పోలీసులు బేడీలు వేసి తీసుకెళ్లారని..
♦ అవమానంతో హాస్టల్ పైనుంచి దూకిన విద్యార్థి
♦ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయి గౌతమ్ మృతి
♦ ప్రేమ వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహమే కారణం
హైదరాబాద్/ గంగాధర: పోలీసుల అత్యుత్సాహానికి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలయ్యాడు. పోలీసులు అవమానించారనే మనస్తాపం తో భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రానికి చెందిన ఒల్లాల సాయిగౌతమ్ (21) నిజామా బాద్‌లో పాలిటెక్నిక్ చదివాడు. అక్కడ ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం సాయిగౌతమ్ హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ సెకండియర్ చదువుతూ నిజాంపేట్ లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. అమ్మా యి సైతం అక్కడే చదువుకుంటోంది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబసభ్యు లు ఘట్కేసర్లోని పోలీస్ ఔట్‌పోస్టులో కాని స్టేబుల్‌గా పనిచేస్తున్న తమ బంధువుకు చెప్పారు. అంతా కలిసి అమ్మాయితో సాయి గౌతమ్‌పై నిజాంపేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించగా కేసు నమోదు చేశారు.
మూడు రోజుల క్రితం పోలీసులు హాస్టల్‌కు వచ్చి సాయిగౌతమ్‌కు బేడీలు వేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయిగౌతమ్, అతని తల్లి రేణుకను బూతులు తిట్టి.. జామీనుపై విడిచిపెట్టారు. ఆ తర్వాత తల్లితో కలిసి ఇంటికివచ్చిన సాయిగౌతమ్ సోమవారం ఉదయం తిరిగి హైదరాబాద్ వెళ్లాడు. పోలీసులు తనను, తల్లిని అవమానిం చారని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకో వాలనుకున్నాడు. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసుకొని.. సోమవారం సాయంత్రం హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి దూకాడు. స్నేహితులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గౌతమ్ మంగళవారం మృతి చెందినట్లు కేపీహెచ్‌బీ సీఐ కుషాల్కర్ తెలిపారు.
కాగా, తన కొడుకు మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవా లని రేణుక ఫిర్యాదు చేసింది. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని రాత్రి గంగాధరకు తీసుకొచ్చారు. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన తండ్రి వెంకటేశం కొడుకు మరణవార్త తెలిసి హుటాహుటిన అక్కడినుంచి బయల్దేరాడు. తల్లిదండ్రులకు సాయిగౌతమ్ ఏకైక కుమారుడు కాగా.. కూతురు కూడా ఉంది.