బాయ్స్ కన్నా ముందే పెద్దరికం
అబ్బాయిలకన్నా ముందు అమ్మాయిలే మానసికంగా పరిణతి చెందుతారన్న విషయం మరోమారు నిర్థారణ అయింది. పదకొండేళ్లలోపు బాలికల్లోని మెదడు అబ్బాయిలతో పోల్చి చూస్తే రెండుమూడేళ్లు ముందుగా పరిపక్వం చెందుతుందని పిట్స్బర్గ్ యూనివర్శిటీ (అమెరికా) పరిశోధకులు కనుగొన్నారు.
శిశువయస్సు నుండి కౌమారం వరకు బాలబాలికలను ఎంపిక చేసుకుని వారి మెదడులో సంభవిస్తున్న మార్పులను ఎం.ఆర్.ఐ. స్కానింగ్ ద్వారా సునిశితంగా పరిశీలించి వారు ఈ నిర్థారణకు వచ్చారు. ప్రారంభంలో బాలుర మస్తిష్కం బాలికలలో కన్నా వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ తర్వాత్తర్వాత నెమ్మదిస్తుందట. అలా నెమ్మదించే వయసులో ఇక్కడ బాలికల మస్తిష్కం వేగం పుంజుకుంటుందట. కనుక ఈ పరుగుపందెంలో బాలికలదే పైచేయి అని పరిశోధకులు అంటున్నారు.