enginerring college
-
ఆయుష్షు హరించారు!
సాక్షి, బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం ఆ యువకుడి పాలిట శాపంగా మారింది. 15 రోజుల పాటు వివిధ పరీక్షలు చేసి, అనేక ముందులు ఇచ్చి చివరి క్షణంలో ఇక తాము ఏమీ చేయలేమని వైద్యులు చేతులెత్తేసిన సంఘటన ఆయుష్మాన్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తమ కుమారుడిపై వైద్యులు ప్రయోగం చేసి, మంచాన పడేశారని ఆయన తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన అఖిల్ సాయి(21) అక్కడే ఉన్న జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఈయనకు తరచూ జ్వరం వస్తుందని విశాఖ జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద ఉన్న ఆయుష్మాన్ ఆస్పత్రిలో గత నెల 30న జాయిన్ చేశారు. కొద్ది రోజులకు కోలుకుంటున్నాడు అనుకున్న తురుణంలో పిట్స్ వచ్చింది. తరువాత కళ్లు కనిపించడం లేదు. ఇలా ఒక్కో అవయవం పని చేయటం మానేశాయి. ఈలోగా అఖిల్‌కు వైద్యులు బోన్‌మారో పరీక్ష చేశారు. మొదటి ఒకసారి ఈ పరీక్ష చేసినా రిపోర్ట్ రాలేదు. మరోసారి ఈ పరీక్ష చేశారు. ఈ రెండు వైద్య పరీక్షల నివేదిక 10 రోజుల తరువాత ఒకేసారి వచ్చాయి. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఈలోపు అఖిల్‌కు సంబంధం లేని వైద్యం అందించి ఆరోగ్యాన్ని క్షీణించేలా చేశారు. చివరికి ఇక చేసిందేమీ లేక ఈ నెల 16న సీఎంసీ వెల్లూరుకు వెంటిలేటర్‌పై పంపించారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని, ఇక తాము ఏమీ చేయలేమని అక్కడి వైద్యలు చెప్పడంతో మంగళవారం అఖిల్ సాయిని మళ్లీ ఆయుష్మాన్‌కు తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందళోనకు దిగారు. అఖిల్ పరిస్థితికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ధ్వజమెత్తారు. అఖిల్‌పై ప్రయోగం చేశారు.. అఖిల్ సాయికు వచ్చిన జబ్బు గురించి మాకు చెప్పకుండా అనేక మందుల ప్రయోగం చేశారు. వాళ్ల ప్రయోగానికి మేము రూ.8 లక్షలు వరకు చెల్లించాం. మేము ఎన్నిసార్లు అడిగినా రోగం గురించి చెప్పలేదు. చివరి క్షణంలో మాత్రం పరిస్థితి చేజారిపోయింది సీఎంసీకు తీసుకొని వెళ్లండి అని చెప్పారు. అక్కడికి వెళ్లినంత వరకు అఖిల్‌కు సోకిన జబ్బు మాకు తెలియలేదు. అక్కడ డాక్టర్లు చెప్పిన దానిబట్టి సరైన వైద్యం అందక పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థమైంది. కేవలం వైద్యుల ప్రయోగానికి మా అఖిల్ బలైపోయాడు. ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి. డాక్టర్లను శిక్షించి మాకు తగిన న్యాయం చేయాలి. – అఖిల్ బంధువులు చివరి క్షణంలో తీసుకొని వెళ్లామన్నారు.. చివరి క్షణం వరకు ఏమీ కాదు.. అంత బాగానే ఉంటుంది.. మంచి మందులు ఇస్తున్నాం... మీ వాడు నడుస్తాడు అని చెప్పుకొచ్చారు. రెండు రోజుల తరువాత ఒక్కసారిగా వెంటనే మీరు సీఎంసీకి తీసుకొని వెళ్లిపోవాలి లేదంటే బతకడం కష్టమని చెప్పారు. దీంతో ఏమీ చేయాలో తెలియక వెల్లూరు తీసుకుని వెళ్లాం. అక్కడ వైద్యులు మీరు చాలా ఆలస్యం చేశారు కొద్ది రోజుల ముందు తీసుకొని వస్తే బాగున్ను అని చెప్పారు. కేవలం వైద్యల నిర్లక్ష్యమే నా బిడ్డను మింగేసింది. – ప్రసాద్, అఖిల్ తండ్రి ఆ వ్యాధికి వైజాగ్‌లో చికిత్స లేదు.. అఖీల్‌కు వచ్చిన వ్యాధి మైలోడిస్ప్లషియా. ఇది 5 లక్షల మందిలో ఒకరికి వస్తుంది. రక్తనాళాల పూర్తిగా పనిచేయడం మానేశాయి. ఈ వ్యాధికి ఎముక బదిలీ వైద్యం(బోన్ ట్రాన్స్ప్లంటేషన్) తప్పించి మరొకటి లేదు. అది కూడా వైజాగ్‌లో అందుబాటులో లేదు. అందుకే వెల్లూరు పంపించాం. అప్పుడు కూడా ఒక శాతం మాత్రమే అవకాశం ఉంటుందని ముందే చెప్పాం. దానికి వారు అంగీకరించే తీసుకొని వెళ్లారు. మా వంతు ప్రయత్నం చేశాం. రోగి పట్ల ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు. – స్వామి, ఆయుష్మాన్ ఆస్పత్రి ఎండీ -
సాంకేతిక ప్రదర్శనలతో సృజనాత్మకత
కర్నూలు(జిల్లా పరిషత్): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజాత్మక ఆలోచనలు సాంకేతిక ప్రదర్శనల ద్వారా వెలుగులోకి వస్తాయని జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ లాల్‌కిశోర్ అన్నారు. నగర శివారులోని జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించనున్న విజ్ఞానమేళాను బుధవారం వీసీ లాల్‌కిశోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి టెక్నికల్ ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లోని సాంకేతిక సృజనాత్మకతను వెలికి తీయడంలో ఎంతో దోహదం చేస్తాయన్నారు. వీటి ద్వారా సాంకేతిక ప్రతిభ సామాన్యులకు కూడా అర్థమవుతుందన్నారు. కళాశాల చైర్మన్ పి. సుబ్బారెడ్డి, డెరైక్టర్ ప్రొఫెసర్ జయరామిరెడ్డి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజలు సందర్శించవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్దూర్‌నగర్ నుంచి కళాశాల వరకు బస్సులు ఉచితంగా నడుపుతామన్నారు. 125 టెక్నికల్ మోడల్స్, 20 ఎంటర్టైన్మెంట్ స్టాల్స్, 16 ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు కేశవ మెమోరియల్ స్కూల్, కట్టమంచి విద్యాసంస్థలు, మాంటిస్సోరి విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయ తదితర పాఠశాలల విద్యార్థులు సైతం ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోలార్ పార్కు ఏర్పాటు కళాశాల ప్రాంగణంలో ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో రూ.83.5లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ పార్క్(రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్)ను వీసీ లాల్‌కిశోర్, నెడ్‌క్యాప్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోదండరామమూర్తి ప్రారంభించారు. ఆగ్రో సోలార్ కంపెనీచే రూపొందించిన ఈ ప్లాంట్ 100 కిలోవాట్ల సామర్ధ్యం కలిగి ఉందని, దీనివల్ల కళాశాలలో ముప్పావు శాతం విద్యుత్ ఆదా అవుతుందని ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు అంతరించి పోయిన డైనోసార్‌ను పరిచయం చేయడం, జీపీఎస్ విదానం, సెన్సర్‌తో నడిచే ఎలక్ట్రిక్ కారు, స్నేక్ రోబోట్, ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన స్మార్ట్‌గ్రిడ్ ఆకట్టుకుంది. ప్రస్తుతం దేశమంతటా కరెంటు సరఫరా ఒకే గ్రిడ్ కింద ఉందని, దేశంలో విద్యుత్ ఉత్పత్తి నీటి ద్వారా, బొగ్గుద్వారా అణుఇంధనం ద్వారా అవుతోందని, అదే విధంగా సాంప్రదాయేతర ఇందన వనరులైన సూర్యరశ్మి, అలలు, గాలిద్వారా ఉత్పత్తి చేస్తూ వీటన్నింటినీ ఒకే గ్రిడ్ ద్వారా కలిపి, అవసరమైన చోటుకు విద్యుత్ సరఫరా చేయడం ద్వారా విద్యుత్ రవాణాలో అంతరాయం తగ్గించవచ్చని విద్యార్థులు వివరించారు. వీటితో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్, కాలేజి విద్యార్థుల ఎంటర్టైన్మెంట్ స్టాల్స్, ఫుడ్‌స్టాల్స్ సందర్శకులను అలరించాయి.