ఎందుకంటే... కాపీయంట!
పరీక్షల్లో కాపీ కొట్టి రాసిన పిల్లాడు పాసయితే ఎలా పాసయ్యాడన్న విషయం అతడితో పాటు అతడు కాపీ కొట్టడం చూసినవాళ్లంతా మర్చిపోతారు. కానీ ఫెయిలయ్యాడే అనుకోండి... కాపీ కొట్టి రాస్తే అలానే ఉంటుంది, మనకంటూ బుర్ర ఉండాలి అంటారు. సినిమాల విషయంలోనూ అలానే జరుగుతుంది చాలాసార్లు. సినిమా బాగుందనుకోండి... దర్శకుడు కాపీ కొట్టి తీశాడని తెలిసినా లైట్ తీసుకుంటారు. అదే ఫెయిలయ్యిం దనుకోండి... కాపీ కొట్టి తీస్తే అలానే ఉంటుంది అంటారు. ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా విషయంలోనూ అదే జరిగింది.
పాయింటు కొత్తదే. హలీవుడ్లో సక్సెస్ అయ్యిందే. అయితే ఆ సినిమా పరాజయం పాలయ్యింది. కాపీ కొట్టి తీశాడన్న అపఖ్యాతిని, ఇంతకంటే మంచి సబ్జెక్ట్ దొరకలేదా అన్న విమర్శల్ని మిగిల్చింది.ఓ అబ్బాయి ఒకమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమి స్తుంది. కానీ చెప్పడానికి సంకోచిస్తుంది. చెబుదామని అనుకునేలోపు వాళ్లిద్దరూ ఎక్కిన బస్సుకు యాక్సిడెంట్ అవుతుంది. అతడు చనిపోతాడు. అది తట్టుకోలేని ఆమె కూడా మరణిస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ పుడతారు. ఆమె ప్యారిస్‌లో, అతడు ఇండియాలో.
ఆమె మెడిసిన్ చదువుతుంటుంది. అతడు చదువుకుని కూడా పనీ పాటా లేకుండా తిరుగు తుంటాడు. దాంతో తండ్రి, పని కోసం ప్యారిస్ పంపేస్తాడు. అక్కడ అతడు, ఆమె కలుసుకుంటారు. ఎప్పుడూ సెక్యూరిటీ నడుమ జీవితాన్ని గడపలేని ఆమె, అతడితో ఉండే దొరికే స్వేచ్ఛ కోసం ఆశపడుతుంది. ఇద్దరూ ఇండియా వెళ్లి పోదామనుకుంటారు. కానీ ఆమె ఎయిర్ పోర్టుకి రాదు. దాంతో అతడొక్కడే ఇండియా వచ్చేస్తాడు. అక్కడ ఎయిర్ పోర్టులో ఆమె కనిపిస్తుంది. ఫలానా హాస్పిటల్లో ఫలానా డాక్టర్ని కలువు అని చెప్పి మాయమైపోతుంది. తీరా అతడు వెళ్లాక ఆమె ఐసీయూలో కన్పిస్తుంది. ఏంటా అని ఆరా తీస్తే, ఓ యాక్సిడెంట్లో ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని, తనకు కనిపించింది ఆమె ఆత్మ అని తెలుస్తుంది. ఆరు జన్మల్లో వారి ప్రేమ విఫలమవ డంతో, ఈ చివరి జన్మలోనైనా దాన్ని సఫలం చేసుకోవాలని ఆమె ఆత్మ తపి స్తోందని తెలుస్తుంది. ఆమెను కాపాడు కోవడానికి హీరో పడే తపన మిగతా కథ.
ఇదీ ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా కథ. హాలీవుడ్లో సక్సెస్ అయిన ‘జస్ట్ లైక్ హెవెన్’ చిత్రంలోని ప్రధాన పాయింట్‌ను పట్టుకుని ఈ సినిమా తీయడం జరిగింది. ఆ చిత్రంలో హీరో ఓ అపార్ట్మెంట్లోకి అద్దెకు వెళ్తాడు. అంతకు ముందా ఫ్లాట్‌లో ఉన్న హీరోయిన్ ఆత్మ అతడికి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలాగైనా వదిలించు కోవాలనుకునే క్రమంలో ఆ ఆత్మతో అతడికి అనుబంధం ఏర్పడుతుంది. తర్వాత అతడికి తెలుస్తుంది ఆ అమ్మాయి చావలేదని, కోమాలో ఉందని. అప్పటికే ప్రేమలో పడిన హీరో, ఆమెను కాపాడు కోవడానికి తపన పడతాడు.
నేపథ్యాలు వేరైనా కథ ఒకటే అన్నది అర్థమైపోతుంది. క్లయిమాక్స్ అయితే అచ్చు గుద్దినట్టుంటుంది. హీరోయిన్ చని పోతే హీరో ఆమె నోటిలో గాలి ఊదు తాడు. ఆమె బతుకుతుంది. కానీ ఆత్మగా గడిపినదంతా మర్చిపోతుంది. హీరోని గుర్తు పట్టదు. కానీ చివర్లో హీరోని తాకినప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. ఇలాంటి పోలిక గల సన్నివేశాలు చాలా చోట్ల కనిపిస్తాయి. అలా అని సినిమా మొత్తం కార్బన్ కాపీ అనేయడానికి లేదు. ఎందుకంటే, కథనంలో చాలా మార్పు ఉంటుంది.
పోలిక లేని సన్నివేశాలూ బోలెడు కనిపిస్తాయి. ఆంగ్లంలో నేరుగా జరిగే కథ, తెలుగులో జన్మలతో ముడిపడి ఉంటుంది. అక్కడ హీరోయిన్ డేట్‌కు వెళ్తూ యాక్సిడెంట్‌కు గురైతే, ఇక్కడ ఇండి యన్ అంబాసిడర్ అయిన తన తండ్రిపట్ల జరుగుతోన్న కుట్ర కారణంగా ప్రాణా పాయ స్థితికి చేరుకుంటుంది. ఆంగ్ల చిత్రంలో హీరోయిన్‌కి తాను బతికే ఉన్నా నని తెలీదు. కానీ తెలుగు హీరోయిన్‌కి అన్నీ తెలుసు. ఇలా చాలా వైవిధ్యత ఉంటుంది. ఆంగ్ల సినిమాని మన నేటి విటీకి తగ్గట్టుగా మార్చడానికి తగిన కృషే చేశాడు దర్శకుడు.
బోలెడంత డ్రామా, రివెంజ్ ఎలిమెంట్ యాడ్ చేశారు. కానీ ఆ శ్రమ బూడిదలో పోసిన పన్నీరయ్యింది. మన ప్రేక్షకులకు అసలు ఈ పాయింటే రుచించలేదు. ఇంకా బతికే ఉన్న మనిషి ఆత్మ బయటకు రావడమన్న ఆలోచన మనవాళ్లను కన్విన్స్ చేయలేకపోయింది. కాబట్టి ఈ కాపీ ఫెయిల్యూర్నే మిగిల్చింది!