అనుకరించటమే గొప్ప పొగడ్త!
ఏ పనినైనా అందంగా చేస్తారు కొంతమంది. ఎవరినైనా పొగడాలనుకుంటే ఆ విషయాన్ని నోటితో చెప్పనక్కరలేదు. ఎన్నో విధాలుగా ప్రకటించవచ్చు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెపితే అలాగా! అని అనిపిస్తుంది. అది చాలా పేలవమైన పద్ధతి. అది ఎవైరనా చెయ్యగలిగింది. దాని ప్రభావం అంతగా ఉండక పోవచ్చు. అది అతి మామూలు ఇష్టం.
మీరింతటి గొప్ప వారు, అంతటి గొప్పవారు. మీరంటే నాకెంతో ఇష్టం. మీరంటే నాకు చచ్చేంత అభిమానం. మీకోసం ప్రాణాలనైనా ఆర్పిస్తాను. ఇటువంటి మాటలను తరచుగా వింటూ ఉంటాం. అవి పెదిమల నుండి వచ్చినవని తెలిసి పోతూనే ఉంటుంది.
మీరు మాట్లాడుతూ ఉంటే తన్మయులమై పోతామండీ. మీ అభిరుచి చాలా గొప్పదండి! ఇలా పొగడే వారు కనపడుతూనే ఉంటారు. ఇవి నిజమైన పొగడ్తలేనా? ఇది తన ఇష్టాన్ని, గొప్పతనాన్ని ప్రకటించటం మాత్రమే.
నాకు లడ్డు అంటే ఇష్టం, నాకు మల్లెపూలు అంటే ఇష్టం, నాకు తెలుపంటే ఇష్టం అని చెప్పిన దానికి నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పిన దానికి పెద్ద తేడా లేదు. ఆ విధంగా చెప్పటం మనుషుల విషయంలో సరిపోదు.
పసిపిల్లలని అనునయించేప్పుడు అప్రయత్నంగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళలాగానే ముద్దుమాటలు మాట్లాడుతూ ఉంటారు. దానితో వాళ్ళు తమతో సమశ్రుతికి రావటం జరుగుతుంది. తనలాగా ప్రవర్తించే పిల్లలన్నా, మనవలు మనవరాళ్లన్నా తాతలకి, నాయనమ్మలకి ఇష్టం ఎక్కువ ఉండటం గమనించవచ్చు. దానికి కారణం వాళ్ళు తమని అనుకరిస్తూ ఉండటమే.
అతి సన్నిహితత్వం గాని, ఇష్టం గాని ఉంటేనే కదా అనుకరించేది. తనలాగా ప్రవర్తిస్తున్నారంటే తనంటే ఇష్టం ఉందని, లేదా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని అర్థం. కారణం ఇది అని సరిగా అర్థం కాకపోయినా అంతరాంతరాల్లో సహజాతంగా అందరికి తెలుస్తుంది.
ఒకప్పుడు జాతికి ఆదర్శప్రాయులు హీరోలు ఇటువంటి వారు ఉండేవారు. తరువాతి కాలంలో చలనచిత్ర నటులు తెర మీదనే కాక నిజజీవితంలో కూడా హీరోలయి పోయారు. వాళ్ళు ఎటువంటి వస్త్రాలు, నగలు ధరిస్తే అటువంటివే ధరించటం, కేశాలంకరణ కూడా అదే విధంగా చేసుకోవటం వాళ్ళు ఉపయోగించిన ఊతపదాలనే ఉపయోగించటం ... ఒకటేమిటి అన్ని విధాలా వాళ్ళ లాగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది, ముఖ్యంగా యువతరం. దీనికి కారణం ఆ వ్యక్తి అంటే ఉన్న అభిమానం. ఒక్క చెవికి కుండలం, మెడలో పెద్దపెద్ద పూసలు, పూలచొక్కాలు, పిలకలు, పోనీ టైల్స్‌తో తమలో ఆ ప్రతిభ లేకపోయినా ఆ వ్యక్తుల పట్ల ఉన్న ఇష్టాన్ని ప్రకటించే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. చీరలకి, గాజులకి, నగలకి ఆ చిత్రం పేరో, నటి పేరో పెట్టటం ఒక వ్యాపార రహస్యం.
