information and public relations
-
ఖాకీదుస్తులు త్యాగానికి ప్రతీక
‘ప్రియమైన పోలీసు ధీశాలులారా... మహమ్మారైనా, ఆపత్కాలమైనా, శాంతి సమయమైనా మీరే మా ధైర్యం’ అని పేర్కొంటూ తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో కట్టిన బ్యానర్... సాధారణ ప్రజలకు పోలీ సుల మీద కలిగిన నమ్మకానికి నిదర్శనం అనవచ్చు. తెలంగాణ రాష్ట్రా విర్భావ అనంతరం పీపుల్స్ ఫ్రెండ్లీగా, పోలీసులు అంటే ప్రజల సేవ కులు, ప్రజలే బాసులు అనే విశ్వాసం కలిగే విధంగా తెలంగాణా పోలీస్ శాఖ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే, ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానం అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీటీవీల ఏర్పాటు లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 8.25 లక్షల ఏర్పాటు పూర్తయింది. డయల్ 100, ప్రత్యేకంగా మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, స్వతంత్ర భారత చరిత్రలో మరెక్కడా లేని విధంగా దాదాపు 80 వేల మందికి పైగా పోలీసు అధికారుల నియామకం, కొత్త పోలీసు కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు, చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే కమాండ్ కంట్రోల్ నిర్మాణం... ఇలా తెలంగాణ పోలీస్ శాఖ తన విధుల్లో ఎంతో ముందుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో 377 మంది పోలీసులు అమరులయ్యారు. తెలంగాణలో ఒక్క ప్రాణాపాయం జరగకపోవడం గమనార్హం. అయితే ఇప్పటివరకూ 326 మంది తెలంగాణ పోలీసులు మావోయిస్టు, ఎంఎల్ గ్రూపు నక్సలైట్ల చేతుల్లో అమరులయ్యారు. వీరిలో కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఉన్నారు. ఖాకీ దుస్తులు అంటేనే త్యాగాలకు ప్రతీక అనే విష యాన్ని పోలీసులు తమ విధుల ద్వారా చాటుతున్నారు. ప్రజల భద్రత, శాంతి పరిరక్షణ కోసం నిస్వార్థ సేవలందించిన ఈ అమర పోలీసులకు దేశ ప్రజలు అక్టోబర్ 21న నివాళులు అర్పిస్తున్నారు. – కన్నెగంటి వెంకటరమణ, జాయింట్ డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ -
ఒక్కడే!
నల్లగొండ : జిల్లా పరిపాలన విభాగాల్లో కీలకంగా వ్యవహరించే సమాచార, పౌరసంబంధాల శాఖ ఖాళీ అయ్యింది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను, ఇతర కార్యక్రమాలను ప్రచార సాధనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన శాఖలో అధికారులు కరువయ్యారు. అటెండర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు కీలకమైన స్థానాల్లో అధికారులు లేకపోవడంతో సేవలు స్తంభించిపోయాయి. నిన్నా మొన్నటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అధికారి బదిలీ కావడంతో శాఖాపరంగా చేయాల్సిన వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. శాఖలో మొత్తం 14 పోస్టులకుగాను ఐదు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా కార్యాలయ బాగోగులను పర్యవేక్షించే అసిస్టెంట్ డైరక్టర్, డివిజనల్ పీఆర్వో, అసిస్టెంట్ పీఆర్వోతో పాటు, పబ్లిసిటీ అసిస్టెంట్లు రెండు, అటెండరు పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. కొంత కాలంగా డివిజనల్ పీఆర్వో, అసిస్టెంట్ పీఆర్వో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ పనిభారాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ మోయాల్సి వచ్చింది. అధికారిక సమావేశాలు, మంత్రుల పర్యటనలు చూసుకోవాల్సిన ఈ రెండు పోస్టులు లేకపోవడంతో సమావేశాలకు అసిస్టెంట్ డైరెక్టర్ హాజరయ్యారు. దీంతో కార్యాలయంలో పనిభారం పెరిగి ప్రచార కార్యక్రమాల నిర్వహణ ఆలస్యమయ్యేది. జిల్లా కలెక్టరేట్లో జరిగే సమావేశాలకు, బయట మంత్రులు, ప్రజాప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలకు ఏడీ వెళ్లాల్సి రావడంతో కార్యాలయంలో ఇతర వ్యవహారాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రాత్రిపొద్దుపోయే వరకు పత్రిక ప్రకటనలు పంపాల్సి వస్తుండటంతో అన్ని వైపుల నుంచి పౌరసంబంధాలశాఖపైన ఒత్తిళ్తు అధికంగా ఉండేవి. స్తంభించిన సేవలు... అసిస్టెంట్ డైరెక్టర్ ఈ నెల 7న బదిలీ కావడంతో ఉన్న ఒక్క పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో ఖమ్మం జిల్లా నుంచి రావాల్సిన అధికారి రాకపోవడంతో కార్యాలయంలో సేవలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ అన్నీ తానై వ్యవహరిస్తుండటంతో ఇతర పనులకు మరింత ఆటంకం ఏర్పడింది. అధికారుల సమావేశాలకు, ప్రజాప్రతినిధుల పర్యటనలకు సైతం సీనియర్ అసిస్టెంట్ వెళ్లాల్సి వస్తోంది. అసిస్టెంట్ డైరక్టర్ లేకపోవడంతో ఉద్యోగుల వేతనాల బిల్లులు ఆగిపోయాయి. మార్చి నెల జీతాల బిల్లులు 25వ తేదీ లోగా ట్రెజరీగా పంపాల్సి ఉంది. ఏడీ స్థాయి అధికారి లేకపోవడంతో వచ్చే నెల జీతాలపైన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 25వ తేదీ తర్వాత పంపిన బిల్లులను ట్రెజరీశాఖ అనుమతించదు. మళ్లీ వచ్చే నెల 3 తర్వాత పంపాల్సిందే. ఉద్యోగుల ఇబ్బందులు ఇలా ఉంటే ...మరో వైపు జర్నలిస్టు బస్‌పాస్‌ల రెన్యువల్ కూడా పెండింగ్‌లో పడింది. ఆన్లైన్ బస్‌పాస్ విధానం అమల్లోకి రావడంతో జర్నలిస్టులు ఆన్లైన్లో పంపిన దరఖాస్తులను అసిస్టెంట్ డైరక్టర్ ఆమోదించాల్సి ఉంటుంది. ఏడీ పోస్టు ఖాళీగా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంచారు. -
సమాచార శాఖ కమిషనర్‌గా బీపీ ఆచార్య
హైదరాబాద్ సిటీ: సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌గా బీపీ ఆచార్య బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ప్రణాళిక, పర్యాటక శాఖల ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రదీప్ చంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వున్నారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి ప్రభుత్వం ఆయన్ను ఆర్థిక శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.