సాక్షి, సంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా సమ్మె నిర్వహించనున్నాయి. సమ్మెలో భాగంగా పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు బంద్ పాటించనున్నారు. సమ్మెలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, హెచ్‌ఎంస్‌తో పాటు పది కేంద్ర కార్మిక సంఘాలు, 12 ఫెడరేషన్‌లు పొల్గొననున్నాయి. టీఎన్జీఓ యూనియన్ ఉద్యోగుల పాటు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు సమ్మెలో పాలు పంచుకుంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాల అమలు ఉపసంహరించుకోవాలని, అసంఘటిత రంగ కార్మికుల కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కార్మికుల వేతనాలు పెంచాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించవద్దని, ఎఫ్‌డీఐలను అమలు చేయవద్దని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉద్యోగ సంఘాలు.. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, వెంటనే పీఆర్‌సీ వేయాలని, హెల్త్‌కార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమ్మెలో భాగంగా శుక్రవారం సంగారెడ్డిలో ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ అతిథి గృహంలో జరిగే సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ఇతర నాయకులు హాజరుకానున్నారు.