సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల సంక్షేమమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ఉద్ఘాటిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఊదరగొడుతున్నారు. మరోవైపు సంక్షేమ శాఖల్లో వేలాది ఖాళీలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అన్ని సంక్షేమ శాఖల్లో దాదాపు సగం పోస్టులు ఖాళీగానే ఉండడం గమనార్హం. ఉన్న అరకొర సిబ్బందితో బడుగుల బతుకులను ఎలా బాగుచేస్తారో ఇక ప్రభుత్వమే చెప్పాలి.
ఉన్న ఉద్యోగుల్లోనూ కోత
సంక్షేమ శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. పైగా రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఖాళీల భర్తీపై నోరెత్తడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం సంక్షేమ విభాగాల్లో పని భారం విపరీతంగా పెరిగిపోయింది. సగం పోస్టులు ఖాళీగా ఉండడంతో సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్కార్ నిర్వాకం వల్ల అంతిమంగా నష్టపోతోంది మాత్రం బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలే. ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, లేదంటే పథకాల అమలు కుంటుపడక తప్పదని అధికారులు పేర్కొంటున్నారు.
ఖాళీలే ఖాళీలు
గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, గృహ నిర్మాణాల శాఖల్లో మంజూరైన పోస్టుల సంఖ్య 41,606 ఉండగా, ఇందులో 19,324 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన పలు విభాగాల్లో 12,851 పోస్టులకు గాను, ఏకంగా 5,308 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిరిజన రీసెర్చ్ మిషన్‌లో మంజూరైన పోస్టులు 70 ఉండగా, ఇవన్నీ ఖాళీగా ఉండడం గమనార్హం. అలాగే గిరిజన గురుకులం విభాగంలో 3,796 పోస్టులకు గాను, 2,384 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో 13 పోస్టులుండగా, అందులో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీసీ ఫెడరేషన్స్‌లో 30 పోస్టులుండగా, అందులో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో 983 పోస్టులున్నప్పటికీ, ఇందులో 712 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. మహిళా సంక్షేమ శాఖలోని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ విభాగంలో 19 పోస్టులుండగా, ఈ పోస్టుల్లో ఒక్క అధికారి కూడా లేకపోవడం గమనార్హం. చిన్న పిల్లల సంరక్షణ విభాగంలో 371 పోస్టులుండగా, వీటిలో 190 పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బలహీన వర్గాల గృహ నిర్మాణ సంస్థలో రెగ్యులర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి.
అరకొర సిబ్బందితో అగచాట్లు
సాంఘిక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో ఉద్యోగుల కొరత వల్ల పథకాల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. పథకాల అమలు తీరును పర్యవేక్షించే వారే లేకుండా పోయారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధికోసం చేసుకున్న దరఖాస్తులకు నెలలు గడిచినా మోక్షం లభించడం లేదు. అయ్యా.. మా దరఖాస్తును పరిశీలించండి అంటూ జనం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గిరిజన కార్పొరేషన్‌లో పోస్టులన్నీ ఖాళీగానే కనిపిస్తుండడంతో ఎవరికి మొర పెట్టుకోవాలో తెలియని దుర్గతి దాపురించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లోనూ అదే పరిస్థితి. బీసీ కమిషన్‌లో 14 పోస్టులుండగా, అన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. వెనుకబడిన తరగతులను ముందంజలోకి తీసుకొస్తామని చెబుతున్న ప్రభుత్వానికి ఈ దుస్థితి కళ్లకు కనిపించకపోవడం విషాదకరం. మహిళా శిశు సంక్షేమం, అనాథ పిల్లల సంరక్షణ తదితర విభాగాలు అరకొర సిబ్బందితో సతమతమవుతున్నాయి.
వివిధ సంక్షేమ శాఖల విభాగాల్లో మంజూరైన పోస్టులు, ఖాళీల సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment