... ఆ బిల్లు రూపొందించడంలో జేడీఎస్ పాత్ర లేదు
పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి
హడావుడిగా బిల్లు రూపొందించిన కాంగ్రెస్
సిద్ధరామయ్య తొందరపాటు నిర్ణయాల్లో ఇదిఒకటి
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ‘రాణాజార్జ్’
బెంగళూరు : పీఠాధిపతుల నియామకంలో వివాదాలు తలెత్తిన ధార్మిక సంస్థలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడానికి వీలుగా రూపొందించిన ‘కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల (సవరణ) బిల్లు వెనక జేడీఎస్ పాత్ర లేదని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన న్యూ ఇయర్ డైరీ విడుదల కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లుకు సంబంధించి 2007 నుంచి సుప్రీం కోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన తుది విచారణ జనవరి 11న న్యాయస్థానం ముందుకు రానుందని తెలిపారు. అయితే అంతకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా బిల్లును రూపొందించి చట్ట సభల అనుమతి పొందడం వెనక గల కారణాలేంటో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలోనే ఈ బిల్లు రూపకల్పన మొదలైందని ముఖ్యమంత్రి సిద్ధు, ఈ బిల్లు చట్టసభల వరకూ రావడానికి కర్తా, కర్మ, క్రియ జేడీఎస్-బీజేపీలు వహించాలని న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర పేర్కొనడం వారి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించించారు.
సిద్ధరామయ్య ప్రభుత్వంలో ముందస్తు ఆలోచనలు లేకుండా హడావుడి నిర్ణయాలు తీసుకోవడం తర్వాత విమర్శలు ఎదురైన వెంటనే వాటిని వెనక్కు తీసుకోవడం సర్వసాధారణమని వ్యంగమాడారు. తక్కువ ధరకు మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పడం, మూఢనమ్మకాల నిరోధన చట్టం, ఎస్సీ, ఎస్టీ, వెనుక బడిన తరగతులకు చెందిన విద్యార్థులకు మాత్రమే విజ్ఞాన, విహార యాత్రలు, ఆడంబర పెళ్లిళ్ల పై పన్ను విధింపు తదితర విషయాలు ఇందుకు ఉదాహరణాలని పేర్కొన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ‘రాణాజార్జ్’
మనుష్యుల రక్తం రుచిమరిగిన పులిని అరణ్య ప్రాంతాల్లో కాక జంతు ప్రదర్శన శాలలో ఉంచాలని నిపుణులు చెబుతారని కుమారస్వామి తెలిపారు. అయితే రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడైన రాణాజార్జ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చిక్కమగళూరు అటవీ ప్రాంతంలో ప్రజల ప్రాణాలు బలిగొన్న పులిని నిబంధనలకు విరుద్ధంగా తిరిగి ఖానాపుర అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారన్నారు. దీని వల్ల ఓ గర్భిణి చనిపోయిందన్నారు.
నరహంతక పులి జీవన విధానంపై పరిశోధనల కోసమంటూ అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. రాష్ట్ర వన్యప్రాణి అభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడైన రాణాజార్జ్ ఒత్తిడికి తలొగ్గే అటవీశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో అమాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ శాసనసభ ఫ్లోర్‌లీడర్, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఖానాపుర ఘటనపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాని డిమాండ్ చేయడం ఇక్కడ గమనార్హం.