కమలనాథన్ మార్గదర్శకాలు మరింత జాప్యం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులను.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు పంపిణీకి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాల విడుదలకు మరింత జాప్యం జరగనుంది. ముసాయిదా మార్గదర్శకాల రూపకల్పనకు జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుతో సమావేశమయ్యారు. జాప్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ తన వద్ద పెండిం గ్లో లేదని..
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వద్ద ఉందని ఐవైఆర్ వివరించారు. రానున్న రెండేళ్ల కాలంలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు అప్షన్ ఇచ్చే అంశంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులు ఏకాభిప్రాయానికి వస్తేనే ముసాయిదా మార్గదర్శకాల వెల్లడికి మార్గం సుగమవుతుందని కమలనాథన్ ఏపీ సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. కమలనాథన్ బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మంత్రివర్గ సమావేశంలో బిజీగా ఉన్నందున కలవలేకపోయారు. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు గురువారం ఢిల్లీలో సమావేశానికి వెళుతున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాల విడుదల మరింత జాప్యం కానుంది.