శబ్దం... శక్తిమంత్రం
సద్గురు జగ్గీ వాసుదేవ్
www.sadhguru.org
నాదయోగం
పాథమికంగా ఈ అస్థిత్వంలో మూడు శబ్దాలు ఉన్నాయి. ఏ ఇతర శబ్దాన్నైనా ఈ మూడు శబ్దాలతో సృష్టించవచ్చు. ఒక చిన్న ప్రయోగంతో మీరు దీన్ని గమనించవచ్చు. నాలుకను వాడకుండా మీరు చేయగలిగిన శబ్దాలను చేయండి. నాలుకను వాడకుండా మీరు చేయగలిగే శబ్దాలు మూడే అని మీరు గమనిస్తారు.
అవే ఆ, ఊ,మ్లు. మీ నాలుకను కోసేసుకున్నా మీరు ఈ మూడు శబ్దాలు చేయగలరు. వేరే ఏ శబ్దం చేయాలన్నా మీకు నాలుక వాడవలసిన అవసరం ఉంటుంది.
ఈ మూడు శబ్దాలను మీరు మీ నాలుకతో అనేక విధాలుగా కలిపి ఇతర అన్ని శబ్దాలను సృష్టించగలుగుతున్నారు. మీరు మీ నోటితో మిలియన్ శబ్దాలను సృష్టించగలరు. కానీ ఒక మూగ వ్యక్తి ఆ, ఊ, మ్ శబ్దాలను మాత్రమే చేయగలడు.
ఈ మూడు శబ్దాలను కలిపి ఉచ్ఛరిస్తే ఏమి వస్తుంది? ఆమ్ (ఓం) వస్తుంది. ఆమ్ (ఓం) ఒక మతం యొక్క ట్రేడ్ మార్క్ (వ్యాపార చిహ్నం) కాదు. అది ఈ అస్థిత్వపు ప్రాథమిక శబ్దం. శివుడు కేవలం మూడుసార్లు ‘ఆమ్ (ఓం)’ అని ఉచ్ఛరించి ఒక కొత్త ఉనికిని సృష్టించగలడని అంటారు. ఇది నిజం కాదు. కానీ సత్యం! సత్యానికి, నిజానికి మధ్య తేడా ఏమిటి? ఉదాహరణకు ఒక స్త్రీని తీసుకుందాం. ఒకరు శారీరకంగా ‘స్త్రీ’ అయినంత మాత్రాన, ఆమె తండ్రి ఆమె పుట్టుకలో పాలుపంచుకోలేదా? దానర్థం ఆమెలో తన తండ్రి అంశ లేదనా? కాదు. నిజం ఏమిటంటే ఆమె ఒక స్త్రీ. కానీ సత్యం ఏమిటంటే ఆమెలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉన్నారు. అలాగే శివుడు ఎక్కడో కూర్చుని ఆమ్ (ఓం) అని ఉనికిని సృష్టిస్తాడని కాదు. అది కాదు విషయం. విషయం ఏమిటంటే ప్రతిదీ ఒక ప్రకంపనే!
మంత్రం అంటే ఒక శబ్దం. ఒక ఉచ్ఛారణ లేక ఒక అక్షర ధ్వని. నేడు ఆధునిక విజ్ఞానం ఈ అస్థిత్వం మొత్తాన్ని ఒక శక్తి ప్రకంపనగా, వివిధ స్థాయిల్లో ఉన్న ప్రకంపనగా చూస్తుంది. ఎక్కడైతే ప్రకంపనం ఉంటుందో అక్కడ శబ్దం ఉండి తీరుతుంది. అంటే ఈ మొత్తం అస్థిత్వం ఒక రకమైన శబ్దమని లేదా శబ్దాల సంక్లిష్ట సమ్మేళనమని లేక అనేక మంత్రాల సమ్మేళనమని అర్థం. వీటిలో కొన్ని మంత్రాలు లేక శబ్దాలు గుర్తించబడ్డాయి. వీటిని ఒక నిర్దిష్ట విధానంలో ఉపయోగిస్తే, అవి మీలోని ఒక భిన్న జీవిత పార్శ్వాన్ని తెరచి, మీకో భిన్న అనుభూతిని అందించగలిగే తాళంచెవిగా మారతాయి.
మంత్రాలు చాలా మంచి సన్నాహక ప్రక్రియలు కాగలవు. కేవలం ఒక్క మంత్రమే మనుషులపై ఎంతో మహత్తరమైన ప్రభావాన్ని చూపగలదు. కానీ ఆ మంత్రం శబ్దాలన్నింటి గురించి, ఈ సృష్టినంతటి గురించి సంపూర్ణమైన అవగాహన కలిగిన ఒక మూలం నుంచి వచ్చినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. అటువంటి మూలం నుంచి, అటువంటి అవగాహన నుంచి ఒక మంత్రం వస్తే... దాంతో పాటు అది స్వచ్ఛంగా అందించబడినప్పుడు, అది ఒక సమర్ధవంతమైన శక్తి కాగలదు.
ప్రేమాశీస్సులతో,సద్గురు