employees shortage
-
ఆయాలే టీచర్లు..
సాక్షి, వరంగల్ రూరల్ : ప్రతీ ఒక్కరికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అసలు సమస్య ఉన్నది ఇక్కడే. జిల్లాలో చాలా అంగన్వాడీల్లో టీచర్లు లేక ఆయాలే టీచర్లుగా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసే అంశం. పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పేవారు కరువయ్యారు. చిన్నారులకు ఐదు సంవత్సరాల వయస్సు వచ్చినా వారికి పాటలు, అక్షరాలు రావడం లేదు. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణ గురించి చెప్పేవారు కరువయ్యారు. బాలింతలు, గర్భిణులు అంగన్వాడీ కేంద్రాలకు కేవలం పప్పు, కోడి గుడ్లు తీసుకునేందుకే వస్తున్నారు. ఆయాలు లేని దగ్గర చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంలో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు సమయానికి పౌష్టికాహారాన్ని అందించడం లేదు. టీచర్లు లేకపోవడంతో చిన్నారులను అంగన్వాడీ స్కూల్‌కు పంపేందుకు వెనుకడగు వేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ పోస్టుల కోసం దరఖాస్తులు తీసుకొని తొమ్మిదినెలలవుతున్నాఇంతవరకూ నియమించకపోవడం శోచనీయం. జిల్లాలో 908 అంగన్వాడీ కేంద్రాలు.. అంగన్వాడీ పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరించి తొమ్మిది నెలలవుతున్నా ఎంపికలు ఇంకా పూర్తి కావడం లేదు. జిల్లాలో 908 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. . వాటిలో అంగన్ వాడీ టీచర్లు 28, ఆయాలు 79, మినీ అంగన్ వాడీ టీచర్లు 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత సంవత్సరం మార్చి 25 నుంచి ఏప్రిల్ 10వ తేధీ వరకు ఖాళీగా> ఉన్న అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులను ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించారు. దరఖాస్తులు స్వీకరించి తొమ్మిది నెలలవుతున్నా ఎంపికలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో అంగన్వాడీ టీచర్, ఆయాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు జిల్లా కలెక్టర్‌కు ఎంపికలు త్వరగా చేయాలని వినతి పత్రాలను అందిస్తూనే ఉన్నారు. 1967 దరఖాస్తులు పదో తరగతి అర్హతగా ప్రకటించడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. అంగన్ వాడీ టీచర్‌కు నెలకు రూ.10,500, ఆయాలకు రూ.6,500 లుగా వేతనాలు ఉండడంతో దరఖాస్తుదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. జిల్లాలో 130 పోస్టులకుగాను మొత్తం 1967 మంది దరఖాస్తులు చేసుకున్నారు. నర్సంపేట ప్రాజెక్ట్‌లో 10 టీచర్ పోస్టులకు 323 దరఖాస్తులు, 29 ఆయా పోస్టులకు 326 దరఖాస్తులు, 6 మినీ అంగన్వాడీ టీచర్లకు 94 దరఖాస్తులు వచ్చాయి. పరకాల ప్రాజెక్ట్ పరిధిలో మూడు అంగన్వాడీ టీచర్ పోస్టులకు గాను 290 మంది, 10 ఆయా పోస్టులకు 149 మంది, వర్ధన్నపేట ప్రాజెక్టు పరిధిలో 15 టీచర్ పోస్టులకు 383, 40 ఆయా పోస్టులకు 236, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులకు 196 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కొనసాగుతున్న పరిశీలన ఆన్లైన్ ద్వారా చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన సీడీపీఓల పరిధిలో ఇటీవల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ప్రస్తుతం ఫిజికల్‌గా వెరిఫికేషన్ కొనసాగుతోంది. సీడీపీఓలు చేసిన ప్రతి పరిశీలనను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆయా పోస్టులకు ఎంతమంది అర్హులు తేల్చనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు రిపోర్ట్ అందించనున్నారు. ఎన్నికల కోడ్లతో ఆలస్యం వరుసగా ఎన్నికల కోడ్ల నేపథ్యంలో ఆలస్యమవుతోంది. అంగన్వాడీ పోస్టుల ఎంపిక ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తాం. కలెక్టర్ నేతృత్వంలో త్రీమన్ కమిటీ వేశారు. వారు పూర్తిగా అభ్యర్థుల అర్హతలను పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆమోదంతో జాబితాను ప్రకటిస్తాం. – సబిత, జిల్లా సంక్షేమ అధికారి -
ఒక్కడే!
