employees attendence
-
విధులకు హాజరవ్వని వైద్య సిబ్బందికి నోటీసులు
సాక్షి, అమరావతి: ఉద్యోగుల హాజరుపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వైద్యులు, వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడటానికి వీల్లేదని పలుమార్లు సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ నెల నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాల చెల్లింపు విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వైద్య విధాన పరిషత్, డీఎంఈ, ప్రజారోగ్య విభాగాల్లో 2021 ఆస్పత్రులు, పరిపాలన కార్యాలయాలున్నాయి. వీటిలో 52,061 మంది ఉద్యోగులు రిజిస్టర్ అయ్యారు. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాల చెల్లింపు అమలులోకి తెచ్చినా ప్రజారోగ్య, డీఎంఈ విభాగాల్లో 25% మంది చొప్పున, వైద్య విధాన పరిషత్‌లో 16% మంది ఉద్యోగులు బయోమెట్రిక్ వేయడం లేదు. దీంతో సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరు అవుతున్న వారికి నోటీసులివ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో బయోమెట్రిక్ వేసే అవకాశం కల్పించాలన్నది అధికారులు యోచన. సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్న, ఆలస్యంగా వచ్చి, త్వరగా వెళుతున్న వారికి వచ్చే వారం నుంచి వార్నింగ్ నోటీసులిస్తామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ నివాస్ చెప్పారు. -
సచివాలయంలో పెరిగిన ఉద్యోగుల హాజరు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగుల హాజరు పెరిగింది. లాక్డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో సహాయ కార్యదర్శి, పైస్థాయి అధికారులు అంతా ప్రతిరోజు విధులకు హాజరు కావాలని, సహాయ కార్యదర్శి స్థాయి దిగువ ఉద్యోగులు ఆయా విభాగాల్లో 33 శాతం మంది హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని శాఖల్లోనూ 33 శాతం మంది హాజరవుతున్నారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి 5 మాస్కులు పంపిణీ చేసింది. అధికారులు ప్రతి రోజు అన్ని విభాగాలను శుభ్రం చేయిస్తున్నారు. ప్రతి సెక్షన్‌లోనూ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. సచివాలయం ఉద్యోగులకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే సచివాలయంలోకి సాధారణ విజిటర్లను అధికారులు అనుమతించడంలేదు. -
నేడు జిల్లావ్యాప్త సమ్మె
సాక్షి, సంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా సమ్మె నిర్వహించనున్నాయి. సమ్మెలో భాగంగా పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు బంద్ పాటించనున్నారు. సమ్మెలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, హెచ్‌ఎంస్‌తో పాటు పది కేంద్ర కార్మిక సంఘాలు, 12 ఫెడరేషన్లు పొల్గొననున్నాయి. టీఎన్జీఓ యూనియన్ ఉద్యోగుల పాటు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు సమ్మెలో పాలు పంచుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాల అమలు ఉపసంహరించుకోవాలని, అసంఘటిత రంగ కార్మికుల కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కార్మికుల వేతనాలు పెంచాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించవద్దని, ఎఫ్‌డీఐలను అమలు చేయవద్దని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు.. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, వెంటనే పీఆర్సీ వేయాలని, హెల్త్‌కార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమ్మెలో భాగంగా శుక్రవారం సంగారెడ్డిలో ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ అతిథి గృహంలో జరిగే సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ఇతర నాయకులు హాజరుకానున్నారు.