చిన్నతనంలో బడికి వెళ్ళటం మొదలు పెట్టిన కొత్తల్లో, ఇల్లు దాటి బయటికి అడుగుపెట్టి, కొత్తలోకం చూడటం మొదలవుతుంది. టీచర్ ఆదర్శంగా కనపడుతుంది. ఆ టీచర్ లాగా మాట్లాడటం, నడవటం, ప్రవర్తించటం మొదలు పెడతారు. ఆ టీచర్ పట్ల ఉన్న ఇష్టం లేదా గౌరవం వాళ్ళని ఆ విధంగా అనుకరించేట్టు చేస్తోంది. ఆ వయసులో పిల్లలవి స్వచ్ఛమైన మనసులు కనుక ఆ విధంగా వెంటనే ప్రకటిస్తారు.
నెహ్రూ గారు కోటుకి గులాబీ పువ్వు పెట్టుకునే వారని ఆయన అభిమానులందరు ఆ రోజుల్లో కోటుకి గులాబీ పువ్వుని పెట్టుకునేవారు. భావకవిత్వాభిమానులందరూ కృష్ణశాస్త్రిగారి లాగా జులపాలు, లాల్చీ, బెంగాలీ పంచెకట్టుతో కనపడేవారు. చూడగానే చెప్పేయచ్చు వాళ్ళు భావకవులని. లాల్ బహదుర్ శాస్త్రి గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది సోమవారం రాత్రి భోజనం మానేశారు. అది ఆయన పట్ల ఉన్న అభిమానం లేక గౌరవం.
ఇంటికి రాగానే పుస్తకాల సంచీ పక్కన పెట్టి వాళ్ళ తాతగారు కూర్చునే కుర్చీలో కూర్చుని ఆయన చేతికర్రని చేత పుచ్చుకుని అందరినీ అదమాయిస్తూ, గదమాయించటం మొదలు పెట్టింది చిట్టి. అప్పటివరకు గట్టిగా మాట్లాడేది కూడా కాదు. బళ్ళో వేస్తే నోరు విప్పక పోతే ఎట్లా అని భయపడ్డారు కూడా. మొదట్లో అట్లాగే ఉండేది. కానీ రెండోక్లాసులోకి వచ్చాక విపరీతంగా మారింది. మాట్లాడటం కాదు, వాగటం ఎక్కువయింది. ప్రతి మాటకి ముందు వెనక అండర్ స్టాండ్ అనటం, తను మాట్లాడేప్పుడు ఇంకెవరైనా మాట్లాడుతుంటే సెలైన్స్ అని గట్టిగా అనటం అందరికీ వింతగా అనిపించింది.
ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవటానికి స్కూల్‌కి వెళ్లినప్పుడు సీతకి అంటే చిట్టితల్లికి అర్థమయ్యింది కారణం, మాట్లాడుతూ కళ్ళు చికిలించటం, ముక్కు ఎగపీల్చటం, మాటిమాటికి జుట్టు సరిచేసుకోవటం ... అన్నీ క్లాస్ టీచర్ లక్షణాలే. ఆవిడంటే తన కిష్టమని ఎన్నో మారులు చెప్పింది కూడా. అందుకే అప్రయత్నంగా అలా ఉండాలని ప్రయత్నం చేసింది. చిన్నతనంలో ప్రతివారికి అమ్మ, నాన్న ఆదర్శం. వాళ్ళు చేసే పనులన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. ఎప్పటికైనా వాళ్ళలాగా ఉండాలనుకుంటారు. అందుకని వాళ్ళని అనుకరిస్తారు.
పెద్దల చెప్పులు వేసుకోవటం, వాళ్ళ బట్టలు కట్టుకోవటం వాళ్ళ లాగా మాట్లాడటం, నటించటం అందులో భాగాలే. తాము ఏ విధంగా అవాలనుకుంటారో దానినే అనుకరిస్తూ ఉంటారు. అందుకనే పిల్లల ఆటలని గమనిస్తే వాళ్ళ అభిరుచులు, ఆదర్శాలు అర్థమవుతాయి.
కొంతమంది తోటివారిని చేర్చి నేను టీచర్, మీరు నేను చెప్పినట్టు వినాలి అంటూ అంటారు. వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో రాణించ గలుగుతారు. మరి కొంతమంది మీకు ఇంజెక్షన్ ఇస్తాను రా, అంటూంటారు. వీళ్ళు వైద్యవృత్తి పట్ల మక్కువ ఉన్న వాళ్ళు అని గుర్తించవచ్చు.
అభిమానం ఉందని నోటితో చెప్పనక్కర లేదు. అనుకరిస్తే అదే బాగా అర్థమవుతుంది. వాస్తవానికి అదే అసలైన అభిమానం, నిజమైన పొగడ్త. ప్రవర్తన వల్ల ఫలానావారి అభిమానులు అని అర్థం అవుతుంది.
- డా. ఎన్. అనంతలక్ష్మి