emset leak
-
సచివాలయం కేంద్రంగా ఎంసెట్ లీకేజీ
పంజగుట్ట: సచివాలయం కేంద్రంగానే ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందని, ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిల్లలు ఉన్నట్లు సీఐడీ రిపోర్టులు వస్తున్నా ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి బర్తరఫ్ చేయాలని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి తప్పించిన సీఎం ప్రస్తుత మంత్రులు కడియం, లక్ష్మారెడ్డిలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నందునే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. మంత్రులు బాధ్యతారహితంగా ఆంధ్రాప్రాంతం వారిపై నిందలు మోపడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంసెట్ 2, 3 పేరుతో కాలయాపన చేయకుండా మేధావులతో చర్చించి విద్యార్థుల భవిష్యత్ పాడుకాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐడీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ వేదిక అనుబందంగా తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 5న ఓయూలో ఆవిర్భావ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. -
ప్రభుత్వ అసమర్థతతోనే ఎంసెట్ లీకేజీ
బీజేపీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీకి ప్రభుత్వ అసమర్థతే కారణమని బీజేపీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందించాలని డిమాండ్ చేశారు. -
లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి : భట్టివిక్రమార్క
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీలో పెద్దల ప్రమేయాన్ని తేల్చడానికి సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. పార్టీ నేతలతో కలసి గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్-2 లీకేజీలో చాలా మంది పెద్దల హస్తముందని అనుమానం వ్యక్తం చేశారు. లీకేజీలో ప్రమేయమున్న పెద్దలను బయటకు లాగాలని భట్టి డిమాండ్ చేశారు. నిషా మత్తులో కేసీఆర్ నిర్ణయాలు: పొన్నం సీఎం కేసీఆర్ నిషా మత్తులో రాత్రిపూట నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకున్న 15 నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టిందన్నారు. రెండున్నరేళ్లుగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వీసీల నియామకం చేపట్టడాన్ని హైకోర్టు మరోసారి తప్పుబట్టిందని, ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు.