నల్లగొండ : జిల్లా పరిపాలన విభాగాల్లో కీలకంగా వ్యవహరించే సమాచార, పౌరసంబంధాల శాఖ ఖాళీ అయ్యింది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను, ఇతర కార్యక్రమాలను ప్రచార సాధనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన శాఖలో అధికారులు కరువయ్యారు. అటెండర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు కీలకమైన స్థానాల్లో అధికారులు లేకపోవడంతో సేవలు స్తంభించిపోయాయి. నిన్నా మొన్నటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అధికారి బదిలీ కావడంతో శాఖాపరంగా చేయాల్సిన వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. శాఖలో మొత్తం 14 పోస్టులకుగాను ఐదు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
వీటిల్లో ప్రధానంగా కార్యాలయ బాగోగులను పర్యవేక్షించే అసిస్టెంట్ డైరక్టర్, డివిజనల్ పీఆర్వో, అసిస్టెంట్ పీఆర్వోతో పాటు, పబ్లిసిటీ అసిస్టెంట్లు రెండు, అటెండరు పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. కొంత కాలంగా డివిజనల్ పీఆర్వో, అసిస్టెంట్ పీఆర్వో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ పనిభారాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ మోయాల్సి వచ్చింది. అధికారిక సమావేశాలు, మంత్రుల పర్యటనలు చూసుకోవాల్సిన ఈ రెండు పోస్టులు లేకపోవడంతో సమావేశాలకు అసిస్టెంట్ డైరెక్టర్ హాజరయ్యారు. దీంతో కార్యాలయంలో పనిభారం పెరిగి ప్రచార కార్యక్రమాల నిర్వహణ ఆలస్యమయ్యేది. జిల్లా కలెక్టరేట్‌లో జరిగే సమావేశాలకు, బయట మంత్రులు, ప్రజాప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలకు ఏడీ వెళ్లాల్సి రావడంతో కార్యాలయంలో ఇతర వ్యవహారాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రాత్రిపొద్దుపోయే వరకు పత్రిక ప్రకటనలు పంపాల్సి వస్తుండటంతో అన్ని వైపుల నుంచి పౌరసంబంధాలశాఖపైన ఒత్తిళ్తు అధికంగా ఉండేవి.
స్తంభించిన సేవలు...
అసిస్టెంట్ డైరెక్టర్ ఈ నెల 7న బదిలీ కావడంతో ఉన్న ఒక్క పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో ఖమ్మం జిల్లా నుంచి రావాల్సిన అధికారి రాకపోవడంతో కార్యాలయంలో సేవలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ అన్నీ తానై వ్యవహరిస్తుండటంతో ఇతర పనులకు మరింత ఆటంకం ఏర్పడింది. అధికారుల సమావేశాలకు, ప్రజాప్రతినిధుల పర్యటనలకు సైతం సీనియర్ అసిస్టెంట్ వెళ్లాల్సి వస్తోంది. అసిస్టెంట్ డైరక్టర్ లేకపోవడంతో ఉద్యోగుల వేతనాల బిల్లులు ఆగిపోయాయి.
మార్చి నెల జీతాల బిల్లులు 25వ తేదీ లోగా ట్రెజరీగా పంపాల్సి ఉంది. ఏడీ స్థాయి అధికారి లేకపోవడంతో వచ్చే నెల జీతాలపైన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 25వ తేదీ తర్వాత పంపిన బిల్లులను ట్రెజరీశాఖ అనుమతించదు. మళ్లీ వచ్చే నెల 3 తర్వాత పంపాల్సిందే. ఉద్యోగుల ఇబ్బందులు ఇలా ఉంటే ...మరో వైపు జర్నలిస్టు బస్‌పాస్‌ల రెన్యువల్ కూడా పెండింగ్‌లో పడింది. ఆన్‌లైన్ బస్‌పాస్ విధానం అమల్లోకి రావడంతో జర్నలిస్టులు ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను అసిస్టెంట్ డైరక్టర్ ఆమోదించాల్సి ఉంటుంది. ఏడీ పోస్టు ఖాళీగా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment