప్పాలనే అవగాహన కలుగుతుంది. వారి సమస్యకు పరిష్కారం కూడా వారి మాటల్లోనే వ్యక్తమవుతుంటుంది. జాగ్రత్తగా పరిశీలించి వారికి ధైర్యాన్ని చెప్పడమే ఇందుకు సరైన ఫార్ములా.