నల్లగొండ : జిల్లా పరిపాలన విభాగాల్లో కీలకంగా వ్యవహరించే సమాచార, పౌరసంబంధాల శాఖ ఖాళీ అయ్యింది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను, ఇతర కార్యక్రమాలను ప్రచార సాధనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన శాఖలో అధికారులు కరువయ్యారు. అటెండర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు కీలకమైన స్థానాల్లో అధికారులు లేకపోవడంతో సేవలు స్తంభించిపోయాయి. నిన్నా మొన్నటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అధికారి బదిలీ కావడంతో శాఖాపరంగా చేయాల్సిన వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. శాఖలో మొత్తం 14 పోస్టులకుగాను ఐదు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా కార్యాలయ బాగోగులను పర్యవేక్షించే అసిస్టెంట్ డైరక్టర్, డివిజనల్ పీఆర్వో, అసిస్టెంట్ పీఆర్వోతో పాటు, పబ్లిసిటీ అసిస్టెంట్లు రెండు, అటెండరు పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. కొంత కాలంగా డివిజనల్ పీఆర్వో, అసిస్టెంట్ పీఆర్వో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ పనిభారాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ మోయాల్సి వచ్చింది. అధికారిక సమావేశాలు, మంత్రుల పర్యటనలు చూసుకోవాల్సిన ఈ రెండు పోస్టులు లేకపోవడంతో సమావేశాలకు అసిస్టెంట్ డైరెక్టర్ హాజరయ్యారు. దీంతో కార్యాలయంలో పనిభారం పెరిగి ప్రచార కార్యక్రమాల నిర్వహణ ఆలస్యమయ్యేది. జిల్లా కలెక్టరేట్లో జరిగే సమావేశాలకు, బయట మంత్రులు, ప్రజాప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలకు ఏడీ వెళ్లాల్సి రావడంతో కార్యాలయంలో ఇతర వ్యవహారాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రాత్రిపొద్దుపోయే వరకు పత్రిక ప్రకటనలు పంపాల్సి వస్తుండటంతో అన్ని వైపుల నుంచి పౌరసంబంధాలశాఖపైన ఒత్తిళ్తు అధికంగా ఉండేవి. స్తంభించిన సేవలు... అసిస్టెంట్ డైరెక్టర్ ఈ నెల 7న బదిలీ కావడంతో ఉన్న ఒక్క పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో ఖమ్మం జిల్లా నుంచి రావాల్సిన అధికారి రాకపోవడంతో కార్యాలయంలో సేవలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ అన్నీ తానై వ్యవహరిస్తుండటంతో ఇతర పనులకు మరింత ఆటంకం ఏర్పడింది. అధికారుల సమావేశాలకు, ప్రజాప్రతినిధుల పర్యటనలకు సైతం సీనియర్ అసిస్టెంట్ వెళ్లాల్సి వస్తోంది. అసిస్టెంట్ డైరక్టర్ లేకపోవడంతో ఉద్యోగుల వేతనాల బిల్లులు ఆగిపోయాయి. మార్చి నెల జీతాల బిల్లులు 25వ తేదీ లోగా ట్రెజరీగా పంపాల్సి ఉంది. ఏడీ స్థాయి అధికారి లేకపోవడంతో వచ్చే నెల జీతాలపైన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 25వ తేదీ తర్వాత పంపిన బిల్లులను ట్రెజరీశాఖ అనుమతించదు. మళ్లీ వచ్చే నెల 3 తర్వాత పంపాల్సిందే. ఉద్యోగుల ఇబ్బందులు ఇలా ఉంటే ...మరో వైపు జర్నలిస్టు బస్‌పాస్‌ల రెన్యువల్ కూడా పెండింగ్‌లో పడింది. ఆన్లైన్ బస్‌పాస్ విధానం అమల్లోకి రావడంతో జర్నలిస్టులు ఆన్లైన్లో పంపిన దరఖాస్తులను అసిస్టెంట్ డైరక్టర్ ఆమోదించాల్సి ఉంటుంది. ఏడీ పోస్టు ఖాళీగా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంచారు. -
ప్రభుత్వ శాఖల్లో వెక్కిరిస్తున్న ఉద్యోగుల కొరత
-
ప్రభుత్వ శాఖల్లో వెక్కిరిస్తున్న ఉద్యోగుల కొరత
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల సంక్షేమమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ఉద్ఘాటిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఊదరగొడుతున్నారు. మరోవైపు సంక్షేమ శాఖల్లో వేలాది ఖాళీలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అన్ని సంక్షేమ శాఖల్లో దాదాపు సగం పోస్టులు ఖాళీగానే ఉండడం గమనార్హం. ఉన్న అరకొర సిబ్బందితో బడుగుల బతుకులను ఎలా బాగుచేస్తారో ఇక ప్రభుత్వమే చెప్పాలి. ఉన్న ఉద్యోగుల్లోనూ కోత సంక్షేమ శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. పైగా రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఖాళీల భర్తీపై నోరెత్తడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం సంక్షేమ విభాగాల్లో పని భారం విపరీతంగా పెరిగిపోయింది. సగం పోస్టులు ఖాళీగా ఉండడంతో సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్కార్ నిర్వాకం వల్ల అంతిమంగా నష్టపోతోంది మాత్రం బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలే. ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, లేదంటే పథకాల అమలు కుంటుపడక తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. ఖాళీలే ఖాళీలు గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, గృహ నిర్మాణాల శాఖల్లో మంజూరైన పోస్టుల సంఖ్య 41,606 ఉండగా, ఇందులో 19,324 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన పలు విభాగాల్లో 12,851 పోస్టులకు గాను, ఏకంగా 5,308 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిరిజన రీసెర్చ్ మిషన్‌లో మంజూరైన పోస్టులు 70 ఉండగా, ఇవన్నీ ఖాళీగా ఉండడం గమనార్హం. అలాగే గిరిజన గురుకులం విభాగంలో 3,796 పోస్టులకు గాను, 2,384 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో 13 పోస్టులుండగా, అందులో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీసీ ఫెడరేషన్స్‌లో 30 పోస్టులుండగా, అందులో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో 983 పోస్టులున్నప్పటికీ, ఇందులో 712 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. మహిళా సంక్షేమ శాఖలోని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ విభాగంలో 19 పోస్టులుండగా, ఈ పోస్టుల్లో ఒక్క అధికారి కూడా లేకపోవడం గమనార్హం. చిన్న పిల్లల సంరక్షణ విభాగంలో 371 పోస్టులుండగా, వీటిలో 190 పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బలహీన వర్గాల గృహ నిర్మాణ సంస్థలో రెగ్యులర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. అరకొర సిబ్బందితో అగచాట్లు సాంఘిక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో ఉద్యోగుల కొరత వల్ల పథకాల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. పథకాల అమలు తీరును పర్యవేక్షించే వారే లేకుండా పోయారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధికోసం చేసుకున్న దరఖాస్తులకు నెలలు గడిచినా మోక్షం లభించడం లేదు. అయ్యా.. మా దరఖాస్తును పరిశీలించండి అంటూ జనం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గిరిజన కార్పొరేషన్లో పోస్టులన్నీ ఖాళీగానే కనిపిస్తుండడంతో ఎవరికి మొర పెట్టుకోవాలో తెలియని దుర్గతి దాపురించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్లోనూ అదే పరిస్థితి. బీసీ కమిషన్‌లో 14 పోస్టులుండగా, అన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. వెనుకబడిన తరగతులను ముందంజలోకి తీసుకొస్తామని చెబుతున్న ప్రభుత్వానికి ఈ దుస్థితి కళ్లకు కనిపించకపోవడం విషాదకరం. మహిళా శిశు సంక్షేమం, అనాథ పిల్లల సంరక్షణ తదితర విభాగాలు అరకొర సిబ్బందితో సతమతమవుతున్నాయి. వివిధ సంక్షేమ శాఖల విభాగాల్లో మంజూరైన పోస్టులు, ఖాళీల సంఖ్య -
తెలంగాణ భవన్ లో ఉద్యోగుల కొరత
ఖాళీలు భర్తీ చేయండని సర్కారుకు రెసిడెంట్ కమిషనర్ లేఖ సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉద్యోగుల కొరత నెలకొంది. విభజన తరువాత భవన్లో సిబ్బందికి తీవ్ర కొరత ఏర్పడిందని రెసిడెంట్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతమున్న ఖాళీలను వెంటనే భర్తీ చేస్తూనే పది కొత్త పోస్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. స్పం దించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువమంది ఉద్యోగులు ఏపీ భవన్‌కు వెళ్లడంతో ఈ ఇబ్బంది తలెత్తింది. మొత్తం 49 కేడర్లలోని 67 పోస్టులకు కేవలం 35 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 32 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో పది పోస్టులను వీలైనంత తొందరగా భర్తీ చేయాలంటూ రెసిడెంట్ కమిషనర్ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ భవన్ అవసరాలకు, రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరే వీఐపీలు, వీవీఐపీలకు ప్రొటోకాల్ ఏర్పాట్ల పర్యవేక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించటం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని రెసిడెంట్ కమిషనర్ ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సాధారణ పరి పాలన విభాగం ప్రతిపాదనలో ఉన్న ఈ ఫైలు సీఎస్ ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక శాఖ కు చేరుతుంది. తదుపరి మంత్రిమండలిలో తీసుకునే నిర్ణయం మేరకు పోస్టుల భర్తీ, కొత్త పోస్టుల మంజూరు ప్రక్రియ ఆధారపడి ఉం టుంది. ఈ పోస్టులకు రాష్ట్రం నుంచి రెగ్యులర్ ఉద్యోగులను పంపించాలా.. లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరపాలా..? అనేది నిర్ణయించాల్సి ఉంది.