ఆయుష్షు హరించారు! | Doctors Neglect To Go to Hospital For Fever | Sakshi
Sakshi News home page

ఆయుష్షు హరించారు!

Published Wed, Jun 19 2019 11:02 AM | Last Updated on Wed, Jun 26 2019 12:18 PM

Doctors Neglect To Go to Hospital For Fever - Sakshi

ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న అఖిల్‌సాయి , పక్కనే రోగి బంధువుల ఆందోళన

సాక్షి, బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం ఆ యువకుడి పాలిట శాపంగా మారింది. 15 రోజుల పాటు వివిధ పరీక్షలు చేసి, అనేక ముందులు ఇచ్చి చివరి క్షణంలో ఇక తాము ఏమీ చేయలేమని వైద్యులు చేతులెత్తేసిన సంఘటన ఆయుష్మాన్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తమ కుమారుడిపై వైద్యులు ప్రయోగం చేసి, మంచాన పడేశారని ఆయన తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన అఖిల్‌ సాయి(21) అక్కడే ఉన్న జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఈయనకు తరచూ జ్వరం వస్తుందని విశాఖ జిల్లా పరిషత్‌ జంక్షన్‌ వద్ద ఉన్న ఆయుష్మాన్‌ ఆస్పత్రిలో గత నెల 30న జాయిన్‌ చేశారు.

కొద్ది రోజులకు కోలుకుంటున్నాడు అనుకున్న తురుణంలో పిట్స్‌ వచ్చింది. తరువాత కళ్లు కనిపించడం లేదు. ఇలా ఒక్కో అవయవం పని చేయటం మానేశాయి. ఈలోగా అఖిల్‌కు వైద్యులు బోన్‌మారో పరీక్ష చేశారు. మొదటి ఒకసారి ఈ పరీక్ష చేసినా రిపోర్ట్‌ రాలేదు. మరోసారి ఈ పరీక్ష చేశారు. ఈ రెండు వైద్య పరీక్షల నివేదిక 10 రోజుల తరువాత ఒకేసారి వచ్చాయి. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఈలోపు అఖిల్‌కు సంబంధం లేని వైద్యం అందించి ఆరోగ్యాన్ని క్షీణించేలా చేశారు. చివరికి ఇక చేసిందేమీ లేక ఈ నెల 16న సీఎంసీ వెల్లూరుకు వెంటిలేటర్‌పై పంపించారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని, ఇక తాము ఏమీ చేయలేమని అక్కడి వైద్యలు చెప్పడంతో మంగళవారం అఖిల్‌ సాయిని మళ్లీ ఆయుష్మాన్‌కు తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందళోనకు దిగారు. అఖిల్‌ పరిస్థితికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ధ్వజమెత్తారు.

అఖిల్‌పై ప్రయోగం చేశారు.. 
అఖిల్‌ సాయికు వచ్చిన జబ్బు గురించి మాకు చెప్పకుండా అనేక మందుల ప్రయోగం చేశారు. వాళ్ల ప్రయోగానికి మేము రూ.8 లక్షలు వరకు చెల్లించాం. మేము ఎన్నిసార్లు అడిగినా రోగం గురించి చెప్పలేదు. చివరి క్షణంలో మాత్రం పరిస్థితి చేజారిపోయింది సీఎంసీకు తీసుకొని వెళ్లండి అని చెప్పారు. అక్కడికి వెళ్లినంత వరకు అఖిల్‌కు సోకిన జబ్బు మాకు తెలియలేదు. అక్కడ డాక్టర్లు చెప్పిన దానిబట్టి సరైన వైద్యం అందక పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థమైంది. కేవలం వైద్యుల ప్రయోగానికి మా అఖిల్‌ బలైపోయాడు. ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి. డాక్టర్లను శిక్షించి మాకు తగిన న్యాయం చేయాలి.
– అఖిల్‌ బంధువులు

చివరి క్షణంలో తీసుకొని వెళ్లామన్నారు..
చివరి క్షణం వరకు ఏమీ కాదు.. అంత బాగానే ఉంటుంది.. మంచి మందులు ఇస్తున్నాం... మీ వాడు నడుస్తాడు అని చెప్పుకొచ్చారు. రెండు రోజుల తరువాత ఒక్కసారిగా వెంటనే మీరు సీఎంసీకి తీసుకొని వెళ్లిపోవాలి లేదంటే బతకడం కష్టమని చెప్పారు. దీంతో ఏమీ చేయాలో తెలియక వెల్లూరు తీసుకుని వెళ్లాం. అక్కడ వైద్యులు మీరు చాలా ఆలస్యం చేశారు కొద్ది రోజుల ముందు తీసుకొని వస్తే బాగున్ను అని చెప్పారు. కేవలం వైద్యల నిర్లక్ష్యమే నా బిడ్డను మింగేసింది.   – ప్రసాద్, అఖిల్‌ తండ్రి

ఆ వ్యాధికి వైజాగ్‌లో చికిత్స లేదు..
అఖీల్‌కు వచ్చిన వ్యాధి మైలోడిస్‌ప్లషియా. ఇది 5 లక్షల మందిలో ఒకరికి వస్తుంది. రక్తనాళాల పూర్తిగా పనిచేయడం మానేశాయి. ఈ వ్యాధికి ఎముక బదిలీ వైద్యం(బోన్‌ ట్రాన్స్‌ప్లంటేషన్‌) తప్పించి మరొకటి లేదు. అది కూడా వైజాగ్‌లో అందుబాటులో లేదు. అందుకే వెల్లూరు పంపించాం. అప్పుడు కూడా ఒక శాతం మాత్రమే అవకాశం ఉంటుందని ముందే చెప్పాం. దానికి వారు అంగీకరించే తీసుకొని వెళ్లారు. మా వంతు ప్రయత్నం చేశాం. రోగి పట్ల ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు.  – స్వామి, ఆయుష్మాన్‌ ఆస్పత్రి ఎండీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement