ప్రజా భాగస్వామ్యంతోనే ‘మిషన్’ సక్సెస్
⇒ చెరువుల పునరుద్ధరణపై కేంద్ర బృందానికి వివరించిన హరీశ్
⇒ పథకం దేశానికే ఆదర్శమన్న కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయ పథకం విజయవంతమవుతోందని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చెరువుల పునరుద్ధరణను ప్రభుత్వ కార్య క్రమంలా కాకుండా ప్రజలను భాగస్వాములు చేయడంతో ఇది ప్రజా ఉద్యమంగా రూపొందిందన్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఇరిగేషన్ ఇంజనీర్ల బృందం మంగళవారం హరీశ్‌రావుతో జలసౌధలో సమావేశమైంది. కేంద్ర బృందంలోని వివిధ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు మిషన్ కాకతీయ కార్యక్రమం అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో చెరువుల మరమ్మతు పనులు గ్రామస్తులకు కూడా తెలిసేవి కావని... ఇప్పుడు ప్రజల సమక్షంలో ఉత్సవంలా పనులు జరుగుతున్నాయన్నారు. మైనర్ ఇరిగేషన్ పనుల్లో గతంలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండేదని, దాన్ని తాము సమూలంగా నిర్మూలించామన్నారు.
పథకం ప్రారంభించే ముందు సీఎం కేసీఆర్ నెలల తరబడి, వేలాది గంటలు మేధో మథనం చేశారని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకొని మిషన్ కాకతీయను రూపొందించారన్నారు. ఆన్లైన్లోనే పనుల టెండర్లు, బిల్లుల చెల్లింపులు జరుపుతున్నందున అవినీతికి అవకాశం లేకుండా చేశామని, ప్రతి అడుగులోనూ పారదర్శకత పాటిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. పలు సంస్కరణల ద్వారా పనుల అంచనాలు, అనుమతులు, టెండర్ల ప్రక్రియ, బిల్లుల చెల్లింపు వంటి వాటిని సులభతరం చేశామన్నారు. ఎన్ఆర్ఐలు, పోలీసులు, జర్నలిస్టులు ఇతర అధికారులు కూడా తమ ప్రాంతాల్లో ఒక్కో చెరువును దత్తత తీసుకొని పనులు చేపట్టారని హరీశ్‌రావు కేంద్ర బృందానికి వివరించారు. చెరువుల పూడికతీతకు ముందే మట్టి నమూనా పరీక్షలు చేస్తున్నామని, పూడిక మట్టిని రైతులు పొలాల్లో వాడుతుండటంతో ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గి పంటల దిగుబడి పెరిగిందన్నారు.
‘మిషన్’ అద్భుతం: కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్
సమావేశం అనంతరం కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ సి.కె.ఎల్.దాస్ మీడియాతో మాట్లాడుతూ సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే లక్ష్యంతో సాగుతున్న మిషన్ కాకతీయ అద్భుతమని ప్రశంసించారు. దీన్ని దేశమంతా అమలు చేసేందుకు అధ్యయనం చేయాల్సిందిగా కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి తమను తెలంగాణకు పంపారన్నారు. ఈ పథకం పనుల అనుభవాలు, సమాజంపై వాటి ప్రభావం గురించి ‘విజన్ డాక్యుమెంట్’ను రూపొందిస్తామని భోపాల్ సీడబ్ల్యూసీ సీఈ ఎస్.కె.హల్దర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఎస్.కె.జోషీ, ఇరిగేషన్ కార్యదర్శి వికాశ్‌రాజ్, ఈఎన్సీలు మురళీధర్‌రావు, విజయప్రకాశ్, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్, సీఈలు కె.సురేష్, శ్యామ్‌సుందర్, లిఫ్ట్ పథకాల సలహాదారు పెంటారెడ్డి, శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు.