తెలంగాణ భవన్ లో ఉద్యోగుల కొరత
ఖాళీలు భర్తీ చేయండని సర్కారుకు రెసిడెంట్ కమిషనర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉద్యోగుల కొరత నెలకొంది. విభజన తరువాత భవన్‌లో సిబ్బందికి తీవ్ర కొరత ఏర్పడిందని రెసిడెంట్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతమున్న ఖాళీలను వెంటనే భర్తీ చేస్తూనే పది కొత్త పోస్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. స్పం దించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువమంది ఉద్యోగులు ఏపీ భవన్‌కు వెళ్లడంతో ఈ ఇబ్బంది తలెత్తింది. మొత్తం 49 కేడర్లలోని 67 పోస్టులకు కేవలం 35 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
మిగిలిన 32 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో పది పోస్టులను వీలైనంత తొందరగా భర్తీ చేయాలంటూ రెసిడెంట్ కమిషనర్ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ భవన్ అవసరాలకు, రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరే వీఐపీలు, వీవీఐపీలకు ప్రొటోకాల్ ఏర్పాట్ల పర్యవేక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించటం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని రెసిడెంట్ కమిషనర్ ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సాధారణ పరి పాలన విభాగం ప్రతిపాదనలో ఉన్న ఈ ఫైలు సీఎస్ ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక శాఖ కు చేరుతుంది. తదుపరి మంత్రిమండలిలో తీసుకునే నిర్ణయం మేరకు పోస్టుల భర్తీ, కొత్త పోస్టుల మంజూరు ప్రక్రియ ఆధారపడి ఉం టుంది. ఈ పోస్టులకు రాష్ట్రం నుంచి రెగ్యులర్ ఉద్యోగులను పంపించాలా.. లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరపాలా..? అనేది నిర్ణయించాల్సి ఉంది.