ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల సవరణ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కొప్పాళలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ బిల్లును రూపొందించే విషయమై గత బీజేపీ ప్రభుత్వమే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిపారు. అయితే చట్ట సభల్లో బిల్లుకు అనుమతి లభించిన తర్వాత రాజకీయ దురుద్దేశ్యంతో ఆ పార్టీ రాద్ధాంతం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
ఎత్తిపోతల పథకాలకు రూ.వెయ్యి కోట్లు
గంగావతి : కొప్పళ జిల్లాలో ఎత్తిపోతల పథకానికి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించినట్లు సిద్ధరామయ్య పేర్కొన్నారు. కుష్టిగిలో పలు అభివృద్ధి పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు... కేటాయించిన నిధుల్లో రూ. 600 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కొప్పళ జిల్లా యలబుర్గా, కుష్టిగి, కొప్పళ తాలూకాలు పూర్తిగా నీటి పారుదలకు నోచుకోని డ్రై ఏరియా కావడం, గంగావతి తాలూకాలోని కనకగిరి అసెంబ్లీ క్షేత్రం పూర్తిగా నీటిపారుదల లేని భూములు ఉన్నాయని, నాలుగు తాలూకాలకు ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసి 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వివరించారు. వచ్చే ఏడాది కొప్పళ నగరంలో వైద్య కళాశాలను ప్రారంభించడం ఖాయమన్నారు.
కుష్టిగి పట్టణంలో కనకదాసుల భవన నిర్మాణానికి కోటి రూపాయలు విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతం హైదరాబాద్-కర్ణాటక అభివృద్ధికి తమ ప్రభుత్వం విశేష ప్రాధాన్యత కల్పించిందని అన్నారు. కార్యక్రమంలో కొప్పళ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి , గంగావతి ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారి, యలబుర్గా ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి, కుష్టిగి ఎమ్మెల్యే దొడ్డనగౌడ పాటిల్, కొప్పళ జిల్లా ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్, ఎమ్మెల్సీ హాలప్ప ఆచార్, మాజీ ఎమ్మెల్యే కే.శరణప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎస్... ఆ బిల్లు వెనక్కు
Published Thu, Dec 25 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM
Advertisement