గారను క్లీన్ చేయిస్తే పళ్లు వదులైపోతాయా?
నా వయసు 25. నాకు పన్ను మీద పన్ను ఉంటుంది. డాక్టర్ని కలిస్తే వాటిలో ఒక పన్ను తీసేసి క్లిప్పుతో సరిచేస్తానన్నారు. ఇంట్లో వాళ్లు పన్నుమీద పన్ను ఉంటే అదృష్టం అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు.
- బి. రమ్యశ్రీ, హైదరాబాద్
ఇది చాలామందికి వుండే సమస్యే. వంకరపన్ను వల్ల అందమైన చిరునవ్వు దూరమవుతుంది. చిగుళ్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వంకరటింకర పళ్లున్నవారిలో చిగుళ్లనుంచి రక్తం రావడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్న వయసులోనే వీటిని సరిచేయించడం మంచి ది. పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం వస్తుందన్నది పూర్తి అశాస్త్రీయమైనది. మూఢనమ్మకం కూడా. మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంటిస్టును కలిసి మీ సమస్యను దూరం చేసుకోండి.
నా వయసు 32. చిన్నప్పటినుంచి గుట్కా, పాన్‌పరాగ్ తినడం అలవాటు. దాంతో పళ్లన్నీ నల్లగా అయ్యాయి. నవ్వాలంటే ఇబ్బందిగా ఉంటోంది. నేను పళ్లను క్లీన్ చేయించి, ఇకపై ఈ దురలవాటును మానేయాలనుకుంటున్నాను. అలా చేయడం వల్ల పళ్లన్నీ వదులై ఊడిపోతాయని కొందరు అంటున్నారు. నిజమేనా? తగిన సలహా ఇవ్వవలసింది.
- టి. అరుణ్, నెల్లూరు
పాన్‌పరాగ్, పాన్‌మసాలా, గుట్కా, జర్దా, వక్కపొడి, తంబాకు నమలడం తదితర అలవాట్లన్నీ నోటి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. వీటివల్ల కేవలం పళ్లే కాకుండా నోటిలోని భాగాలన్నీ దెబ్బతింటాయి. పంటిపై ఉండే ఎనామిల్‌పై పొగాకు ఉత్పత్తులలో ఉండే ప్రమాదకర రసాయనాలు ఇంకిపోయి పంటిపైన ఒక నల్లటిపొరలాగ పేరుకుపోయి క్రమేపీ పంటిరంగు మారిపోతుంది.
అంతేకాదు, వీటిలో ఉండే రసాయనాల దుష్ర్పభావం వల్ల లోపలి దవడలు, నాలుక మొద్దుబారిపోతాయి. ఫలితంగా నోరు పెద్దగా తెరవలేకపోవడం, ఆహారాన్ని నమలలేకపోవడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం తదితర సమస్యలతోబాటు నోటిక్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులబారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పు తెలుసుకుని గుట్కా మానేయాలని నిర్ణయించుకోవటం అభినందనీయం.
మీ స్నేహితులు చెప్పినట్లుగా గార పట్టిన పళ్లను క్లీన్ చేయించుకోవడం వల్ల పళ్లు వదులైపోవు. స్పెషలిస్ట్‌ను కలిస్తే స్కేలింగ్, పాలిషింగ్‌తో పంటిపైన ఉండే గారను తొలగించి, బాగున్న పళ్లను బ్లీచింగ్ వంటి చికిత్సలతో మరింత తెల్లగా చేస్తారు. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ ఉండవు. మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం మరచిపోవద్దు.
డాక్టర్ పార్థసారథి,
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్